ఐడియా లాభం 60 శాతం జంప్
క్యూ4లో రూ.942 కోట్లు...
న్యూఢిల్లీ: టెలికం సంస్థ ఐడియా సెల్యులార్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (2014-15, క్యూ4)లో కంపెనీ రూ.942 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదుచేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.590 కోట్లతో పోలిస్తే లాభం దాదాపు 60% వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం రూ.7,044 కోట్ల నుంచి రూ.8,423 కోట్లకు పెరిగింది. 19.5% వృద్ధి నమోదైంది. కాగా, క్యూ4లో ఒక్కో యూజర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ.179కి పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.173గా ఉంది.
పూర్తి ఏడాదికి ఇలా...: 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐడియా కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,193 కోట్లకు ఎగబాకింది. 2013-14లో నమోదైన రూ.1,968 కోట్లతో పోలిస్తే లాభం 62 శాతం మేర దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం సైతం 19 శాతం వృద్ధితో రూ.26,519 కోట్ల నుంచి రూ.31,571 కోట్లకు పెరిగింది. కాగా, 2014-15లో 3జీ డేటా యూజర్ల సంఖ్య రెట్టింపై 1.45 కోట్ల మందికి చేరినట్లు కంపెనీ వెల్లడించింది.మెరుగైన ఫలితాల నేపథ్యంలో ఐడియా షేరు ధర మంగళవారం బీఎస్‌ఈలో 2.79 శాతం లాభపడి రూ.192 వద్ద స్థిరపడింది.