40వేల వైఫై హాట్‌స్పాట్స్: బీఎస్‌ఎన్‌ఎల్
ఇండోర్: దేశవ్యాప్తంగా 40,000 పైచిలుకు వై-ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. 4జీ సర్వీసులు అందించేందుకు కావల్సిన స్పెక్ట్రం తమ వద్ద లేదని, దీంతో ప్రత్యామ్నాయంగా వై-ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సర్వీసులు 4జీ కన్నా వేగంగా ఉంటాయన్నారు. ఈ స్కీము కింద ప్రస్తుతం 500 హాట్‌స్పాట్స్‌ను నెలకొల్పామని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీటిని 2,500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నామని శ్రీవాస్తవ తెలిపారు.
ఇక, టెలికం సర్వీసులను మెరుగుపర్చుకునేందుకు రూ. 5,500 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 25,000 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఆరోగ్యానికి హానికరమైన రేడియేషన్ వస్తుందనే అపోహతో మొబైల్ టవర్ల ఏర్పాటుకు వ్యతిరేకత వస్తుండటం వల్ల కూడా కాల్ డ్రాప్ సమస్య తీవ్రమవుతుండటానికి కారణమన్నారు.