Marc Andreessen
-
బుద్ధొచ్చింది.. క్షమాపణ చెప్పాడు!
బ్లూమ్‌బెర్గ్: ఫేస్బుక్ ప్రీ బేసిక్స్ నిషేధించినందుకు భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మార్క్ అండ్రీసేన్ గురువారం క్షమాపణ చెప్పాడు. ఇంటర్నెట్ చార్జీల్లో వివక్షను వ్యతిరేకిస్తూ ట్రాయ్ నిర్ణయం తీసుకోవడంతో భారత్‌పై మార్క్ అండ్రీసేన్ తీవ్ర అక్కస్సు వెళ్లగక్కాడు. భారత్ పెట్టుబడిదారి వ్యతిరేక దేశమని, ఆ దేశం ఇప్పటికీ బ్రిటిష్ పాలనలో ఉండి ఉంటే ఇంకా మెరుగ్గా ఉండేదని అతను నోరు పారేసుకున్నాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఫేస్బుక్ బోర్డు మెంబర్, సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన మార్క్ తీరుపై ఫేస్బుక్ భారత యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఈ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన మార్క్ అండ్రీసేన్ గురువారం క్షమాపణలు కోరాడు. 'భారత రాజకీయాలు, చరిత్ర గురించి నేను గతంలో చేసిన ట్వీట్ ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. నేను భారత్‌ను , భారత ప్రజలను ఎంతగానో మెచ్చుకుంటాను' అని అతను తాజాగా పేర్కొన్నాడు. కొన్ని పరిమిత వెబ్సైట్లను చూసేందుకు వీలుగా ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ పథకాన్ని భారత్‌లో ప్రవేశపెట్టాలని చూసిన సంగతి తెలిసిందే. అయితే ట్రాయ్ తాజా ఈ నిర్ణయంతో ఈ పథకానికి చెక్ పడింది. -
మనం బ్రిటిష్ పాలనలో ఉంటేనే బాగుండేదట!
భారత్‌పై ఫేస్బుక్ సభ్యుడి అక్కసు! న్యూయార్క్: మొబైల్ ఇంటర్నెట్ టారీఫ్‌లో వివక్షకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు భారత్‌పై ఓ ఫేస్బుక్ బోర్డు మెంబర్ ఒకరు తీవ్ర అక్కసు వెళ్లగక్కాడు. భారత్ నిర్ణయం పెట్టుబడిదారులకు వ్యతిరేకమని, భారత్ ఇంకా బ్రిటిష్ పాలనలో ఉంటేనే బాగుండేదని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, ఫేస్బుక్ బోర్డు మెంబర్ అయిన మార్క్ అండ్రీస్సెన్ ట్విట్టర్లో ఈ వ్యాఖ్యలు చేశాడు. అతని పార్ట్నర్ బెనెడిక్ట్ ఎవన్స్ కూడా ట్రాయ్ నిర్ణయంపై తన విద్వేషాన్ని వెళ్లగక్కాడు. ఆన్లైన్లో పొందే సమాచారం ఆధారంగా ఇంటర్నెట్ సేవలకు భిన్నమైన చార్జీలు వర్తింపచేయాలని పేర్కొంటూ ఫేస్‌బుక్‌తోపాటు కొందరు మొబైల్ ఆపరేటర్లు ప్రచారం చేశారు. ఫేస్బుక్ ఏకంగా ఫ్రీబేసిక్స్ పేరిట భారీ ప్రకటనలతో ఈ విషయంలో ప్రచారం చేసింది. అయితే ఇంటర్నెట్ సమాచారాన్ని పొందే విషయంలో ఇలాంటి వివక్షలకు ఎంతమాత్రం అంగీకరించబోమని భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తేల్చిచెప్పడంతో వాటికి ఎదురుదెబ్బ తగిలింది. ఫేస్బుక్ ఫ్రీ బేసిక్ ప్రచారానికి తెరపడింది. ట్రాయ్ నిర్ణయాన్ని సామాజిక కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. ఇంటర్నెట్ సమానత్వానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని వారు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఫేస్బుక్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.