బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు@90వేల కోట్లు | Telecom firm BSNL's total loss may have crossed Rs 90000 crore | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు@90వేల కోట్లు

Published Sat, Mar 16 2019 1:33 AM | Last Updated on Sat, Mar 16 2019 1:33 AM

Telecom firm BSNL's total loss may have crossed Rs 90000 crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు డిసెంబర్‌ ఆఖరు నాటికి ఏకంగా రూ. 90,000 కోట్లు దాటిపోయాయని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ (కేఐఈ) పేర్కొంది. ఈ నేపథ్యంలో మరింత పెట్టుబడులు పెట్టి కంపెనీని నిలబెట్టడమా లేదా వ్యయాలు తగ్గించుకునేందుకు సంస్థను మూసేసి వన్‌ టైమ్‌ భారాన్ని భరించడమా అన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఒక నివేదికలో తెలిపింది. 

పెరుగుతున్న సమస్యలు..
‘బీఎస్‌ఎన్‌ఎల్‌ సమస్యలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో 1.76 లక్షల మంది ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు తక్కువకో లేదా ఉచితంగానో స్పెక్ట్రం కేటాయించడం వల్ల ఉపయోగం ఉండదు. బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యం తమకు 4జీ స్పెక్ట్రం బదులుగా ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన ఈక్విటీ సమకూర్చమని కోరుతోంది. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టొచ్చు’ అని కేఐఈ పేర్కొంది. చివరిసారిగా 2008 ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ లాభాలు నమోదు చేసిందని, అప్పట్నుంచి 2009–18 మధ్య కాలంలో మొత్తం రూ. 82,000 కోట్ల మేర నష్టాలు పేరుకుపోయాయని తెలిపింది. 2018 డిసెంబర్‌ నాటికి ఇది రూ. 90,000 కోట్లు దాటేసి ఉంటుందని  కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌  పేర్కొంది. 

మరిన్ని సవాళ్లు: 2006 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయాల్లో ఉద్యోగాల వ్యయాలు (రిటైర్మెంట్‌ ప్రయోజనాలు కలిపి) 21 శాతంగా ఉంటే.. 2008 ఆర్థిక సంవత్సరం నాటికి 27 శాతానికి చేరాయి. 2018 ఆర్థిక సంవత్సరానికి ఇవి ఏకంగా 66 శాతానికి ఎగిశాయి. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు ఏటా రూ. 7,100 కోట్ల మేర ఉంటున్నాయని అంచనా. టెలికం పరిశ్రమ పరిస్థితి టారిఫ్‌లు పెరగకపోతే మరింత దుర్భరంగా మారే అవకాశం ఉంది.

ఫిబ్రవరి జీతాలు చెల్లించేశాం: బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ శ్రీవాస్తవ 
ఉద్యోగులందరికీ ఫిబ్రవరి నెల వేతన బకాయీలను పూర్తిగా చెల్లించేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఇందుకోసం రూ. 850 కోట్ల అంతర్గత నిధుల్లో కొంత భాగాన్ని వినియోగించినట్లు పేర్కొన్నారు.  

వింగ్స్‌ యాప్‌తో ఉచిత కాల్స్‌.. 
కాగా కొత్త కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు తమ వింగ్స్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా 30 రోజుల పాటు ఉచిత వాయిస్‌ కాల్స్, ఉచిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆవిష్కరించింది. ఈ ఆఫర్‌ కింద 30 రోజుల పాటు దేశీయంగా ల్యాండ్‌లైన్‌ లేదా మొబైల్‌ నంబరుకు ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. విదేశాల నుంచైతే నిమిషానికి రూ. 1.2 చార్జీ ఉంటుంది. వింగ్స్‌ యాప్‌ వార్షిక యాక్టివేషన్‌ చార్జి రూ. 1,100 కాగా.. విద్యార్థులకు 20 శాతం, కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 50 శాతం, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు 75 శాతం డిస్కౌంటు ఇస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వింగ్స్‌ (ఓఎస్‌డీ) ఏకే జైన్‌ తెలిపారు. ఉచిత ఆఫర్‌ గడువు ముగిశాక.. ల్యాండ్‌లైన్‌ లేదా సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ప్రకారం చార్జీలు ఉంటాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement