జియో దెబ్బ: ఐడియాకి భారీగా తగిలింది
జియో దెబ్బ: ఐడియాకి భారీగా తగిలింది
Published Thu, Jul 27 2017 5:34 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM
ముంబై : టెలికాం మార్కెట్‌లోకి సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో దెబ్బ నుంచి టెలికాం దిగ్గజాలు కోలుకోలేకపోతున్నాయి. దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఇటీవలే భారీగా తన లాభాలను కోల్పోగా.. మరో టెలికాం అగ్రగామి ఐడియా సెల్యులార్ కూడా జియో తాకిడిని తట్టుకోలేక కుదేలైంది. గురువారం ప్రకటించిన 2017-18 తొలి క్వార్టర్ ఫలితాల్లో ఐడియా సెల్యులార్ నికర నష్టాలు రూ.815 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ కంపెనీ లాభాలు రూ.220 కోట్లగా ఉన్నాయి. గత మార్చి క్వార్టర్‌లో కూడా కంపెనీ రూ.325.60 కోట్ల నష్టాలను నమోదుచేసింది. ఈ క్వార్టర్‌లో ఐడియా నష్టాలు మరింత ఎగిశాయి. కంపెనీ ఆదాయం కూడా 14 శాతం మేర పడిపోయి రూ.8,182 కోట్లగా ఉన్నట్టు ఐడియా తెలిపింది.
విశ్లేషకుల అంచనాల ప్రకారం ఐడియా రూ.671 కోట్ల నష్టాలను మాత్రమే ఎదుర్కొంటుందని భావించారు. కానీ వారి అంచనాలకు మించిపోయి మరింత నష్టాల్లోకి ఐడియా కూరుకుపోయింది. జియో ఆఫర్ చేస్తున్న అపరిమిత కాలింగ్, డేటా ప్లాన్స్ వల్ల తాము కుదేలవుతున్నట్టు ఐడియా చెప్పింది. జియోకు తగ్గ ప్లాన్స్‌ను అమలుచేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంటుందని తెలిపింది. గతేడాది మార్కెట్‌లోకి వచ్చిన ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియోతో, దేశీయ టెలికాం మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అప్పటి నుంచి కంపెనీలు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. జియో ధరల యుద్ధంతో కంపెనీలు తట్టుకోలేకపోతున్నాయి. కాగ, మొత్తం రెవెన్యూలు ఐడియా కంపెనీవి క్వార్టర్ క్వార్టర్‌కు 0.5 శాతం పెరిగాయి. కానీ ఏడాది ఏడాదికి 13.9 శాతం తగ్గాయి. జియోను దెబ్బతీయడానికి ఐడియా, వొడాఫోన్ ఇండియాతో విలీనం కాబోతుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించబోతున్నాయి.
Advertisement
Advertisement