'ఐడియా' ఫ్లాప్: లాభాలు పతనం
ముంబై : దేశంలో మూడో అతిపెద్ద టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులార్ విశ్లేషకుల అంచనాలను మిస్ చేసింది. సోమవారం ప్రకటించిన 2016-17 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో తన కన్సాలిడేటెడ్ నికర లాభాలు 74శాతం పతనమై రూ.220 కోట్లగా నమోదుచేసినట్టు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభాలు రూ.851.6 కోట్లగా ఉన్నాయి. స్పెక్ట్రమ్ ధరలు, తక్కువ వాయిస్ రెవెన్యూలు వల్ల తమ ఆదాయాల పడిపోయినట్టు తెలిపింది. థామ్సన్ రాయిటర్స్ డేటా ప్రకారం ఐడియా రూ.435 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని అంచనావేశారు.
స్పెక్ట్రమ్ కొనుగోలు చేయడానికి ఒక ఆఫ్ ఖర్చులు లాభాలు పతనమవడానికి దోహదం చేశాయని పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కమర్షియల్ గా ఆవిష్కరించబోయే జియో సేవల నేపథ్యంలో టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా యూనిట్లతో పాటు ఐడియా సైతం తన 3జీ,4జీ సర్వీసులపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టి, తన డేటా రేట్లలో కోత విధించింది. దీంతో గతేడాది ఒక యూజర్కు రూ.147 లుగా ఉన్నమొబైల్ డేటా సగటు రెవెన్యూ, ఈ ఏడాది రూ.142లకు పడిపోయినట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఐడియా 4జీ నెట్ వర్క్కు 1.8 మిలియన్ కస్టమర్లు ఉన్నారు. అదేవిధంగా రిలయన్స్కు 1.5 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్నట్టు తాజా వార్షిక రిపోర్టులు పేర్కొన్నాయి. మరోవైపు ఐడియా సెల్యులార్ షేర్లు నేటి మార్కెట్లో 2.83 శాతం పతనమై రూ.103.1వద్ద నమోదైంది.