చెన్నై ఐటీ కేరాఫ్ హైదరాబాద్ | Chennai IT Care of Hyderabad | Sakshi
Sakshi News home page

చెన్నై ఐటీ కేరాఫ్ హైదరాబాద్

Published Sat, Dec 5 2015 11:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

చెన్నై ఐటీ  కేరాఫ్ హైదరాబాద్

చెన్నై ఐటీ కేరాఫ్ హైదరాబాద్

సాక్షి, హైదరాబాద్: చెన్నై నగరం నడి సంద్రంగా మారడంతో అక్కడి ఐటీ పరిశ్రమ ఆసాంతం షట్‌డౌన్ అయింది. దాదాపు అన్ని ఐటీ కంపెనీలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో ఆన్‌లైన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. టెలిఫోన్, మొబైల్ నెట్‌వర్క్ ఎక్కడికక్కడ ధ్వంసమవ్వడంతో కుటుంబ సభ్యులకు తమ క్షేమ సమాచారాన్ని అందించేందుకు కూడా వీల్లేకుండా పోయింది. ఆన్‌లైన్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులతో చర్చించేందుకు ఎటువంటి అవకాశం లేకుండా సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. చాలా ప్రాంతాల్లో రోజుల తరబడి విద్యుత్ లేకపోవడంతో చిమ్మ చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది.

ఐటీ ప్రాంగణాల్లో ఉండే ఆహ్లాదకర వాతావరణం, అత్యాధునిక సదుపాయాలు సమూలంగా తుడిచిపెట్టుకు పోయాయి. దీంతో చెన్నై ఐటీ పరిశ్రమ హైదరాబాద్ బాట పట్టింది. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టినా, చిన్నా భిన్నమైన ఐటీ పరిశ్రమ తిరిగి కోలుకునేందుకు కనీసం ఆర్నెల్లు పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమప్రాజెక్ట్‌లకు సంబంధించిన క్రిటికల్ రిసోర్స్ పర ్సన్లను ఇప్పటికే హైదరాబాద్ రప్పించాయి. చెన్నైలో స్థిర నివాసముంటున్న ఐటీ నిపుణులు మినహాయిస్తే, మిగిలిన వారిలో ఎక్కువశాతం హైదరాబాద్‌కు వలసబాట పట్టారు.

నగరానికి క్రిటికల్ రిసోర్స్..
ప్రతి ఐటీ కంపెనీకి క్రిటికల్ రిసోర్స్ పర్సన్లే ఎంతో కీలకం. ఆయా ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఒక క్రిటికల్ రిసోర్స్ పర్సన్‌కు సరైన పని వాతావరణాన్ని కల్పించగలిగితే, క్రిందిస్థాయిలో కనీసం 500 నుంచి వెయ్యిమంది వరకు ఉద్యోగులు పనిచేసేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం చెన్నై నగరంలో పని వాతావరణ పూర్తిగా పాడైనందున ప్రముఖ కంపెనీలన్నీ తమ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన క్రిటికల్ రిసోర్స్ పర్సన్లను హైదరాబాద్ రప్పిస్తున్నాయి. వారి హోదాలను బట్టి స్టార్ హోటళ్లలోనూ, తమ సొంత, అద్దె గెస్ట్‌హౌస్‌ల్లోనూ వారికి వసతి కల్పిస్తున్నాయి. మెయిన్ సర్వర్ నుంచి వీపీఎన్ యాక్సిస్ ద్వారా వారంతా పనిచేసేందుకు వీలు కలుగుతుంది. ఇటువంటి పని వాతావరణం ఉండే.. హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లా, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ తదితర స్టార్ హోటళ్లు, పలు ప్రైవేటు గెస్ట్‌హౌస్‌ల నుంచి ఇప్పటికే చాలామంది క్రిటికల్ రిసోర్స్ పర్సన్లు కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

బాధితులకు టిటా బాసట
చెన్నై నగరంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా దెబ్బతినడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా..తదితర రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు వలసబాట పట్టారు. వీరిలో ఎక్కువమంది హైదరాబాద్ నగరమే త మ తదుపరి మజిలీకి అనువైనదిగా ఎంచుకున్నట్లు తెలిసింది. ఇప్పటికిప్పడు హైదరాబాద్‌కు వలస వచ్చే వేలాదిమందికి ఐటీ ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేనందున, కనీసం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులకైనా ఇక్కడున్న కంపెనీల్లో అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఐటీ అసోసియేషన్(టిటా) ముందుకొచ్చింది. అధునాతన సదుపాయాలు కల్గిన టి-హబ్ ద్వారా కొందరికి పనిచేసేందుకు అవకాశాల కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా వివిధ కంపెనీల్లో ఉన్న ఖాళీలను వలస వచ్చిన వారితో భర్తీ చే సే విధంగా చూడాలని టిటాలో సభ్యులుగా ఉన్న 10వేలమంది  సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అసోయేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

