
న్యూఢిల్లీ: అశేష భక్త జనవాహిని తరలివస్తోన్న ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొనబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి ఐదో తేదీన ప్రధాని మోదీ త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానం ఆచరిస్తారని ఆయా వర్గాలు మంగళవారం తెలిపాయి. మరోవైపు ఈనెల 27వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించనున్నారు. గంగా హారతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అధికారులతో భేటీ కానున్నారు. అమిత్ షా వారంరోజుల్లో వస్తుండటంతో కుంభమేళాలో భద్రతను మరోసారి సమీక్షించారు. ప్రధాన కూడళ్ల వద్ద మరోసారి తనిఖీలుచేశారు.
ఫిబ్రవరి ఒకటో తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారు. నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దట్టంగా పొగమంచు కమ్ముకున్నాసరే భక్తులు మంగళవారం సైతం భారీస్థాయిలో పుణ్యాస్నానాలు ఆచరించారు.
జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన పూర్తికానుంది. మౌని అమావాస్య (రెండో షాహీ స్నానం) వచ్చే జనవరి 29న , ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి రోజు (మూడో షాహీ స్నానం), ఫిబ్రవరి 12న (మాఘ పూర్ణిమ) అధిక సంఖ్యలో జనం రావచ్చు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గణాంకాల ప్రకారం జనవరి 20నాటికి 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు.