మొబైల్ డాటా సర్వీసులపై మీ అభిప్రాయం ఏమిటి?
ట్రాయ్ ఆధ్వర్యంలో రేపు బహిరంగ చర్చ
న్యూఢిల్లీ: మొబైల్ డాటా సర్వీసుల కోసం విభిన్న ధరలు నిర్ణయించే విషయమై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఈ నెల 21న బహిరంగ చర్చ నిర్వహిస్తోంది. ఇంటర్నెట్ న్యూట్రాలిటీ (సమానత్వం) విషయంలో డాటా సర్వీసుల ధర అన్నది కీలకాంశం కావడంతో ఈ విషయంలో స్టేక్‌హోల్డర్స్ అంతా తమ అభిప్రాయాన్ని తెలుపాలని కోరింది.
'డాటా సర్వీసులకు విభిన్నమైన ధరలు' అనే పత్రంపై నిర్వహించే ఈ బహిరంగ చర్చలో ఆసక్తి కలిగిన వ్యక్తులంతా పాల్గొనాలని కోరుతూ ట్రాయ్ ఒక నోటిఫికేషన్ జారీచేసింది. న్యూఢిల్లీలోని పీహెచ్‌డీ హౌస్‌లో ఈ చర్చ జరుగుతోంది. డాటా సర్వీసులకు విభిన్నమైన ధరలు ఉండాలని టెలికం ఆపరేటర్లు కోరుతుండగా.. విభిన్న ధరలతో టెలికం ఆపరేటర్ల ఆధిపత్యం ఉండరాదని ఇంటర్నెట్ సమానత్వం కోసం పోరాడుతున్న ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఫేస్‌బుక్ ఫ్రీబేసిక్స్ పేరుతో భారీగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సమానత్వం కోసం ఉద్యమం ఊపందుకున్న సంగతి తెలిసిందే.