గూగుల్ డాక్ ద్వారా బాధితులకు సాయం
వరదల కారణంగా సర్వం కోల్పోయిన చెన్నై నగర వాసులకు తమ వంతు చేయూతనందించేందుకు కూడా టిటా ముందుకొచ్చింది. చెన్నై ప్రభుత్వం ఏర్పాటు చేసిన గూగుల్ డాక్ ద్వారా హైదరాబాద్‌లోని ఐటీ  కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వంతు సాయాన్ని అందించాలని తమ అసోసియేషన్ సభ్యుల ద్వారా పిలుపునిచ్చింది. దీంతో ఆయా కంపెనీల్లో ఉద్యోగులు అడ్‌హాక్ కమిటీలుగా ఏర్పడి తాము సేకరించిన సొమ్ముతో దుస్తులు, షూస్.. తదితర వస్తువులను కొని వివరాలను గూగుల్ డాక్‌లో ఎంటర్ చేస్తున్నారు. గూగుల్ డాక్‌లోని వివరాలతో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌లతో చెన్నైలోని హెల్ప్‌లైన్స్ కాంటాక్ట్ చేసి సదరు వస్తువులను సేకరించి బాధితులకు అందజేస్తున్నాయి.
 
స్వచ్ఛందంగా సేవలందించండి..
చెన్నైలో వరద బాధిత ఐటీ ఉద్యోగులకు స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకు రావాలని హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని సహచర ఉద్యోగులకు తెలంగాణ ఐటీ అసోసియేషన్ (టిటా) సభ్యులకు పిలుపునిస్తున్నాం. అదనపు పనిగంటలు చేయడం ద్వారా వచ్చిన వేతనాన్ని బాధితులకే వెచ్చించాలని కోరుతున్నాం. బాధిత ప్రాంతాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ పరిమితిని వారానికి పెంచమని ఐటీ కంపెనీలన్నింటికీ సూచిస్తున్నాం. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లి అక్కడ్నుంచే పనిచేసేందుకు అవకాశం కల్పిస్తే మేలు. ఉద్యోగినుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే వారి కి ఒక నెలరోజుల పాటు సెలవు ఇవ్వాలి. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వలస వస్తు న్న వారికి స్థానికంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు లభ్యమయ్యేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి, చెన్నైలో చిన్నాభిన్నమైన రోడ్డు రవాణా వ్యవస్థను వీలైనంత త్వరగా మెరుగు పరచాలని అక్కడి ప్రభుత్వానికి టిటా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.
 -సందీప్ కుమార్ మక్తాల, ‘టిటా’ అధ్యక్షుడు
 
 బీసీపీతో అదనపు పని గంటలు
 ప్రముఖ కంపెనీలైన ఇన్‌ఫోసిస్, యాక్సెంచర్, ఐబీఎం, కాగ్నిజెంట్..తదితర కంపెనీలు బిజినెస్ కంటిన్యూ ప్లాన్(బీసీపీ) అగ్రిమెంట్‌ను అమలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలో పనిచేసేందుకు అవకాశం లేనందున, అక్కడ ఒక ఉద్యోగి చేసే ఎనిమిది గంటల పనిని హైదరాబాద్‌లోని తమ కంపెనీ ఉద్యోగులకే రెండేసి గంటల చొప్పున అప్పగిస్తున్నాయి. బీసీపీ అగ్రిమెంట్ మేరకు ఒక ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభ వించినపుడు వేరొక ప్రాంతంలో ఉద్యోగులు పనిచేసే అదనపు పనిగంటలు పనిచేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని టెక్నాలజీ నిపుణులు పనిభారాన్ని పంచుకోవడంతో చెన్నైలోని తోటి ఉద్యోగులకు వేతనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు.. ఉద్యోగులు చేసిన అదనపు పనికి గాను కొన్ని కంపెనీలు అదనంగా వేతనాన్ని చెల్లిస్తున్నాయి. అదన పు పనిగంటల ద్వారా వచ్చిన వేతనాన్ని దాదాపుగా అన్ని కంపెనీల ఉద్యోగులు చెన్నైలోని వరద బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

► గూగుల్ క్రైసిస్ రెస్పాన్స్..దక్షిణ భారత దేశంలో వరదల నేపథ్యంలో ప్రఖ్యాత ఐటీ కంపెనీ గూగుల్ తాజాగా క్రైసిస్ రెస్పాన్స్ టూల్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఎమర్జన్సీ సేవల వివరాలు, హెల్ప్‌లైన్ కేంద్రాలు, వసతి సదుపాయాలు, ఆయా ప్రాంతాల మ్యాప్‌లను పొందుపరిచింది. స్థానికంగా వార్తలను, వీడియోలనూ అప్‌లోడ్ చేస్తోంది. ఈ సదుపాయాన్ని గూగుల్ ఉచితంగా అందిస్తోంది.
► ప్రఖ్యాత సామాజిక మాథ్యమ సంస్థ ఫేస్‌బుక్ తమ చెకిన్ ఆప్షన్‌లో ‘సేఫ్టీ చెక్ ఫీచర్’ను తాజాగా ప్రవేశపెట్టింది. దీని ద్వారా స్నేహితులకు, బంధువులకు బాధితులు తమ యోగక్షేమాలను పంచుకునేందుకు వీలు కలుగుతోంది.
► పేటీఎం కంపెనీ చెన్నై వాసుల కోసం రూ.30 మొబైల్ రీచార్జ్‌లను ఉచితంగా అందిస్తోంది. ఎంటీఎస్ ఒక జీబీ డేటాను మూడు రోజుల పాటు ఉచితంగా అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement