‘నెట్’పై ట్రాయ్‌కు 24 లక్షల మెయిల్స్...
న్యూఢిల్లీ: వేర్వేరు వెబ్‌సైట్లు, యాప్స్‌కు వివిధ రకాల డేటా చార్జీల వసూలు విధాన ప్రతిపాదనకు (డిఫరెన్షియల్ ప్రైసింగ్) టెలికం సంస్థలు తమ మద్దతు తెలిపాయి. ఇంటర్నెట్ వ్యవస్థలో నవకల్పనలను ప్రోత్సహించేందుకు, మరింత మందికి నెట్‌ను చేరువ చేసేందుకు ఇలాంటివి తోడ్పడగలవని పేర్కొన్నాయి. టెల్కోల సమాఖ్యలు సీవోఏఐ, ఏయూఎస్‌పీఐలు ఈ మేరకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి సంయుక్త లేఖ రాశాయి. మరోవైపు, ఇంటర్నెట్ సేవలు అందించడంలో టెల్కోలు తటస్థ వైఖరితో ఉండాలన్న (నెట్ న్యూట్రాలిటీ) ప్రతిపాదనలో కీలకమైన డిఫరెన్షియల్ ప్రైసింగ్ మీద చర్చాపత్రంపై ట్రాయ్‌కి రికార్డు స్థాయిలో దాదాపు 24 లక్షల పైగా అభిప్రాయాలు వచ్చాయి.
వీటిలో దాదాపు 80 శాతం సమాధానాలు (సుమారు 18.94 లక్షలు) సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ఫేస్‌బుక్‌కి చెందిన ఫ్రీ బేసిక్స్ సేవలకు అనుకూలంగా ఉన్నాయి. వీటిలో చాలా మటుకు సమాధానాలు ఎటువంటి వ్యక్తిగత ఈమెయిల్ ఐడీలు లేకుండా.. ‘సపోర్ట్‌ఫ్రీబేసిక్స్‌డాట్‌ఇన్’ నుంచి, మరో 5.44 లక్షల కామెంట్లు.. ఫేస్‌బుక్‌మెయిల్‌డాట్‌కామ్ నుంచి వచ్చినట్లు పరిశీలనలో వెల్లడైంది. అటు నెట్ న్యూట్రాలిటీకి అనుకూలంగా సేవ్ ది ఇంటర్నెట్ వంటి వేదికల ద్వారా 4.84 లక్షల కామెంట్స్ వచ్చాయి.
నిర్దిష్ట యాప్స్‌ను, వెబ్‌సైట్లను కొన్ని టెల్కోలు, వాటి భాగస్వామ్య సంస్థలు డేటా చార్జీల ప్రసక్తి లేకుండా యూజర్లకు ఉచితంగా అందిస్తుండటంపై వివాదం రేగడంతో, ఈ తరహా ప్రయోగాల గురించి ట్రాయ్ చర్చాపత్రం విడుదల చేయడం, అభిప్రాయాలు సమీకరించడం సంగతి తెలిసిందే.