బుల్ రన్‌కు రెస్ట్.. నష్టాల్లో మార్కెట్లు
Published Fri, Jul 28 2017 4:02 PM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM
ముంబై : గత నాలుగు సెషన్లుగా దూసుకెళ్తూ.. రికార్డు గరిష్టాలను తాకుతున్న బుల్ రన్‌కు స్టాక్ మార్కెట్లు రెస్ట్ ఇచ్చాయి. బ్యాంకు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ ఫలితాల్లో నిరాశపరచడంతో, ఆ కంపెనీల షేర్లు నష్టాలు పాలయ్యాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టంలో 32,309.88 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంలో 10,014.50 వద్ద క్లోజయ్యాయి. నష్టాలు పాలైనప్పటికీ, నిఫ్టీ తన కీలకమైన మార్కు 10వేల నుంచి కిందకి దిగలేదు. మొట్టమొదటిసారి ఈ మార్కును మంగళవారం సెషన్‌లో తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తనకు ఎంతో కీలకమైన మార్కును ఛేదించడంతో, లాభాల స్వీకరణ చోటుచేసుకోవడం సాధారణమని విశ్లేషకులంటున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లలో కొంత ధర కరెక్షన్‌కు గురైందని చెప్పారు.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ నేటి మార్కెట్‌లో అత్యధికంగా 6.5 శాతం నష్టపోయింది. మే 30 తర్వాత ఇదే అత్యంత కనిష్టస్థాయి. ఈ కంపెనీ ఫలితాల్లో నిరాశపరచడంతో, షేర్లు నష్టాలు పాలయ్యాయి. ఐసీఐసీఐ కూడా లాభాల్లో 8 శాతం డౌన్ కావడంతో, ఈ బ్యాంకు షేర్లు కూడా 3 శాతం పడిపోయాయి. వరుసగా మూడు క్వార్టర్‌లోనూ ఐడియా సెల్యులార్ తీవ్ర నష్టాలను నమోదుచేసింది. దీంతో ఈ కంపెనీ స్టాక్ 5.6 శాతం డౌన్ అయింది. కానీ సిగరెట్ల నుంచి బిస్కెట్ల వరకు తయారీచేస్తున్న ఐటీసీ లిమిటెడ్ మంచి ఫలితాలను ప్రకటించడంతో, షేర్లు 2 శాతం పెరిగాయి. నేటి సెషన్‌లో రెండు సూచీల్లోనూ హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, యస్ బ్యాంకు మంచి లాభాలను ఆర్జించగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లుపిన్, ఐడియా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడి 64.16గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 53 రూపాయల నష్టంతో 28,423వద్ద ఉన్నాయి.
Advertisement