ఇండియా పోస్ట్ యాప్ షురూ
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ యాప్‌ను టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ యాప్‌లో ట్రాకింగ్, తపాలా శాఖ కార్యాలయ వివరాలు తెలుసుకోవడం, పోస్టేజ్ క్యాల్‌కులేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖను దేశ ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారని చెప్పారు. చివరకు మావోయిస్టులు కూడా ఎక్కడ ప్రజల మద్దతు కోల్పోతామేమోనని తపాలా నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. ఈ-కామర్స్ రంగంలో ఇండియా పోస్ట్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు.
అమెజాన్, స్నాప్‌డీల్ తదితర ఈ-కామర్స్ సంస్థలు ఇండియా పోస్ట్ సేవలను వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. తపాలా శాఖలో పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోమని హామీ ఇచ్చారు. ఇండియా పోస్ట్ దాదాపు 1.55 లక్షల తపాలా కార్యాలయాలను కలిగి ఉంది. వీటిలో 1.39 లక్షల కార్యాలయాలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి.