కామెంట్లు కూశావో..!
క్రైమ్ పేరెంటింగ్
అమ్మాయిలు ఇప్పుడిప్పుడే కొంచెం స్వేచ్ఛను పీల్చుకుంటున్నారు వాళ్లకు ఆ శ్వాస చాలా అవసరం! తమ పరిపూర్ణవ్యక్తిత్వానికి ఆ స్వేచ్ఛా ఊపిరి చాలా అవసరం!! రోడ్డు మీద నడవనివ్వడంలేదు.. ఆఫీసుల్లో కూర్చోనివ్వడంలేదు.. స్కూళ్లల్లో తలెత్తనివ్వడంలేదు.. ఇంట్లో నోరెత్తనివ్వడంలేదు! ఇప్పుడు ఇంటర్నెట్‌లో కూడా అమ్మాయిల భావవ్యక్తీకరణను అడ్డుకుంటున్నారు.. వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు.. ఆత్మాభిమానాన్ని చంపేస్తున్నారు!! అలా కామెంట్లు కూయడం ఐటీ యాక్ట్ కింద నేరం. అరెస్ట్ వరకూ వెళుతుంది. సో మన పిల్లలకు ఇప్పటినుంచే మంచి చెడ్డలు చెప్పాలి.
ఎడమచేత్తో ఓ నల్లటి పప్పీని, కుడిచేతిలో కోక్ గ్లాస్‌ను చీర్స్‌లా పెట్టి... చిలిపిగా కన్నుగీటుతూ ఉన్న ఒక ఫొటోగ్రాఫ్‌ను .. ‘విత్ మై బ్లాక్ డాగ్’ అనే కామెంట్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది ఒక టీనేజర్.. దాన్ని షేర్ చేసింది పదిహేడేళ్ల కావ్య. ‘‘ఆడోళ్లకు స్వేచ్ఛ లేదని ఎవడు అన్నది?’’ అని ఒకరు... ‘‘పాపా... నీదేం బ్రాండ్?’’ అని ఇంకొకరు.. ‘‘నేను కూడా బ్లాగ్ డాగే.. రావాలా?’’ అని మరొకరు.. ‘‘బేబీ.. నేను ఓల్డ్‌మంక్.. పర్లేదు కదా..’’ అని ఎవరో.. ఇలా రకరకాల కామెంట్స్ టైప్ అయ్యాయి ఆమె షేర్ చేసిన పోస్టింగ్ కింద. వాళ్లంతా మగపిల్లలే.. ఎఫ్‌బీ ఫెండ్సే.. కొందరైతే కావ్య క్లాస్‌మేట్స్ కూడా! నవ్వుకొని లైట్ తీసుకుంది ఆమె.
ఇంకోరోజు.. ‘రుతుచక్రం స్త్రీలకు అవమానం కాదు.. ప్రైడ్’’ అన్న ఒక కాప్షన్‌ను పోస్ట్ చేసింది కావ్య. దానికీ అంతే .. ‘‘ఏ ప్యాడ్ వాడుతావు నువ్వు?’’ ‘‘విస్పరా?’’.. ‘‘కాదేమో.. కావ్య ఫ్రీగా ఉంటుంది కదా.. కేర్ ఫ్రీ అనుకుంటా’’ ‘‘ షీ?’’ ‘‘బేబీ కాంప్లెక్షన్ పింక్... అందుకే విస్పర్ పింకేమో..’’ ఇలా ఎన్నో వ్యాఖ్యానాలు ట్రోలింగ్ స్థాయి దాటాయి.. అవన్నీ కావ్యకు చిరాకు తెప్పించినా ఓపిగ్గా ఉంది. మరోరోజు...‘‘స్లీవ్‌లెస్.. జీన్స్.. స్కర్ట్.. శారీ... నచ్చిన, నప్పిన డ్రెస్ వేసుకునే రైట్ ఆడవాళ్లకు ఉంది’’అని వాల్ మీద తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది కావ్య.
