
న్యూఢిల్లీ: టెలికం 2జీ స్పెక్ట్రం కేసులో నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని .. అభియోగాలు ఎదుర్కొన్న కార్పొరేట్ సంస్థలు స్వాగతించాయి. తామేమీ తప్పు చేయలేదన్న సంగతి ఈ తీర్పుతో రుజువైందని వ్యాఖ్యానించాయి. తీర్పును స్వాగతిస్తున్నట్లు అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్ క్లుప్తంగా ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, ‘మోసపూరితంగా’ బనాయించిన కేసు కారణంగా తమ కంపెనీలు ఇప్పటికీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ మరో కేసులో జైల్లో ఉన్న రియల్టీ సంస్థ యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర వ్యాఖ్యానించారు. ‘నేను గానీ మా కంపెనీలు గానీ ఎలాంటి తప్పు చేయలేదు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా మాపై పెట్టిన కేసు అటు కంపెనీని, ఇటు నన్ను దెబ్బతీసింది. ఆ ప్రతికూల ప్రభావాలు నా ఆరోగ్యంతో పాటు మా కంపెనీ ఆర్థిక పరిస్థితిపై ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మేం మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాం’ అని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కోర్టు సానుకూల తీర్పుతో తమ కంపెనీని పునర్నిర్మించేందుకు, కొనుగోలుదారులకు గృహాలు అందించడంపైనా దృష్టి సారిస్తామని చెప్పారు. మరోవైపు, ‘ఈ వివాదంలో మా తప్పేమీ లేదంటూ మేం ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం. న్యాయస్థానం కూడా దాన్నే ధృవీకరించింది’ అని ఎస్సార్ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక, డీబీ రియల్టీ సైతం అదే విధంగా స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అంటూ డీబీ రియల్టీ సీఎండీ గోయెంకా వ్యాఖ్యానించారు. 2జీ స్పెక్ట్రంనకు సంబంధించి 122 లైసెన్సుల కేటాయింపుల్లో అవకతవకలతో ప్రభుత్వ ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆరోపించిన దరిమిలా 2012లో ఆయా లైసెన్సులు రద్దు కావడం, స్పెక్ట్రం మోసపూరితంగా దక్కించుకున్నాయన్న ఆరోపణలపై వివిధ కంపెనీలపై కేసులు నమోదు కావడం తెలిసిందే. తాజాగా సరైన సాక్షా>్యధారాలు లేవంటూ మాజీ టెలికం మంత్రి ఎ రాజా సహా ఇతర కార్పొరేట్లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
2జీ స్పెక్ట్రమ్ షేర్లు రయ్...
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసుతో సంబంధమున్న షేర్లు గురువారం 20 శాతం వరకూ ఎగిశాయి. 2జీ స్పెక్ట్రమ్ లైసెన్స్‌ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయనే కేసును విచారిస్తున్న స్పెషల్ కోర్టు... అందుకు ఒక్క ఆధారమూ లేదంటూ ఈ కేసును కొట్టివేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేంద్ర టెలికం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధమున్న డిబీ రియల్టీ, యూనిటెక్ తదితర షేర్లు బాగా లాభపడ్డాయి.
డీబీ రియల్టీ 20 శాతం అప్..
డీబీ రియల్టీ షేర్ 20 శాతం (అప్పర్ సర్క్యూట్) లాభంతో రూ.43.7 వద్ద ముగిసింది. యూనిటెక్ 12 శాతం లాభంతో రూ.8కు దూసుకుపోగా, సన్ టీవీ నెట్‌వర్క్ 4.5 శాతం పెరిగి రూ.982కు చేరింది. దివాలా పిటిషన్ల విచారణను వచ్చే నెలకు ఎన్‌సీఎల్‌టీ వాయిదా వేయడంతో బుధవారం 35 శాతం లాభపడిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ గురువారం 4 శాతం లాభంతో రూ.17.97కు పెరిగింది. ఎస్సార్ షిప్పింగ్ షేర్ 2 శాతం పెరిగి రూ.28.55 వద్ద ముగిసింది. నిర్ధోషులుగా ప్రకటించిన వారిలో స్వాన్ టెలికం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బల్వా, వినోద్ గోయెంకా, యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, రిలయన్స్ అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్‌కు చెందిన ముగ్గురు ఉన్నతోద్యోగులు–గౌతమ్ దోషి, సురేంద్ర పిపర, హరి నాయర్‌లు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment