90 కోట్లు దాటిన ఫోన్ కనెక్షన్లు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలిఫోన్ కనెక్షన్లు మరోసారి 90 కోట్ల మార్కు ను అధిగమించాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మే లో కనెక్షన్లు స్వల్పంగా 0.34 శాతం పెరిగి 90.005 కోట్లుగా నమోదయ్యాయి. చివరిసారిగా గతేడాది జూన్‌లో కనెక్షన్లు ఏకంగా 96.55 కోట్లుగా ఉండేవి. అప్పట్నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చాయి. శుక్రవారం ట్రాయ్ ఈ గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఏప్రిల్ ఆఖర్లో కనెక్షన్లు 89.70 కోట్లుగా ఉన్నాయి.
మే లో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 86.7 కోట్ల నుంచి 87 కోట్లకు పెరిగింది. 12 లక్షల కొత్త కస్టమర్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ అగ్రస్థానంలో ఉండగా, 9 లక్షలతో వొడాఫోన్, 8.67 లక్షలతో ఐడియా సెల్యులార్, 8.51 లక్షలతో ఎయిర్‌టెల్, 2.77 లక్షల కొత్త కస్టమర్లతో ఎయిర్‌సెల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్లు 9 లక్షలు తగ్గాయి. మొత్తం కనెక్షన్లపరంగా చూస్తే 18.96 కోట్ల సబ్‌స్క్రయిబర్స్‌తో ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో ఉంది.