చిన్న పట్టణాల్లో బీపీవో సెంటర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బీపీవో విధానాన్ని ఖరారు చేసినట్లు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 48,000 సీట్ల ఏర్పాటుకు అనుమతించినట్లు వివరించారు. జనాభా ఆధారంగా కాల్ సెంటర్లలో సీట్లను వివిధ రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కాల్ సెంటర్ల ఏర్పాటు కోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించనున్నట్లు ఆయన వివరించారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. చిన్న పట్టణాల్లో కూడా కాల్ సెంటర్ల కార్యకలాపాలు ప్రారంభమైతే ఐటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని వివరించారు.