బుద్ధొచ్చింది.. క్షమాపణ చెప్పాడు!
బ్లూమ్‌బెర్గ్: ఫేస్‌బుక్ ప్రీ బేసిక్స్ నిషేధించినందుకు భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మార్క్ అండ్రీసేన్ గురువారం క్షమాపణ చెప్పాడు. ఇంటర్నెట్ చార్జీల్లో వివక్షను వ్యతిరేకిస్తూ ట్రాయ్ నిర్ణయం తీసుకోవడంతో భారత్‌పై మార్క్ అండ్రీసేన్ తీవ్ర అక్కస్సు వెళ్లగక్కాడు. భారత్ పెట్టుబడిదారి వ్యతిరేక దేశమని, ఆ దేశం ఇప్పటికీ బ్రిటిష్ పాలనలో ఉండి ఉంటే ఇంకా మెరుగ్గా ఉండేదని అతను నోరు పారేసుకున్నాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఫేస్‌బుక్ బోర్డు మెంబర్, సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన మార్క్ తీరుపై ఫేస్‌బుక్ భారత యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ స్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఈ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.
దీంతో దిగొచ్చిన మార్క్ అండ్రీసేన్ గురువారం క్షమాపణలు కోరాడు. 'భారత రాజకీయాలు, చరిత్ర గురించి నేను గతంలో చేసిన ట్వీట్ ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. నేను భారత్‌ను , భారత ప్రజలను ఎంతగానో మెచ్చుకుంటాను' అని అతను తాజాగా పేర్కొన్నాడు. కొన్ని పరిమిత వెబ్‌సైట్లను చూసేందుకు వీలుగా ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ పథకాన్ని భారత్‌లో ప్రవేశపెట్టాలని చూసిన సంగతి తెలిసిందే. అయితే ట్రాయ్ తాజా ఈ నిర్ణయంతో ఈ పథకానికి చెక్ పడింది.