న్యూఢల్లీ: ఐడియా సెల్యులార్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2013-14, క్యూ1)లో రూ.728 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.463 కోట్లతో పోలిస్తే.. లాభం 57 శాతం ఎగబాకింది. ప్రధానంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసుల ఆసరాతో మొబిలిటీ వ్యాపారానికి డిమాండ్ పుంజుకోవడం, నెట్‌వర్క్ విస్తరణ, విభిన్న స్పెక్ట్రం పోర్ట్‌ఫోలియో, తమకున్న బ్రాండ్ ఇమేజ్‌లే లాభాల జోరుకు దోహదం చేశాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం క్యూ1లో 16 శాతం వృద్ధితో రూ.7,485 కోట్లకు పెరిగింది. గతేడాఇ ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.6,471 కోట్లు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్‌ఈలో 1 శాతం మేర లాభంతో రూ.139.75 వద్ద స్థిరపడింది.