నెట్‌లో చిక్కిన నవతరం | youth haking on networking | Sakshi
Sakshi News home page

నెట్‌లో చిక్కిన నవతరం

Published Wed, Aug 3 2016 11:30 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

youth haking on networking

రోటీ, కపడా, ఔర్ మకాన్! ఇప్పుడు ఎక్స్‌ట్రాగా... ఇంటర్నెట్! ఎక్స్‌ట్రా కాదు. నెట్టే మెయిన్ అయింది!ఏం తిన్నాం, ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం.. అని పట్టించుకోకుండా నేటి తరం నెట్‌లోగూడు కట్టుకుని నివాసం ఉంటోంది. బయటికి రమ్మంటే రాదు. ‘అదే లోకం కాదు’ అంటే వినదు. ఈ నెట్ వ్యసనంపై ‘ఫ్యామిలీ’ పరిశీలనాత్మక కథనం. 


అమ్మా నాన్నలకు దూరంగా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న చైతన్య ఆ ఊళ్ళోనే ఉన్న మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి తెగ ఇబ్బంది పడుతుంటాడు. ‘ప్రతి శని, ఆదివారాలు సెలవులే కదా! రూమ్‌లో ఉండడమెందుకు? మా దగ్గరకొచ్చి, ఆ రెండు రోజులూ ఇక్కడే ఉండి వెళ్ళు’ అని అమ్మమ్మ, మేనమామ చెప్పినా వినడు. చైతన్య వాళ్ళ కుటుంబానికీ, ఆ మేనమామ కుటుంబానికీ ఆస్తి తగాదాలు లేవు. మాట పట్టింపులు లేవు. అనుబంధం, ఆత్మీయతల్లో పొరపొచ్చాలేమీ లేవు. మరి కారణం ఏమిటంటారా? సదరు మేనమామ గారి ఇంట్లో ‘వై-ఫై’ లేదు. పోనీ మనవాడు తన ఫోన్‌లోని ఇంటర్నెట్ డేటా వాడుకుందామనుకుంటే, అక్కడ ఆ మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ తాలూకు సిగ్నల్స్ సరిగ్గా పనిచేయవు. చేతిలోని మొబైల్ ఫోన్‌లోనే ప్రతి కాసేపటికీ ఇ-మెయిల్, ఫేస్‌బుక్, వాట్సప్ చూసుకొనే చైతన్యకు అది ప్రాణసంకటమే!

 
ఇవాళ అన్నం, నీళ్ళ కన్నా ఎక్కువగా ఇంటర్నెట్‌ను ప్రేమిస్తున్నవాళ్ళలో చైతన్య లాంటి చాలామందే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే, దేశంలో దాదాపు 24.6 శాతం మంది నవ యౌవనులు ఇలా ‘ఇంటర్నెట్ వ్యసనం’తో బాధపడుతున్నారు. దీన్నే ఇప్పుడు ‘ఇంటర్నెట్ ఎడిక్షన్ డిజార్డర్’ (ఐ.ఎ.డి) అంటున్నారు.

 
ఏడెనిమిదేళ్ళ క్రితం దాకా మన దేశంలో ఇంటర్నెట్‌కు కొత్త వినియోగదారులు అంతంత మాత్రంగానే వచ్చి చేరేవారు. కానీ, స్మార్ట్‌ఫోన్ విప్లవం పుణ్యమా అని ఇప్పుడు త్వరలోనే మన దేశంలో ఇంటర్నెట్ వాడకందార్ల సంఖ్య దాదాపు 50 కోట్లకు చేరనుంది. సాక్షాత్తూ కేంద్ర మంత్రి గారే ఈ సంగతి ఇటీవల ప్రకటించారు. వైఫై సులభంగా అందుబాటులోకి రావడం, అందుబాటు ధరల్లోనే స్మార్ట్ ఫోన్లు, టచ్ స్క్రీన్ అనుభవం, చేతిలోనే ట్యాబ్లెట్‌లు - వీటన్నిటితో రాగల రోజుల్లో మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరగనుంది. అందుకే, ఇప్పుడీ ‘ఇంటర్నెట్ వ్యసనం’ గురించి కాస్తంత గట్టిగానే ఆలోచించు కోవాల్సి వస్తోంది. ఇప్పటికే, మన దేశంలోని ఇంటర్నెట్ వాడకందార్లలో ప్రతి వంద మందిలో 12 మందికి ఈ జబ్బు అంటుకుంది. సాక్షాత్తూ, ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్’ వారు శాస్త్రీయంగా బయటపెట్టిన సంగతి ఇది.

 
ప్రపంచమంతా ఇదే సమస్య!

నిజం చెప్పాలంటే, ఒక్క మన దేశంలోనే కాదు... ఇవాళ ప్రపంచమంతటా వివిధ దేశాల్లో ఈ సమస్య పెరుగుతోంది. ఇతర దేశాలన్నిటి కన్నా ముందుగా టెక్నాలజీని అందిపుచ్చుకున్న జపాన్ దేశం మున్ముందుగా ఈ ‘ఇంటర్నెట్ వ్యసనం’ జబ్బును గుర్తించింది. జపాన్‌లో 12 నుంచి 18 ఏళ్ళ లోపు పిల్లల్లో దాదాపు 5 లక్షల పైచిలుకు మంది ఇలా కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్లలో ఇంటర్నెట్ స్క్రీన్‌కు అతుక్కుపోతున్నారు. హైస్కూలు పిల్లలైతే ఏకంగా వారానికి 6 గంటల పైగా సమయం ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారు. ఈ ఇంటర్నెట్ పిచ్చితో ఏకంగా స్కూలు కూడా ఎగ్గొట్టేస్తున్నారు.

 
అతిగా వాడుతున్నాం! అనర్థం తప్పదు!

నిజం చెప్పాలంటే, అమెరికా లాంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో మొబైల్ డేటా వినియోగం వాటిలో పదో వంతు మాత్రమే! కానీ, ‘విశ్వవ్యాప్త వేదిక’ కొత్తగా అరచేతిలో అందుబాటులోకి వచ్చిన మన భారతీయ యువతరం, పిల్లలు నెట్‌ను అతిగా వాడుతుండడం సమస్యగా మారింది. నిరంతర ఇంటర్నెట్ వాడకం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక అనర్థాలు తప్పవని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. అతిగా నెట్ వాడితే సృజనాత్మకత కుంటుపడుతుంది. జ్ఞాపకం పెట్టుకొనే సత్తా తగ్గుతుంది. అలాగే, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి కూడా దెబ్బతింటుంది. అతిగా ఇంటర్నెట్ వాడేవారు తరచూ అసహనానికి లోనవుతారు. ఇక, ఇ-మెయిల్స్ కోసం, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా నెట్‌వర్క్ సైట్స్ కోసం స్మార్ట్ ఫోన్లను వాడేవారిలో మానసిక ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. రాత్రీ, పగలూ తేడా లేకుండా అనుక్షణం ఫోన్‌లో ఆన్‌లైన్‌లో ఉంటూ, ‘వరల్డ్ వైడ్ వెబ్’తో అనుసంధానమై ఉండాలనుకొనేవారు ‘వైఫై’ జోన్‌కు దూరమవుతున్నా, మొబైల్ బ్యాటరీ పడిపోతున్నా విపరీతంగా అధైర్యపడతారు. ఇవన్నీ కుటుంబ సంబంధాలతో పాటు సామాజిక సంబంధాలకూ పెద్ద దెబ్బ అని శాస్త్రవేత్తలు తేల్చారు.

 
జపాన్‌లో ఇంటర్నెట్ ఉపవాసం!

పిల్లల్లో నెట్ పిచ్చి సమస్యకు పరిష్కారం కోసం జపాన్ విద్యాశాఖ ‘ఇంటర్నెట్ ఉపవాసం’ శిబిరాలు అంటూ ఒక వినూత్న ఆలోచన చేసింది. నెట్ వ్యసనానికి గురైన పిల్లల్ని ఆ శిబిరంలో కొన్నాళ్ళు పాల్గొని, శారీరక శ్రమతో చేసే పనుల్లో పాల్గొనేలా చేస్తారు. వాళ్ళను అలా ‘ఆన్‌లైన్’ ప్రపంచపు కమ్యూనికేషన్ నుంచి బయటకు తెచ్చి, చుట్టూ ఉన్న అసలు ప్రపంచంతో, తోటి పిల్లలతో, ఇతరులతో అసలు సిసలు కమ్యూనికేషన్ జరిపేలా చూస్తారు. ప్రాథమికంగా, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ల సంబంధాల కన్నా మానవ సంబంధాలు ముఖ్యమని బోధిస్తారు. ఈ ‘ఇంటర్నెట్ ఉపవాసం’ క్యాంపులు విజయవంత మవుతున్నాయి. వీటి వల్ల పిల్లలు ఆన్‌లైన్‌లో గడిపే సమయం తగ్గినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది.

 
సాంకేతికంగా అభివృద్ధి చెందిన మరో దేశమైన దక్షిణ కొరియా అయితే, ఈ ‘నెట్ వ్యసనా’న్ని ఏకంగా ప్రజా ఆరోగ్య సంక్షోభంగా భావిస్తోంది. జనాన్ని ఈ వ్యసనం నుంచి బయట పడేయడానికి ‘ఐ విల్’ (నేను చేస్తాను) కేంద్రాలంటూ తమ రాజధాని సియోల్‌లో పెట్టింది. ఇరవై నాలుగేళ్ళ లోపు పిల్లలు, పెద్దల్లో ఇలా నెట్, స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలైన వారికి ఈ కేంద్రాల్లో కౌన్సెలింగ్ ఇస్తారు. నెట్‌కు బానిస కాకుండా ఉండాలంటే ఏం చేయాలో బోధిస్తారు. ప్రత్యామ్నాయ కార్యకలాపాలు సూచిస్తారు.

 
మన దగ్గరా వచ్చేశాయ్!

చాలామందికి తెలియనిది ఏమిటంటే, సిగరెట్లు, మందుకు బానిసైనవారికి పునరావాస, చికిత్సా కేంద్రాలు ఉన్నట్లే ఇప్పుడు మన దేశంలో నెట్ వ్యసనానికి లోనైనవాళ్ళకు ‘ఇంటర్‌నెట్ డీ-ఎడిక్షన్ సెంటర్లు’ వచ్చేశాయి. దేశంలోని ప్రతిష్ఠాత్మక మానసిక ఆరోగ్య కేంద్రమైన ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసెన్సైస్’ (నిమ్‌హ్యాన్స్) ఇలాంటి ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసింది. టెక్నాలజీని ఆరోగ్యకరంగా వాడుకోవడం ఎలాగో ఈ కేంద్రంలో నచ్చజెబుతారు. ఇలాంటి సెంటర్లు ఇప్పుడు దేశంలోని కొన్ని ఇతర నగరాల్లో కూడా వస్తున్నాయి. మన దేశంలో నెట్‌కు బానిసలవుతున్నవారి సంఖ్య అంతకంతకూ లక్షల్లో పెరుగుతున్నందు వల్ల ఇలాంటి ‘డీ-ఎడిక్షన్ సెంటర్లు’ మరిన్ని రావాల్సిన అవసరం ఏర్పడింది.

ఇంతకీ మనమేం చేయాలి!
అయితే, ఇప్పటికీ మనదేశంలో చాలామంది ఈ ‘నెట్ వ్యసనం’ పెను సమస్య అని గుర్తించడం లేదు. ప్రపంచంలో కెల్లా యువ జనాభా ఇండియాలోనే ఎక్కువని సంబరపడు తున్న మనం ఇకనైనా కళ్ళు తెరిచి, ఈ ముందు యుగం దూతల్లో సరైన అలవాట్లు చేయడం ముఖ్యం. మన దేశ సంస్కృతికి మూలమైన బలమైన కుటుంబ సంబంధాలే ఈ నెట్ వ్యసనానికి విరుగుడు అని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, దేశంలోని అన్ని రకాల వ్యసనాలనూ ఒకే గొడుగు కిందకు తెచ్చి, వాటికి చికిత్సా కేంద్రంగా సింగపూర్ ప్రభుత్వం ‘నేషనల్ ఎడిక్షన్స్ మేనేజ్‌మెంట్ సర్వీస్’ (నామ్స్) ను ప్రారంభించినట్లే మన దేశంలోనూ మొదలు పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం మాట అటుంచితే, ముందుగా మనం మన ఇళ్ళల్లో పిల్లల మీద దృష్టి పెట్టాలి. నెట్‌ను బాధ్యతాయుతంగా వాడాల్సిన అవసరాన్ని నచ్చజెప్పాలి. పిల్లల్లో సృజనాత్మకత, విషయాల్ని గ్రహించే శక్తి పెరగాలంటే - ప్రపంచంతో సంబంధం ఉండాలే తప్ప, వర్చ్యువల్ ప్రపంచంతో కాదని గుర్తించాలి. ఆ సంగతి పిల్లలకూ అర్థమయ్యేలా చెప్పాలి. నెట్ వ్యసనానికి గురైన పిల్లల లక్షణాల గురించి తల్లితండ్రులకు చెప్పి, నివారణ చర్యలు సూచించడంలో పాఠశాలలూ పాత్ర పోషించాలి. ఆఫీసులోనే కాదు... ఇంటికి రాగానే కూడా కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలో ఫేస్‌బుక్, వాట్సప్, ఇ-మెయిల్స్‌తో గడుపు తున్న ఈ తరం తల్లితండ్రులు ఇకనైనా కళ్ళు తెరుస్తారా? ఆన్‌లైన్‌తో కన్నా పిల్లలతో వ్యక్తిగతంగా గడిపే సమయం ఇటు తమకీ, అటు పిల్లలకీ మంచిదని గ్రహిస్తారా?

 

 

 పిల్లలకూ అలవాటు చేస్తున్నాం!

 ఇటీవల మరో ధోరణి బాగా పెరిగింది. పిల్లలు ఆడుకోవాలంటే, వాళ్ళను బయటకు వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే వాళ్ళ చేతికి మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, ఇతర గ్యాడ్జెట్లు ఇచ్చేస్తున్నాం. అదేమంటే, అవే ఆధునిక ఆట వస్తువులని సంబరపడుతున్నాం. ‘మా అబ్బాయికి ఇంకా మాటలు కూడా సరిగ్గా రాలేదు కానీ, స్మార్ట్ ఫోన్‌లో గేమ్స్ బ్రహ్మాండంగా ఆడతాడు’ అని చంకలు గుద్దుకుంటున్నాం. కానీ, శారీరకంగా, మానసికంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లల్ని బాహ్యప్రపంచంలో తమ ఈడువాళ్ళతో ఆడుకోనివ్వకుండా, ఇంట్లో నాలుగు గోడల మధ్య కంప్యూటర్‌లోని వర్చ్యువల్ వరల్డ్‌లో బందీ చేయడం వల్ల అన్ని రకాలుగా నష్టమే.

 

వాడకమంటే మనదే!
ఇవాళ ఇంటర్నెట్ వాడకందార్ల సంఖ్యలో ప్రపంచం మొత్తం మీద చైనా తరువాత రెండో స్థానం మన ఇండియాదే! ఆ మాటకొస్తే, నెట్ యూజర్ల సంఖ్యలో మనం అమెరికాను కూడా అధిగమించేశాం.  {పపంచంలోకెల్లా శరవేగంతో ఇంటర్నెట్ వాడకందార్లు పెరుగుతున్న ప్రధాన మార్కెట్ మన దేశమే.  వెంచర్ క్యాపిటలిస్ట్ మేరీ మీకర్ సిద్ధం చేసిన ‘ఇంటర్నెట్ ట్రెండ్స్’ ప్రకారం ఒక్క గడచిన 2015లోనే మన దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 40 శాతం పెరిగింది. యూజర్ల సంఖ్య 27.7 కోట్ల మందికి చేరింది. 2014 కన్నా 2015లో నెట్ వాడకందార్లు పెరిగిన ఏకైక దేశం మనదే. 2014లో పెరిగిన వాడకందార్లు 33 శాతం మందే. మన దేశంలో రోజూ 6.8 కోట్ల మంది తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ చూస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇక ఇంటర్నెట్ వాడకం పెరిగేది తక్కువ కాబట్టి, ఇవాళ ఫేస్‌బుక్, దాని ప్రత్యర్థి అయిన గూగుల్ లాంటివి మన దేశంపై కన్నేశాయి. మన దేశంలోని కొత్త యూజర్లకు గాలం వేయడం కోసం అందుకు తగ్గ ఉత్పత్తులు, ప్రోగ్రామ్‌లు రూపొందిస్తున్నాయి.       - రెంటాల జయదేవ

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement