టైం ఇవ్వండి, చెప్తామంటున్న జియో
న్యూఢిల్లీ : హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో పొడిగించిన ఉచిత సేవలపై రిలయన్స్ జియో వివరణ ఇవ్వాలంటూ ట్రాయ్ రాసిన లేఖపై కంపెనీ స్పందించినట్టు తెలుస్తోంది. ఈ ఆదేశాలపై తమకు అదనపు సమయమివ్వాలని కోరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ప్రమోషనల్ ఆఫర్స్ 90 రోజులు వరకు మాత్రమే ఉండాలి. అయితే ఈ ఆఫర్ పొడిగింపు నిర్ణయం నిబంధనలకు ఏవిధంగా విరుద్ధం కాదో తెలియజేయాలని జియోకు ట్రాయ్ లేఖరాసింది. డిసెంబర్ 20వరకు దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ప్రస్తుతం జియో డిసెంబర్ 29వరకు అదనపు సమయం కోరినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.
డిసెంబర్ 29వరకు తమకు సమయం కావాలని, ఆ లోపల వివరణ ఇస్తామని తెలిపినట్టు తెలుస్తోంది. అలాగే వచ్చే మార్చి 31కి నెలవారీగా ఎంత మంది యూజర్లు జతవుతారో ముందుగానే తెలియజేయాలని జియోని ట్రాయ్ కోరింది. జియో అందిస్తున్న ఉచిత సేవలను హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద మరో మూడు నెలల పాటు పొడిగించనున్నట్టు ఈ నెల మొదట్లో రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆఫర్ కింద అంతకముందు రోజుకు జియో అందిస్తున్న 4జీబీ ఉచిత డేటాను, 1జీబీ డేటాకు కుదించారు.