
స్టాక్ మార్కెట్‌పై ‘టాటా' ఎఫెక్ట్..
దేశ పారిశ్రామిక రంగాన్ని ఒక కుదుపు కుదిపిన టాటా గ్రూప్ తాజా వ్యవహారం నేపథ్యంలో మంగళవారం భారత స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సరస్ మిస్త్రీను తొలగించడంతో టాటా గ్రూప్ షేర్లపై ఆ ప్రభావం ఉండొచ్చునని, ఈ షేర్లు పలు ఒడిదుడుకులకు లోను కావొచ్చునని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం 19.99 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) ప్రస్తుత సమాచారం ప్రకారం వందపాయింట్లకుపైగా నష్టపోయింది.
19.99 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 28159.09 పాయింట్ల వద్ద ప్రారంభమవ్వగా.. నిఫ్టీ కూడా 4.35 పాయింట్ల నష్టంతో 8,704 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఐడియా సెల్యూలర్ షేరు విలువ 2.08శాతం మేర పడిపోవడం, టాటా గ్రూప్ షేర్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుండటంతో ఉదయం పదిగంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 128.23 పాయింట్లు నష్టపోయి.. 28,050.58 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 26.80 పాయింట్లు నష్టపోయి.. 8682.15 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజీ మిస్త్రీని తొలగించడంతో ఆ ప్రభావం టాటా గ్రూప్ షేర్ విలువపై కనిపిస్తోంది. దీంతో ఈ షేర్ విలువ నష్టాలు ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తున్నదని పరిశీలకులు చెప్తున్నారు.