‘‘టాప్‌లెస్‌గా కూడా తిరగొచ్చు’’ ‘‘బికినీ అయితే పాపలకు చాలా బాగా సూట్ అవుతుంది’’ ‘‘చెడ్డీలు కూడా వేసుకోండి’’ ‘‘సిగ్గులేదా... పిచ్చిపిచ్చి పోస్టింగ్స్ పెట్టడానికి?’’ ‘‘దీన్నే బరితెగింపు’’ అంటారు.. ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు ఒక యాభై వచ్చాయి. బెదిరిపోయింది కావ్య. రెండు రోజులు బాధపడింది. ఆ పోస్ట్‌ను డిలీట్ చేసేసింది. దాంతో ఆమె ఇన్‌బాక్స్‌కి మెస్సేజెస్ రావడం మొదలయ్యాయి. ‘‘ఇంట్లో ఒక్కదానివే ఉంటావా?’’, ‘‘ఈ నైట్‌కి రానా?’’, ‘‘కలుస్తావా?’’, ‘‘నువ్వు నాకు నచ్చావ్?’’ లాంటివి ఏవేవో పెట్టారు కుర్రాళ్లు.ఇంకొంతమందైతే ఏకంగా బూతు బొమ్మలు పంపారు. వాళ్లందరూ ఎఫ్‌బీలో మ్యూచువల్ ఫ్రెండ్స్. షాక్ అయింది కావ్య. మర్నాడు కాలేజ్‌కి వెళ్లడానిక్కూడా భయపడింది. క్లోజ్ ఫ్రెండ్స్‌తో విషయాన్ని చెప్పింది. ఇలాంటివి తమకూ అనుభవమేనని, అందుకే ఎఫ్‌బీకి దూరంగా ఉంటున్నామని చెప్పారు వాళ్లు. ఆ మాటలతో దిగులు పెరిగింది కావ్యకు. వారమైనా తన ఎఫ్‌బీ ఇన్‌బాక్స్‌కు అలాంటి కామెంట్లు వస్తూనే ఉన్నాయి. దాంతో ఎఫ్‌బీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వణుకొస్తోంది. ‘‘మన ఫోటోస్‌ను మార్ఫింగ్ చేసి వేరేవాళ్లకు పోస్ట్ చేస్తారే.. బ్లాక్‌మెయిల్ కూడా చేస్తారు’’ ఒక ఫ్రెండ్ చెప్పిన మాట గుర్తొచ్చి ఎఫ్‌బీలో ఉన్న తన ఫోటోలన్నీ డిలీట్ చేసింది కావ్య.
దానికి సంబంధించి.. టైమ్‌లైన్ మీదే కామెంట్స్ చేశారు.. ‘‘... ఫోటోస్ ఎందుకు తీసేశావ్?’’ అని, ‘‘హేయ్.. కావ్యా.. వాట్ హ్యాపెండ్.. ఫోటోస్ ఎందుకు డిలీట్ చేశావ్.. నీలాంటి క్యూట్ గర్ల్ మాకు కనపడకపోతే.. ఎట్లా.. నిద్ర రావట్లేదు డియర్’’ అంటూ.. నోటికొచ్చినట్టు నానా చెత్త రాయసాగారు. ఇంట్లో వాళ్లకు తెలిస్తే.. తననే తప్పుబట్టి.. ‘చదువుకొమ్మంటే ఇట్లా ఎఫ్‌బీలో ఎంటర్‌టైన్ చేస్తోంద’ని ఇంటర్‌నెట్ కనెక్షనే తీసేస్తారేమోనని అమ్మానాన్నకూ చెప్పలేదు. తనే ఎఫ్‌బీ చూసుకోవడం తగ్గించింది. కాలేజ్‌లో మేల్ క్లాస్‌మేట్స్ డైరెక్ట్‌గానే కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ‘‘కావ్యా నువ్వు చాలా ఫాస్ట్.. మెన్‌స్ట్రువల్ ప్యాడ్స్ దగ్గర్నుంచి గర్ల్స్ రైట్స్ దాకా దేన్నయినా డిస్కస్ చేయగలవ్ ఎఫ్‌బీలో. గుడ్ యార్’’ అంటూ వెకిలిగా నవ్వడం, ‘‘నీలాంటి ఫ్రెండ్ ఉండడం లక్కీ డియర్’’ అంటూ బొటనవేలు పైకెత్తి చూపడం.. ‘‘మీట్ మిస్ కావ్యా.. ఫెమినిస్ట్..’’ అంటూ ఆటపట్టించడం మొదలుపెట్టారు. కొందరికి ధైర్యంగానే రిటార్ట్ ఇచ్చింది. ఇంకొందరినీ ఇగ్నోర్ చేసింది.. ఇందరితో వాదన పెట్టుకోలేక ప్రిన్సిపల్‌కి కంప్లయింట్ చేసింది.
నీదే తప్పు
జరిగిందంతా విని.. ‘‘నీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్నట్లు మీ పేరెంట్స్‌కి తెలుసా?’’ అడిగాడు ప్రిన్సిపల్ కావ్యను. ‘‘తేలీదు’’ అన్నట్లు తల అడ్డంగా ఊపింది. ‘‘సరే నువ్వు క్లాస్‌కి వెళ్లు’’ అని ఆమెను పంపించేసి, కావ్య తల్లిదండ్రులను పిలిపించాడు. కావ్య ఎఫ్‌బీలో ట్రోలింగ్, అది అబ్యూజ్ స్థాయికి వెళ్లడం గురించి చెప్పి.. ‘‘అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఆ పోస్టింగ్స్ ఏంటండి? మగపిల్లలు పోకిరీలు అని తెలిసీ, అలాంటి పోస్టింగ్స్ పెట్టడం తప్పు కదా.. పైగా తనే వచ్చి కంప్లయింట్ చేస్తోంది. ముందు అమ్మాయిని ఎఫ్‌బీ అకౌంట్ క్లోజ్ చేయమని చెప్పండి’’ అని సలహా ఇచ్చాడు ప్రిన్సిపల్.
కావ్య వాళ్లమ్మ భయపడి.. ‘‘మాతో చెప్పలేదండీ మా అమ్మాయి ఈ ప్రాబ్లం గురించి?’’ అన్నది. ‘‘మరి అలా ట్రోల్‌చేసిన, అబ్యూజ్ కూడా చేసిన పిల్లల మీద మాత్రం యాక్షన్ తీసుకోరా? నాకు తెలిసి అందులో చాలామంది కావ్య క్లాస్‌మేట్సే ఉండి ఉంటారు’’ అన్నాడు కావ్య తండ్రి కాస్త సీరియస్‌గానే. ‘‘ఆడపిల్లలు రెచ్చగొడితే మగపిల్లల బిహేవియర్ అలాగే ఉంటుంది. నేను వాళ్లను క్వశ్చన్ చేసినా అదే మాట అంటారు కూడా’’ నింపాదిగా జవాబిచ్చాడు ప్రిన్సిపల్. ‘‘అయితే తప్పు మా అమ్మాయిదే కాని అలా అవాకులు చవాకులు పేలిన వాళ్లది మాత్రం కాదంటారు’’ అన్నాడు కావ్య తండ్రి. అవాక్కయిన వాడల్లే అతని మొహం చూశాడు ప్రిన్సిపల్.‘‘మీకు తెలుసో లేదో..ట్రోలింగ్, ఆన్‌లైన్ అబ్యూజ్ కూడా హెరాస్‌మెంట్ కిందకే వస్తాయి.. ఇవన్నీ నేరాలే సర్..’’ అన్నాడు కావ్య తండ్రి కఠినంగానే.‘‘చూడండీ.. ఇది ఆ అమ్మాయి ప్రైవేట్ వ్యవహారం. మాకు సంబంధం లేదు. మీరు ఒకవేళ దీన్ని సీరియస్‌గా తీసుకుంటే ముందు టీసీ తీసుకొని, తర్వాత విషయం తేల్చుకోండి’’ అని లేచి నిలబడ్డాడు ప్రిన్సిపల్ వాళ్లను ఇక వెళ్లమన్నట్టుగా. ‘‘థాంక్స్’’ చెప్పి భార్యను తీసుకొని బయటకు వచ్చాడు కావ్య తండ్రి.
కంప్లయింట్...
తెల్లవారి కూతురి ఫేస్‌బుక్ అకౌంట్‌లోని ఆమె పోస్టింగ్స్, వాటికి వచ్చిన కామెంట్స్ ప్రింటవుట్స్‌తో సహా కావ్యనూ తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు ఆమె తండ్రి వినయ్. జరిగిందంతా పోలీసులకు కంప్లైంట్‌గా రాసిచ్చింది కావ్య సాక్ష్యాలుగా ఆ ప్రింట్ అవుట్స్‌ను జతచేస్తూ. క్లాస్‌మేట్స్‌ని ముందుగా పిలిపించారు.. మిగిలిన వాళ్లనూ పిలిపించారు. అందరూ 18 ఏళ్లలోపు మగపిల్లలే. కావ్యకు ‘సారీ’ చెప్పించి, రెండు గంటలు స్టేషన్‌లోనే ఉంచి తల్లిదండ్రుల ముందే వాళ్లకు కౌన్సెలింగ్ చేశారు పోలీసులు. మళ్లీ ఎవరి విషయంలోనైనా ఇలాంటిది రిపీట్ అయితే పనిష్మెంట్ సీరియస్‌గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చి మరీ పంపించేశారు.
