Wi-Fi hotspots
-
PM WANI: ‘ఊరూరా పబ్లిక్ వైఫై.. గేమ్ ఛేంజర్’
ఊరూరా పబ్లిక్ వైపై అందించడం కోసం గత సంవత్సరం డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం పీఎం వాణి స్కీమ్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. దేశంలో లక్షలాది వైఫై హాట్స్పాట్లను సృష్టించేందుకు పీఎం వాణి ఎంతగానో ఉపయోగపడనుంది. చౌకగా కోట్లాది మందికి బ్రాడ్సేవలు అందుబాటులోకి వస్తుంది. ఈ పథకంతో ఉద్యోగాల కల్పనతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థల ఆదాయాన్ని పెంచడం అలాగే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి కూడా దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. తాజాగా ట్రాయ్ చైర్మన్ పి.డి. వాఘేలా బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం శుక్రవారం నిర్వహించిన వర్చ్యువల్ సమావేశంలో పీఎం వాణీ పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఎం వాణి స్కీమ్‌తో అందరికి ఇంటర్నెట్ రావడమే కాకుండా భారత్ వృద్ధిలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పథకంతో భవిష్యత్తులో గ్రామాల్లో సమూలమార్పులు రానున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఇంటర్నెట్ వాడకం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. డిజిటల్ ఇండియావైపు పరుగులు తీస్తోన్న మన దేశానికి అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం అవసరమని తెలిపారు. ప్రస్తుతం భారత్ 750 మిలియన్లకు పైగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 500 మిలియన్ల వరకు కనెక్షన్లు ఉండవచ్చు. ఇంటర్నెట్తో సామాజిక ఆర్థిక రంగాల్లో దేశ ముఖచిత్రం మారిపోవడం కాయమని తెలిపారు. పీఎం వాణీ వేగవంతం సూచనలు చేసిన బీఐఎఫ్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం ఈ సమావేశంలో రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నెక్ట్స్ జనరేషన్ వైఫై టెక్నాలజీ పేరుతో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. పీఎం వాణీ పథకం కాస్త వేగంగా ముందడుగు వేయడానికి ప్రస్తుతం ఉన్న అంతరాలను తొలగించాలని ఈ పత్రంలో తెలిపారు. అంతేకాకుండా పథకంపై విసృత స్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొంది. పథకం కోసం చిన్న పారిశ్రామికవేత్తలకు పిడిఓ / పిడిఒఎ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం సులభంగా బ్యాంకు రుణాలు, యుఎస్ఓఎఫ్ (యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్) నుంచి నిధులు సమకూర్చాలని సూచించింది. రోమింగ్‌ను మరింత సులభతరం చేయడం కోసం తగిన మార్పులు చేయాలని పేర్కొంది చదవండి: Joker Virus: బీ అలర్ట్..! ఈ యాప్‌లు డిలీట్ చేసి ‘జోకర్’ని తరిమేయండి -
11వేల వైఫై హాట్‌స్పాట్స్: 4వేల బస్టాప్‌ల్లో కూడా!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో త్వరలో పెద్ద ఎత్తున బహిరంగ వైఫై హాట్స్పాట్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ నగరమంతటా 11వేల వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. ఇందులో నాలుగువేల వైఫై హాట్స్పాట్లు బస్టాప్‌ల్లో ఏర్పాటుచేయనుండగా, మరో ఏడువేలు మార్కెట్లలో అందుబాటులోకి తీసుకొస్తామని, దీంతో నగరమంతటా ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని కేజ్రీవాల్ వివరించారు. ఈ పథకంలో మొదటి 100 వైఫై హాట్స్పాట్లను ఈ నెల 16న ప్రారంభించబోతున్నామని, ఈ పథకం కోసం రూ. 100 కోట్ల ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. దశలవారీగా 500చొప్పున వైఫై హాట్స్పాట్లు ఏర్పాటుచేసుకుంటూపోతామని, మొత్తం ఆరు నెలల్లో 11వేల హాట్స్పాట్లు ఏర్పాటుకానున్నాయని చెప్పారు. ఈ వైఫై హాట్స్పాట్ల ద్వారా ప్రతి వ్యక్తి నెలకు 15జీబీల ఇంటర్నెట్ డాటాను ఉపయోగించుకోవచ్చు. 2015 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని ఈ సందర్భంగా కేజ్రీవాల్ చెప్పారు. పబిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో 11వేల వైఫై హాట్స్పాట్ల ఏర్పాటు ప్రతిపాదనను గత ఆగస్టులో ఢిల్లీ సర్కారు ఆమోదించింది. ఈ పథకం కింద సర్కారు ప్రతి ఏడాది రూ. 100 కోట్లు ఖర్చు చేయనుంది. -
40వేల వైఫై హాట్‌స్పాట్స్: బీఎస్ఎన్ఎల్
ఇండోర్: దేశవ్యాప్తంగా 40,000 పైచిలుకు వై-ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. 4జీ సర్వీసులు అందించేందుకు కావల్సిన స్పెక్ట్రం తమ వద్ద లేదని, దీంతో ప్రత్యామ్నాయంగా వై-ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సర్వీసులు 4జీ కన్నా వేగంగా ఉంటాయన్నారు. ఈ స్కీము కింద ప్రస్తుతం 500 హాట్‌స్పాట్స్‌ను నెలకొల్పామని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీటిని 2,500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నామని శ్రీవాస్తవ తెలిపారు. ఇక, టెలికం సర్వీసులను మెరుగుపర్చుకునేందుకు రూ. 5,500 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 25,000 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఆరోగ్యానికి హానికరమైన రేడియేషన్ వస్తుందనే అపోహతో మొబైల్ టవర్ల ఏర్పాటుకు వ్యతిరేకత వస్తుండటం వల్ల కూడా కాల్ డ్రాప్ సమస్య తీవ్రమవుతుండటానికి కారణమన్నారు. -
గ్రామీణ ప్రాంతాల్లో వంద వైఫై హాట్స్పాట్లు
న్యూఢిల్లీ: కేంద్రం చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్బుక్.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్తో కలసి గ్రామీణ భారతంలో వంద వైఫై హాట్‌స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఏర్పాటు చేసే ఒక్కో హాట్‌స్పాట్ సెంటర్‌కు రూ. 5 లక్షల చొప్పున ఏటా రూ. 5 కోట్లను ఫేస్బుక్ ఖర్చు చేయనుందని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ వైఫై హాట్‌స్పాట్ కేంద్రాలను క్వాడ్జెన్ సంస్థ ఏర్పాటు చేసి, నిర్వహిస్తుందని, ఇప్పటికే 25 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. -
హైదరాబాద్‌లో మరో 200 ఫ్రీ వైఫై కేంద్రాలు..
హైదరాబాద్ : నగరవాసులకు శుభవార్త. ఎన్నో రోజుల నుంచి వైఫై సదుపాయం కోసం వేచి చేస్తున్నవారికి జీహెచ్ఎంసీ ఉపశమనం కలిగించబోతోంది. వైఫై సేవలందించేందుకు హైదరాబాద్‌లో 200 వైఫై కేంద్రాలను గుర్తించింది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ 10 కోట్లు కూడా కేటాయించారు. ఇందిరా పార్క్, కేబిఆర్ పార్క్, సంజీవయ్య పార్క్, తదితర ప్రాంతాలతోపాటు సెంట్రల్ మాల్, పంజాగుట్ట, నెక్లెస్ రోడ్ లాంటి ప్రాంతాల్లో తొలుత ఈ సేవలను ప్రారంభించాలని జీహెచ్ఎంపీ యోచిస్తోంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో మూడు గంటలపాటు ఉచిత వైఫై సేవలు తొలత అందించి ఆ తరువాత పూర్తి స్థాయిలో ఈ సేవలను అందించాలనుకొంటోంది. ఇందుకు సంబంధించి అతి త్వరలోనే ఈ మెయిల్, ఫోన్ నంబర్ ఇవ్వనుంది, ఇందులో సంప్రదించిన వారికి వైఫై పాస్‌వర్డ్‌ను అందిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. కాగా ఇప్పటికే హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ఏరియాలలో సుమారు 8కిలోమీటర్ల మేరకు ఈ వైఫై సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.