ఇస్లామాబాద్:పాకిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో ఆదివారం(నవంబర్24) మొబైల్‌ఫోన్, ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అభిమానులు ఆందోళనలకు సిద్ధమైన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేసింది.
కాగా,పాకిస్తాన్‌లో ఎక్స్‌ను ఇప్పటికే నిషేధించడం గమనార్హం. ఏయే ప్రాంతాల్లో మొబైల్,ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేయనున్నారు, వాటిని తిరిగి ఎప్పుడు పునరుద్ధిరిస్తారన్నదానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. కాగా,మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలు పాలై ఇప్పటికి ఏడాది పూర్తయింది. అయినా ఇప్పటికీ ఇమ్రాన్ క్రేజ్ ప్రజల్లో ఏ మాత్రం తగ్గలేదు.
ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఈ పాకిస్తాన్(పీటీఐ)కార్యకర్తలు, ఆయన అభిమానులు ప్రభుత్వంపై పోరాడేందుకు ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతుంటారు.తాజాగా ఇమ్రాన్ విడుదలను డిమాండ్ చేస్తూ పీటీఈ కార్యకర్తలు ర్యాలీకి పిలుపునివ్వడంతో ప్రభుత్వం సోషల్‌మీడియాను నిషేధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ బ్యాక్‌ఎండ్‌ను బ్లాక్‌చేసినట్లు సమాచారం.
వాట్సాప్ ద్వారానే నిరసన ర్యాలీల సమాచారాన్ని పీటీఐ శ్రేణులు చేరవేస్తుండడం ఇందుకు కారణం. మరోవైపు పీటీఐకి గట్టి పట్టున్న ప్రావిన్సులైన పంజాబ్, ఖైబర్ ప్రావిన్సుల నుంచి రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లే ప్రధాన రోడ్లన్నింటిపై అడ్డుగా కంటెయినర్లు పెట్టి బ్లాక్ చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చెమటోడ్చాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment