టెల్కోల స్పెక్ట్రం షేరింగ్‌కు ఆమోదం
న్యూఢిల్లీ : కాల్ డ్రాప్ సమస్యను తగ్గించే దిశగా ఒకే బ్యాండ్‌విడ్త్‌లో టెలికం స్పెక్ట్రం షేరింగ్ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. టెలికం సంస్థలు స్పెక్ట్రంను పరస్పరం ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే స్పెక్ట్రం లీజింగ్‌కు మాత్రం అనుమతించలేదు. అటు టెలికం రంగంలో స్థిరీకరణకు కీలకమైన స్పెక్ట్రం ట్రేడింగ్ నిబంధనలపైనా నిర్ణయం తీసుకోలేదు.
ఒకే తరహా బ్యాండ్‌లో స్పెక్ట్రం కలిగి ఉన్న రెండు టెలికం కంపెనీలు మాత్రమే షేరింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. మార్కెట్ రేటు చెల్లించి తీసుకున్న స్పెక్ట్రంను కూడా షేరింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మొబైల్ టవర్లు వంటి వాటిని మాత్రం టెలికం ఆపరేటర్లు షేర్ చేసుకోవడానికి వీలుంది.