కాని..
ట్రోలింగ్ అనేది ఐటి యాక్ట్, 2000 కింద నేరమే. ఐపీసీలోని స్టాకింగ్, డిఫమేషన్, ఆడపిల్ల ఆత్మాభిమానాన్ని కించపరిచారనే నేరాల కింద కేస్ పెట్టచ్చు. ఆన్‌లైన్‌లో మహిళలు హెరాస్‌మెంట్ ముఖ్యంగా రేప్ థ్రెట్ ఎదుర్కొంటుంటే ఐపీసీ సెక్షన్ 507 కింద కేస్ వేయొచ్చు. అలాగే అనుమతి లేకుండా అమ్మాయిల (స్నేహితులైనా, సన్నిహితులైనా సరే) ఫోటోలు పోస్ట్ చేయడం, వాళ్ల ప్రైవసీనీ భంగం చేయడం లాంటి వాటికి పాల్పడితే ఐటీ యాక్ట్, సెక్షన్ 66 ఈ, పనిష్మెంట్ ఫర్ వయోలేషన్ ఆఫ్ ప్రైవసీ కింద నేరంగా పరిగణిస్తారు. అసభ్యకర పదజాలం, చిహ్నాలు, ప్రతీకాత్మక చిత్రాలు, బొమ్మలు, దృశ్యాలు వంటివి పోస్ట్ చేసి సదరు వ్యక్తి పేరు, ప్రతిష్టలు, గౌరవానికి భంగం కలిగించేలా చేసినా శిక్షార్హులే. అంతేకాదు, మహిళ ఆత్మాభిమానాన్ని కించపరిచేలా పదాలు, చిహ్నాలు వంటివి పెట్టినా ఐపీసీ సెక్షన్ 509 కింద నేరం. నిర్భయ చట్టంలోని సెక్షన్ 354ఏ, 354డి సెక్షన్లు హెరాస్‌మెంట్ వయా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ నేరాలను సూచిస్తున్నాయి.
మనం ఆచరిస్తే... వాళ్లు అనుసరిస్తారు!
పిల్లలు టీన్స్‌లోకి వచ్చాకే అన్నీ చెప్తాం అంటే ఈ రోజుల్లో కుదరదు. అందుకే వాళ్లకు పది, పన్నెండేళ్ల వయసు వచ్చాక ఇంటర్నెట్, దాని ప్రభావాలు, అందులో చర్చకు వచ్చే విషయాలు మొదలైన వాటి గురించి నెమ్మది నెమ్మదిగా– వాళ్ల మనసుకు తగ్గట్టుగా చెబుతూ పోవాలి. టీన్స్‌లో పిల్లలు కుదురుగా కూర్చొని వినరు. అందుకే కాస్త ముందుగానే పిల్లలతో మాట్లాడటం, సమకాలీన విషయాలు, మంచిచెడ్డల గురించి చర్చించడం మొదలుపెట్టాలి. అమ్మాయిలకు గౌరవం ఇవ్వడం, వాళ్లకూ భావాలను ఎక్స్‌ప్రెస్ చేసే హక్కు ఉందని, వాళ్ల భావాలనూ మనం గౌరవించాలని చెప్పడమే కాదు, మన చేతల ద్వారా చూపించాలి.
అంటే.. ఇంట్లో పెద్దవాళ్లు ఇంట్లో ఆడవాళ్లను, అమ్మాయిలను గౌరవంగా చూడ్డం, వాళ్ల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే మగపిల్లలూ అలాగే వ్యవహరిస్తారు. బయటి ఆడపిల్లలకూ అంతే మర్యాద ఇస్తారు. అంతేకాదు, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్‌వర్క్ సిస్టమ్‌లో ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తే దానికి కామెంట్ పెట్టేముందు మన కళ్లెదుటే ఆ వ్యక్తి ఉంటే కఠినంగా, అమర్యాదగా మాట్లాడలేం కదా, కాబట్టి కామెంట్ కూడా అంతే మర్యాదగా ఉండాలి. పిల్లలు తప్పుగా ఆలోచించినప్పుడు, తప్పు చేసినప్పుడు బాల్యం నుంచే సరిదిద్దుతూ ఉండాలి. దాంతో చిన్నప్పటినుంచే ఎదుటివాళ్లపట్ల మర్యాదగా మెలగడం, గౌరవంగా వ్యవహరించడం అలవడుతుంది.
– డాక్టర్ పద్మ పాల్వాయి, చైల్డ్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్
– శరాది