న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సేవలను అందించడంలో వివక్షను సహించేది లేదని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కుండబద్దలుకొట్టింది. నెట్ న్యూట్రాలిటీకే తమ మద్దతు అని తేల్చిచెప్పింది. ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, టెలికం కంపెనీలు సహా ఈ రంగంలోని ఏ సంస్థలైనా సరే కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్‌లను ఎలాంటి నెట్‌చార్జీలు లేకుండా ఉచితంగా అందించడం, అదేవిధంగా మరికొన్ని వెబ్‌సైట్లు, యాప్‌లను విస్మరించడం.. అడ్డుకోవడం వంటి చర్యలను నిషేధించాలని సూచించింది. నెట్‌న్యూట్రాలిటీపై ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సిఫార్సుల నివేదికను మంగళవారం ట్రాయ్ విడుదల చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం(టెలికం శాఖ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. నెట్ సేవల్లో వివక్షపై గతేడాదే ట్రాయ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుత లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం.. ఇంటర్నెట్‌లో సమాచారం (కంటెంట్)ను
అందించే విషయంలో కొన్నింటికి అధిక చార్జీలు, మరికొన్నింటికి తక్కువ చార్జీలు లేదా ఉచితంగా సేవల వంటివి లేకుండా నియంత్రణరహిత సేవలను ప్రొవైడర్లు కల్పించాలి’ అని ట్రాయ్ పేర్కొంది. నెట్ న్యూట్రాలిటీపై ఇదివరకే చర్చాపత్రాన్ని విడుదల చేసి వివిధ పక్షాల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించింది. వీటన్నింటినీ పరిశీలించి.. తాజా సూచనలను కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు కేంద్రం కూడా ఓకే చెబితే... ఇకపై ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు(ఐఎస్‌పీ) వెబ్ ట్రాఫిక్(కంటెంట్)ను ఇష్టానుసారం అడ్డుకోవడం లేదా నియంత్రించడం(కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ఫోన్లు ఇలా ఏవిధమైన పరికరానికి సంబంధించినదైనా), కొందరు కంటెంట్ ప్రొవైడర్లకు వేగవంతమైన సర్వీసులు(ఫాస్ట్ లేన్స్) కల్పించడం వంటి వాటికి పూర్తిగా అడ్డుకట్టపడుతుంది.
అమెరికా వెనకడుగు...
కాగా, నెట్ న్యూట్రాలిటీకి మద్దతుగా ఒబామా సర్కారు 2015లో తీసుకొచ్చిన నిబంధనలను పక్కనబెట్టి కొత్త నిబంధనల రూపకల్పనకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్ ప్రతిపాదించిన కొద్దిరోజులకే ట్రాయ్ నివేదిక వెలువడటం గమనార్హం. ఐఎస్‌పీలన్నింటినీ సమాన సేవలందించే సంస్థలుగా(కామన్ క్యారియర్లు) పరిగణించకుండా.. కంటెంట్ ఆధారంగా వాటిని ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థలుగా విభజించాలనేది పాయ్ ప్రతిపాదన. దీనిపై వచ్చే నెలలో పూర్తిస్థాయిలో కమిషన్ ఓటింగ్ జరపనుంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌న్యూట్రాలిటీకి మద్దతుగా పలుదేశాలు నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ప్రస్తుత ట్రంప్ సర్కారు మాత్రం దీనిపై మెలిక పెడుతుండటంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ట్రాయ్ సిఫార్సులు ఏం చెబుతున్నాయంటే...
♦ టెలికం కంపెనీలు, ఐఎస్‌పీలు... ఇంటర్నెట్ ద్వారా అందించే కంటెంట్, సర్వీసులకు సంబంధించి విభిన్న డేటా చార్జీలు, ఉచిత సేవలు వంటి చర్యలకు పాల్పడకూడదు. ఆన్‌లైన్ వీడియోలకు ఎక్కువతక్కువ స్పీడ్‌లతో వివక్షకు తావుండరాదు.
♦ కంటెంట్ ఆధారిత ఇంటర్నెట్ యాక్సెస్(సేవలు)లో వివక్షను నిరోధించేందుకు ప్రొవైడర్ల లెసెన్స్ నిబంధనలను మార్చాలి.
♦ కంటెంట్‌ను అడ్డుకోవడం, స్పీడ్‌ను తగ్గించడం, స్పీడ్ విషయంలో కొందరికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటి ఎలాంటి జోక్యాన్ని అయినా వివక్షగానే పరిగణించాలి.
♦ సమాచారం పంపేవాళ్లు–అందుకునేవాళ్లు, సర్వీసు ప్రోటోకాల్స్, వినియోగించే పరికరాలు(ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, మొబైల్స్ ఇతరత్రా) ఆధారంగా అసమానతలకు తావిచ్చేవిధంగా కంటెంట్‌ను అందించే సంస్థలతో సర్వీసు ప్రొవైడర్లు ఒప్పందాలు కుదుర్చుకోకుండా నిషేధం విధించాలి.
♦ అయితే, ఈ వివక్షరహిత ఇంటర్నెట్ విధానం విషయంలో కొన్ని ‘ప్రత్యేక సర్వీసు’లకు మినహాయింపు ఇవ్వొచ్చు. ముఖ్యంగా చాలా కీలకమైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఎలక్ట్రా నిక్ ఉపకరణాలను ఇంటర్నెట్‌తో అనుసంధానించడం) సేవల విషయంలో నిబంధనల సడలింపు అవసరం. డ్రైవర్‌లెస్ కార్లు, టెలీ–సర్జరీ వంటి సేవలు దీనికిందికి వస్తాయి.
♦ నెట్ న్యూట్రాలిటీని కచ్చితంగా అమలుచేయాలంటే దేశంలో ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించిన లైసెన్స్ ఒప్పందాల నిబంధనల్లో సవరణలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల నిబంధనల్లో సమానత్వానికి కూడా దోహదం చేస్తుంది.
♦ కొత్త నిబంధనల పర్యవేక్షణతోపాటు ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు టెలికం శాఖ ఒక బహుళపక్ష మండలిని ఏర్పాటు చేయాలి. దీనిలో టెలికం ఆపరేటర్లు, ఐఎస్‌పీలు, కంటెంట్ ప్రొవైడర్లు, సామాజిక సంస్థలు, వినియోగదారులకు ప్రతినిధులకు చోటు కల్పించాలి.
♦ టెలికం అపరేటర్లు తమ వెబ్ ట్రాఫిక్ నిర్వహణ విధానాలను ప్రకటించాల్సి ఉంటుంది. అదేవిధంగా యూజర్లపై దాని ప్రభావం వంటి అంశాలనూ వెల్లడించాలి. ప్రత్యేక సేవలు, కంటెంట్ ప్రొవైడర్లతో కుదుర్చుకునే ప్రత్యక్ష, పరోక్ష ఒప్పందాలు వంటివన్నీ బహిర్గతపరచాలి.
సమానత్వం తప్పనిసరి...
ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ అనేది దేశాభివృద్ధితో ముడిపడిన అత్యంత ముఖ్యమైన వేదిక అని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత, సమానత్వంతో కూడిన ఇంటర్నెట్ సేవల కల్పనకు ఆయన పిలుపునిచ్చారు. ‘ఇంటర్నెట్ ఒకరిసొత్తుకాదు. ఇదొక బహిరంగ వేదిక. అందరికీ ఒకేవిధమైన సేవలు లభించాలి. అంతేకానీ, ఒకరినొకరు అంతంచేసుకునే(క్యానిబలైజ్డ్) విధంగా వ్యవహరించడం మంచిదికాదు. సర్వీసు ప్రొవైడర్లు ఇంటర్నెట్‌పై నియంత్రణలు(గేట్ కీపింగ్) విధించకూడదు’ అని శర్మ వ్యాఖ్యానించారు. వినూత్నతల ఆవిష్కరణ(ఇన్నోవేషన్), స్టార్టప్‌లు, ఆన్‌లైన్ లావాదేవీలు, విభిన్న ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు ‘డిజిటల్ ఇండియా’ ప్రోగ్రామ్ సాకారం కావడంలో ఇంటర్నెట్ ప్రధాన భూమిక పోషిస్తోందని.. ఇటువంటి వేదికపై వివక్షకు తావుండకూడదని ఆయన పేర్కొన్నారు. కాగా, నెట్ న్యూట్రాలిటీకి మీరు(ట్రాయ్) మద్దతుగా నిలుస్తుంటే.. అమెరికా నియంత్రణ సంస్థ మాత్రం 2015 నాటి నిబంధనలను రద్దుచేయనుండటంపై అడిగిన ప్రశ్నకు.. భారత్‌లోని పరిస్థితులకు అనుగుణంగా ట్రాయ్ మార్గదర్శకాలు, సూచనలను రూపొందిస్తోందని బదులిచ్చారు.
‘దేశంలో 130 కోట్ల జనాబాలో 50 కోట్ల మంది నెట్ సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఇంటర్నెట్ ఆధారంగా ఎన్నో గొప్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో దీన్ని వివక్షరహితంగా ఉంచడం చాలా కీలకం. టెలికం, ఐఎస్‌పీ నెట్‌వర్క్‌లు కంటెంట్ యాక్సెస్ విషయంలో తటస్థంగా వ్యవహరించాల్సిందే’ అని శర్మ స్పష్టం చేశారు. కాగా, నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ తాజా కార్యాచరణ ప్రణాళిక ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందన్న ప్రశ్నపై స్పందించేందుకు శర్మ నిరాకరించారు. లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించేవారికి జరిమానాలు ఉంటాయని.. అంతేకానీ, నెట్ న్యూట్రాలిటీ నియమాల ఉల్లంఘనకు ప్రత్యేకంగా జరిమానాలను ట్రాయ్ ప్రతిపాదించలేదని పేర్కొన్నారు. ఇక ఓవర్ ద టాప్(ఓటీటీ– అంటే నెట్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్ వంటివి) సేవలపై కూడా త్వరలోనే ట్రాయ్ చర్చా పత్రాన్ని విడుదల చేయనుంది.
నెట్ న్యూట్రాలిటీ అంటే...
ఇంటర్నెట్ ద్వారా యూజర్లు చూసే, వాడుకునే కంటెంట్ విషయంలో సర్వీసు ప్రొవైడర్లు(టెలికం సంస్థలు, ఐఎస్‌పీలు ఇతరత్రా) వివక్ష చూపకుండా సమానత్వాన్ని పాటించడమే నెట్ న్యూట్రాలిటీ. అంటే కొన్ని కంటెంట్ ప్రొవైడర్ల సేవలను(వెబ్‌సైట్లు, యాప్‌ల వంటివి) ఎలాంటి డేటా చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా అందించడం, మిగతావాటికి చార్జీలు వసూలు చేయడం లేదంటే కొన్ని వెబ్‌సైట్లకు అధిక స్పీడ్, మరికొన్నింటికి తక్కువ స్పీడ్‌తో వచ్చేవిధంగా చేయడం వంటి అసమానతలు లేకుండా చూడటమే నెట్ న్యూట్రాలిటీ ప్రధానోద్దేశం. రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ తన కంటెంట్‌ను ఎలాంటి డేటా చార్జీలు లేకుండా ఉచితంగా అందించేందుకు టెలికం ఆపరేటర్లతో ఒప్పందం చేసుకోవడంతో గగ్గోలు మొదలైంది. మిగతా కంటెంట్ ప్రొవైడర్ల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో నెట్ న్యూట్రాలిటీపై దేశవ్యాప్తంగా చర్చమొదలైంది. అదేవిధంగా ఎయిర్‌టెల్ కూడా ‘ఎయిర్‌టెల్ జీరో’ పేరుతో కొన్ని ఎంపిక చేసిన వెబ్‌సైట్లను డేటా చార్జీల్లేకుండా ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గతేడాది ఫిబ్రవరిలో ట్రాయ్ నెట్ న్యూట్రాలిటీకి మద్దతుగా ఫేస్‌బుక్‌కు సంబంధించిన ‘ఇంటర్నెట్.ఆర్గ్’, ‘ఎయిర్‌టెల్ జీరో’ వంటి ప్లాట్‌ఫామ్స్‌ను నిషేధించింది. కాగా, ఇంటర్నెట్ ఆధారిత యాప్‌ల ద్వారా దేశీయంగా వాయిస్ కాల్స్(వాట్సాప్, స్కైప్ వంటివి)పై నియంత్రణ ఉండాలని, ఈ సేవలను టెలికం ఆపరేటర్ల సర్వీసుల కిందే పరిగణించాలన్న ట్రాయ్ ప్రతిపాదనలపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వివిధ పరిశ్రమ సంఘాలు, సామాజికవేత్తలు దీనిపై నిరసన గళం వినిపించారు కూడా.
తలోమాట..
ట్రాయ్ నెట్ న్యూట్రాలిటీ సిఫారసులపై భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. వెబ్ ద్వారా అనియంత్రిత సేవలు, కంటెంట్ పొందేందుకు ట్రాయ్ సిఫారసులు ఉపకరిస్తాయని ఇంటర్నెట్ సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఈ అంశానికి ట్రాయ్ నామమాత్రపు నిర్వచనమే ఇచ్చినట్టు టెలికం ఆపరేటర్లు పేర్కొనడం గమనార్హం. దేశంలో ఇంకా నెట్ అందుబాటు లేని వారిని కనెక్ట్ చేసేందుకు ఉద్దేశించిన అంశాలను ట్రాయ్ పరిష్కరించలేదని... అలాగే, కాల్స్, మెస్సేజ్‌లకు వీలు కల్పిస్తున్న వాట్సాప్, స్కైప్, వైబర్, గూగుల్ డ్యుయో వంటి యాప్స్‌కు లైసెన్సింగ్‌పైనా మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తమైంది.
దేశంలో ఇంకా సేవలు అందని 100 కోట్ల ప్రజలను కనెక్ట్ చేసేందుకు వీలుగా నెట్ న్యూట్రాలిటీపై మేము మరింత విస్తృత విధానాన్ని సూచించాం. ఈ విధానం దేశ అవసరాలకు అనుగుణంగానే ఉండాలి. కానీ, ట్రాయ్ మాత్రం పరిమిత విధానాన్నే సూచించింది. సిఫారసులను ఇంకా అధ్యయనం చేస్తున్నాం. తర్వాత మా అభిప్రాయాలను వివరంగా తెలియచేస్తాం.
– రాజన్ ఎస్ మాథ్యూస్, సీవోఏఐ డైరెక్టర్ జనరల్
ప్రగతిదాయక, ఆచరణాత్మక సిఫా రసులు ఇవి. దేశంలో డిజిటల్ సేవల విస్తరణ అవసరాలను గుర్తించినట్టయింది. ఇంటర్నెట్ అన్నది చైనా, అమెరికా మాదిరిగా కాకుండా ఉచితంగా, స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యపు సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. సిఫారసులపై ప్రభుత్వం వేగంగా స్పందించాలి.
– ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్‌లను నెట్‌న్యూట్రాలిటీ నియంత్రణల నుంచి మినహాయించాలంటూ ట్రాయ్ సూచించినందున రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రయోజనకరం. ఇవి ఇప్పటికే కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లుగా ఉన్నాయి.
– ఎడెల్‌వీజ్ రిపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment