- హెచ్‌ఐసీసీ వేదికగా జరిగే సదస్సుకు 80 దేశాల ప్రతినిధుల రాక
- 5న హాజరుకానున్న కేంద్ర మంత్రి రవిశంకర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఐసీసీ వేదికగా నేటి నుంచి ఐకాన్(ది ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్) 57వ సదస్సు జరుగనుంది. ఇంటర్నెట్‌కు సంబంధించి ముఖాముఖి చర్చలు, ఐరాస తరహాలో కొత్త వ్యవస్థ, స్థానిక భాషల్లో వెబ్ అడ్రస్‌ల ఏర్పాటు వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ సదస్సులో చర్చించనున్నారు. ఇంటర్నెట్ గవర్నెన్స్‌లో వెబ్‌సైట్లకు ఐటీ అడ్రస్, నంబర్లు కేటాయించే ఐకాన్ అంతర్జాతీయ సంస్థ, కేంద్ర, రాష్ట్రాల సహకారంతో నేటి నుంచి 9 వరకు జరగనున్న ఈ సదస్సులో సుమారు 3,500 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు.
వీరిలో 80 దేశాలకు చెందిన సుమారు వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశాలున్నాయని అంచనా. ఐకాన్ సంస్థలో భారత్‌సహా 165 దేశాలకు సభ్యత్వముంది. ప్రతి ఏటా ఒక్కో చోట ఐకాన్ సదస్సు నిర్వహిస్తుండగా ఈసారి హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా మారింది. ఈనెల 5న జరిగే కార్యక్రమంలో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు పాల్గొననున్నారు. పలువురు అంతర్జాతీయ ఐటీ ప్రముఖులు పాల్గొనే ఈ సదస్సులో ఇంటర్నెట్ వినియోగదారులు, డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు ఉపయోగపడేలా వినూత్న నిర్ణయాలు తీసుకోనున్నారు. దేశ జనాభాలో ప్రస్తుతం మూడో వంతు ఇంటర్నెట్ పరిధిలో ఉండగా, రాబోయే రోజుల్లో సగం జనాభా నెట్ పరిధిలోకి వస్తారని రాష్ట్ర ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యవస్థ నియంత్రణ అధికారం అమెరికా చేతుల్లోనే ఉండగా, తాజాగా ఒప్పంద గడువు ముగుస్తుండటంతో ఐక్యరాజ్యసమితి తరహాలో ఇంటర్నెట్‌ను నియంత్రించే వ్యవస్థను ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఐటీ ప్రముఖులు హాజరయ్యే ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ తెలంగాణ, టీ హబ్ కార్యక్రమాలను వివరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
నేటి నుంచి ఐకాన్ సదస్సు
Published Thu, Nov 3 2016 1:07 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement