భారత్లోనూ ఫేస్బుక్ ఎక్స్ప్రెస్ వైఫై..
గ్రామాల్లో చౌక ఇంటర్నెట్ టెల్కోలతో కలిసి సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ మరోసారి వార్తల్లోకెక్కింది. చవక, నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు ఎక్స్‌ప్రెస్ వైఫై పేరుతో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ‘ఎక్స్‌ప్రెస్ వైఫై సేవలను ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెల్కోలు, స్థానిక వ్యాపారులతో కలిసి పరీక్షిస్తున్నాం. ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కనెక్టివిటీ విస్తరణకు నడుం బిగించాం.
ఇతర ప్రాంతాలకు త్వరలో అడుగుపెడతాం’ అని కంపెనీ తన వెబ్‌సైట్లో వెల్లడించింది. కంపెనీ తొలుత గ్రామీణ ప్రాంతాల్లో సేవలను ప్రారంభిస్తుంది. గతంలో రిలయన్‌స కమ్యూనికేషన్‌సతో కలిసి ఫ్రీ బేసిక్స్ (ఇంటర్నెట్.ఓఆర్‌జీ) పేరుతో బేసిక్ ఇంటర్నెట్ సర్వీసులు అందించాలని భావించిన ఫేస్‌బుక్ ప్రణాళిక బెడిసి కొట్టిన సంగతి తెలిసిందే.
ఫేస్‌బుక్ అన్నీ తానై..
పబ్లిక్ వైఫై సేవలు ఫ్రీ బేసిక్స్ మాదిరిగా కొన్ని వెబ్‌సైట్లకే పరిమితం అవుతుందా? లేదా ఏవైనా పరిమితులు ఉన్నాయా అన్న విషయాన్ని ఫేస్‌బుక్ తన వెబ్‌సైట్లో వెల్లడించలేదు. కొత్త ప్రాజెక్టులో భాగంగా స్థానిక వ్యాపారులతో ఫేస్‌బుక్ చేతులు కలుపుతుంది. సమీపంలో ఉన్నవారికి ఇంటర్నెట్ అందించడం ద్వారా వ్యాపారులకు స్థిర ఆదాయం వస్తుందని కంపెనీ తెలిపింది. ప్రాజెక్టుకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను ఫేస్‌బుక్ సమకూరుస్తోంది. డిజిటల్ వోచర్లు కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్లు అతి తక్కువ వ్యయానికే వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఆస్వాదిస్తారని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. భాగస్వాములందరి కోసం స్థిరమైన ఆర్థిక విధానంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని చెప్పారు. ఈ విధానంలో భారతీయులందరినీ ఆన్‌లైన్‌లోకి తీసుకు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.