జ్యూరిక్: బిట్‌కాయిన్ల వంటి డిజిటల్ కరెన్సీలతో ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయే ప్రమాదం పొంచి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బీఐఎస్) హెచ్చరించింది. వీటివల్ల స్టోరేజీతో పాటు ప్రాసెసింగ్ సామర్థ్యాలపరమైన సమస్యలు తలెత్తుతాయని ఒక నివేదికలో పేర్కొంది.
కంప్యూటర్స్ ద్వారా ప్రాసెస్ అయ్యే ఈ డిజిటల్ కరెన్సీల వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడం స్మార్ట్‌ఫోన్స్, సాధారణ కంప్యూటర్స్‌తో పాటు సూపర్ కంప్యూటర్స్‌కి కూడా అలవి కాని పరిస్థితి తలెత్తుతుందని, ఫలితంగా మొత్తం సర్వర్ల వ్యవస్థ అంతా నిల్చిపోయే ముప్పు ఉందని బీఐఎస్ తెలిపింది. సార్వభౌమ కరెన్సీలకు భిన్నమైన ఈ కరెన్సీలు విశ్వసనీయమైనవి కావని పేర్కొంది. వివిధ దేశాల రిజర్వ్ బ్యాంకులన్నింటికీ సెంట్రల్ బ్యాంకుగా బీఐఎస్‌ను పరిగణిస్తారు.
ప్రస్తుతం 1.7 కోట్ల బిట్‌కాయిన్లు చలామణీలో ఉన్నాయి. బిట్‌కాయిన్ల వ్యవస్థలో ఈ సంఖ్య 2.1 కోట్లకు మించడానికి లేదు. కొన్నేళ్ల క్రితం కేవలం కొన్ని సెంట్స్ స్థాయిలో ఉన్న బిట్‌కాయిన్ విలువ గతేడాది ఆఖర్లో ఏకంగా 19,500 డాలర్ల స్థాయికి ఎగిసింది. ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన వారిని కుబేరులుగా మార్చేసింది. భారత్ సహా పలు దేశాల్లో వీటిపై ఆంక్షలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment