Mobile Internet service
-
ఎట్టకేలకు కాసింత స్వేచ్ఛ!
ఒకటి కాదు... రెండు కాదు... 143 రోజుల తర్వాత మోక్షం లభించింది. కల్లోలిత మణిపుర్‌లోని బీరేన్‌సింగ్ సర్కార్ ఎట్టకేలకు శనివారం నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. అపరిమిత ఆలస్యం తరువాౖత అయితేనేం, పాలకులు ఇన్నాళ్ళకు ఒక అడుగు ముందుకు వేసినట్ట యింది. రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పేందుకు తీసుకున్న చర్యగా ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ నిర్ణయం హర్షించదగ్గ విషయం. మే 3న రెండు ప్రధాన వర్గాల మధ్య ఘర్షణలు మొదలైనప్పుడే నెట్ సేవలపై రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించింది. ఆ తరువాత జూన్ 25న బ్రాడ్‌బ్యాండ్ సేవలను అనేక షరతులతో పాక్షికంగా పునరుద్ధరించినా, మొబైల్లో నెట్‌పై ఇప్పటి దాకా నిషేధం కొనసాగింది. నూటికి 95 మంది మొబైల్‌తోనే నెట్ సేవలందుకొనే మన దేశంలో ఇప్పుడీ ఎత్తివేత నిర్ణయం మణిపుర్లో అందరికీ సాంత్వన. కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థకూ, జీవనోపాధికీ పెద్ద ఊపిరి. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైనందు వల్ల’’ ఇప్పుడు మొబైల్ నెట్ సేవల పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నామన్నది సర్కారు వారి మాట. మణిపుర్లో పరిస్థితిపై ప్రభుత్వ కథనంలో నిజానిజాలు ఎంత అన్నది చర్చనీయాంశమే. అయితే, నిర్ణయం ఎందుకు తీసుకున్న ప్పటికీ... జనజీవితాన్ని ప్రభావితం చేస్తూ, అసత్యాల వ్యాప్తికి కారణమవుతున్న నిషేధాన్ని ఎత్తి వేయడం కచ్చితంగా సమంజసం. అందులో మరో మాట లేదు. మణిపుర్లో పర్యటించిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా బృందం సైతం ఇంటర్నెట్ సేవల నిషేధం చెడు చేసిందని పేర్కొన్న సంగతి మర్చిపోలేం. ఇంటర్నెట్ లేక, నిజనిర్ధారణకు వీలు లేక మీడియా చివరకు ప్రభుత్వపు గూటి చిలకగా మారి, ఆ గూటి పలుకులే పలికే దుఃస్థితి తలెత్తిందని విమర్శలు వచ్చాయి. సత్యనిష్ఠ గల మీడియా లేకపోవడంతో, అదే సందుగా పుకార్లు షికార్లు చేశాయి. విద్వేషవ్యాప్తితో అగ్నికి ఆజ్యం పోశాయి. అలాంటి ఓ పుకారే చివరకు ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన హేయమైన ఘటనకు దారి తీసిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మణిపుర్ ఘర్షణల్లో 175 మందికి పైగా బలి కాగా, 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. జీవితాలు చెల్లాచెదరయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు కాల యాపన చేశాయి. ఫేక్ న్యూస్ ఆపుతామంటూ పెట్టిన నెట్ నిషేధం అసలు న్యూస్ ఏమిటో ప్రపంచానికి అందకుండా చేసింది. అసలు సమస్య ఎక్కడుందో ముందే కనిపెట్టి, బలగాలు త్వరితగతిన చర్యలు చేపట్టే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇవాళ ప్రజలు పూర్తిగా రెండు శిబిరాలుగా చీలిపోయే పరిస్థితిని కొనితెచ్చింది. గతంలో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత దాదాపు రెండేళ్ళ పాటు ఇంట ర్నెట్పై నిషేధం నడిచింది. ఆ తర్వాత మళ్ళీ ఇలా దాదాపు 5 నెలల దీర్ఘకాలం నెట్ సేవలపై కట్టడి కొనసాగింది మణిపుర్‌లోనే! గత అయిదేళ్ళలో ప్రపంచంలో మరే దేశమూ చేయనన్నిసార్లు భారత్ నెట్‌పై కట్టడి పెట్టింది. ఒక్క 2022లోనే 84 సార్లు నెట్ షట్డౌన్లు సాగాయి. ఏ కొద్ది నిరసన తలెత్తినా అణచివేసేందుకు నెట్ నిలిపివేత కొత్త రాజకీయ నియంత్రణ సాధనంగా మారడం విషాదం. రష్యా, సూడాన్, ఇరాన్, మయన్మార్, ఇథియోపియా సహా నిరంకుశ పాలన సాగే అనేక దేశాల్లో కన్నా మన ప్రజాస్వామ్య భారతంలోనే ఇంటర్నెట్ సేవల్ని తరచూ ఆపేయడం విడ్డూరం. నిజానికి, ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ‘అనురాధా భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (2020) కేసులో సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్రం,ఇంటర్నెట్ను ఉపయోగించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే స్వేచ్ఛ అనేవి ప్రాథమిక హక్కులనీ, నెట్‌పై నిషేధం వాటికి భంగం కలిగించడమేననీ కోర్ట్ అప్పుడే తేల్చింది. అత్యవసరమై నిషేధం పెట్టినా దాన్ని పొడిగిస్తూ పోరాదనీ చెప్పింది. ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోవట్లేదు. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం మానేసి, దానికి ప్రత్యామ్నాయం నెట్‌పై నిషేధమే అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. ఇది పరిష్కారం కాదని సుప్రీమ్ తప్పుబట్టింది. కానీ, ఇప్పటి దాకా మణిపుర్ సర్కార్ చేసింది అదే. తాజాగా ఈ మార్చిలో పంజాబ్‌లో వేర్పాటువాద నేత పరారీ, జూలైలో హర్యానాలో మతఘర్షణల సమయంలో ఇతర ప్రభుత్వాలూ ఆ పనే చేశాయి. మణిపుర్లో మైతేయ్‌లకూ, కుకీలకూ మధ్య పేరుకున్న విద్వేషాన్ని పోగొట్టాలంటే పాలకులు చేయాల్సిన పని వేరు. ముందు సమన్యాయం పాటించాలి. అందరితోనూ సుహృద్భావ పూర్వక చర్చలు జరపాలి. తీవ్రవాద వర్గాన్ని ఏకాకిని చేయాలి. సమాజంలో సహనం, శాంతి, పరస్పర విశ్వాసం నెలకొనేలా ఒక్కొక్క అడుగూ వేయాలి. కానీ, ఒక వర్గానికే కొమ్ము కాస్తూ, సొంత సహచరుల నమ్మకమే కోల్పోయిన పాలకుడికి అది కష్టమే! ఇప్పటికీ మణిపుర్ సాధారణ స్థితికి రాలేదని వార్త. కానీ, అందుకు నెట్‌పై విరుచుకుపడడం సరికాదు. ఆ వివేకం ఇన్నాళ్ళకు మన పాలకులలో మేలుకొన్నట్టుంది. ‘డిజిటల్ ఇండియా’ స్వప్నంతో, నెలకు వెయ్యి కోట్ల సంఖ్యలో డిజిటల్ చెల్లింపులతో రొమ్ము విరుచుకుంటున్న దేశం తరచూ నెట్ ఆపేస్తే, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అది చెల్లదు. నెట్ నిషేధంతో మణిపుర్ 60 లక్షల డాలర్లు, దేశవ్యాప్తంగా 400 కోట్ల డాలర్లు నష్టం వచ్చిందని అంచనా. బ్రిటీషు కాలపు టెలిగ్రాఫ్ చట్టం–1885ను అడ్డం పెట్టుకొని కోర్టులకు చిక్కకుండా యథేచ్ఛగా నెట్‌పై నిషేధం పెట్టడం పాలకులకు శోభనివ్వదు. మణిపూర్ ఉదంతంతోనైనా మన ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకొని, తీరు మార్చుకుంటే మనుషులకూ, మానవ హక్కులకూ మేలు. -
అన్నా.. మొబైల్ డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది! ఏం చేయను..
Mobile Data Usage And Data Saving Tips In Telugu: ఎన్నిసార్లు చెప్పా.. ఇంటర్నెట్ప్యాక్ కోసం ఎక్స్ట్రా రీఛార్జ్ అడగొద్దని? అంటూ అసహనంగా చెల్లిని మందలించాడు ప్రశాంత్. ‘ఏం చేయను అన్నయ్యా.. డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది. ఆ విషయం తెలియకుండానే మొబైల్ డేటా లిమిట్ దాటేసిందని అలర్ట్ వస్తోంది’ అంటూ ముఖం వేలాడేసుకుని సమాధానం ఇచ్చింది గిరిజ. ఇంతకీ మొబైల్ డేటా లిమిట్ ఆన్‌లో పెట్టుకున్నావా? అని ప్రశాంత్ అనడంతో బిక్క ముఖం వేసింది గిరిజ. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే కోట్ల మంది ఎదుర్కొనే సమస్య.. వేగంగా మొబైల్ డేటా అయిపోవడం. వైఫై కనెక్షన్ లేని ఇళ్లలో మొబైల్ డేటానే ఆధారం. ఓటీటీ, ఇతరత్రా సోషల్ యాప్‌లను ఉపయోగిస్తూ రోజూ వారీ డేటా ఎలా అయిపోతోందో కనీసం తెలియదు కూడా. ఫుల్ సిగ్నల్ ఉందని.. ఇంటర్నెట్ జెట్ స్పీడ్‌తో వస్తోందని సంబరపడేవాళ్లు.. ఇంటర్నెట్ డేటా ఫటా ఫట్ అయిపోతుందని మాత్రం గుర్తించరు!. డేటా లిమిట్ మ్యాగ్జిమమ్ దాటి వెళ్లకుండా ఉండేదుకు పర్యవేక్షణ, పరిమితం చేయడం లాంటి మార్గాలు ఉంటాయని గుర్తిస్తే చాలు కదా!. ►మొబైల్ డేటా వాడకాన్ని మానిటరింగ్ చేయడం చాలా సులువు. ఏదైనా ఒక యాప్‌ను ఎక్కువసేపు నొక్కి పట్టుకున్నప్పుడు.. యాప్ ఇన్ఫో app info అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే నేరుగా యాప్ సెట్టింగ్ పేజ్‌కి వెళ్తుంది. అక్కడ మొబైల్ డేటా&వైఫై ఆప్షన్ కనిపిస్తుంది. పైన బ్యాక్‌గ్రౌండ్-ఫోర్‌గ్రౌండ్‌లో ఆ యాప్ ఎంత డేటాను తీసుకుంటుందనే విషయం అక్కడ చూడొచ్చు. ఒకవేళ ఆ యాప్ ఎక్కువ డేటాను లాగేస్తుందని అర్థమైతే.. వెంటనే అక్కడి ఆప్షన్స్‌ను ఆఫ్ చేస్తే సరిపోతుంది. ►ఇక ఫోన్ సెట్టింగ్స్ యాప్ Settings appలో డేటాసేవర్ Data Saver అనే ఫీచర్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్‌లు వినియోగించుకుంటున్న డేటాను నియంత్రిస్తుంది. ►గూగుల్ ప్లే స్టోర్‌లో.. డేటా మేనేజ్మెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా మానిటర్ చేసుకోవచ్చు. పైగా ఒకేసారి ఒక్కోయాప్ ఎంతెంత డేటా తీసుకుంటున్నాయో ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. గంట, రోజూ, వారాలు, నెలల తరబడి ఎంతెంత ఉపయోగిస్తున్నామో అక్కడ చూసుకోవచ్చు కూడా. ►కొన్ని ఫోన్లలో డేటా లిమిట్ ఆప్షన్ నేరుగా ఉంటుందన్నది చాలామందికి తెలిసే ఉండొచ్చు. అక్కడ ఫలానా ఎంబీ నుంచి జీబీల్లో డేటా లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. సపోజ్ యూట్యూబ్లోగానీ, లేదంటే ఏదైనా ఓటీటీ యాప్‌లోగానీ సినిమా చూస్తూ ఉండిపోయినప్పుడు డేటా దానంతట అదే అయిపోతుంది. కానీ, లిమిట్ పెట్టుకోవడం వల్ల పరిధి దాటగానే అలర్ట్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ఇంటర్నెట్ డేటాను నియంత్రించుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా లిమిట్ Data limit అని టైప్ చేస్తే ఆప్షన్ కనిపిస్తుంది. మరికొన్ని ఫోన్లలో Data Warning ఫీచర్ కూడా ఉంటుంది. ►లైట్ వెర్షన్, అలర్ట్నేట్ వెర్షన్ యాప్స్‌ను ఉపయోగించడం ద్వారా కూడా ఇంటర్నెట్ డేటాను తక్కువగా వాడొచ్చు. కానీ, వీటిలో చాలామట్టుకు సురక్షితమైనవి కానివే ఉంటాయి. కాబట్టి, ప్లేస్టోర్ నుంచి అథెంటిక్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించడం ఉత్తమం. ఉదాహరణకు.. ఫేస్బుక్, ఇన్స్టలాంటి యాప్‌ల్లో స్క్రోలింగ్ చేస్తూ ఉండగానే.. డేటా అయిపోయినట్లు మెసేజ్ వస్తుంది. అవి ఎక్కుడ డేటాను లాగేస్తాయి కాబట్టి.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లైట్ వెర్షన్ యాప్‌ల ఉపయోగించొచ్చు. మొబైల్ డేటాను సేవ్ చేసుకోవచ్చు. చదవండి: ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయకుండా ఫోన్లో ఫ్రీ స్పేస్ పొందండి ఇలా.. -
కర్నాల్‌లో నిషేధాజ్ఞలు మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేత
కర్నాల్(హరియాణా): హరియాణాలోని కర్నాల్‌లో మినీ సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామన్న రైతు సంఘాల పిలుపు నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం నిర్వహిం చతలపెట్టిన రైతు ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో 144వ సెక్షన్ అమల్లోకి తెచ్చినట్లు జిల్లా అధికార యంత్రాంగం సోమవారం ప్రకటించింది. మొబైల్ ఇంటర్నెట్‌నూ నిలిపేశారు. కర్నాల్‌లో నలుగురుకి మించి వ్యక్తులు గుమిగూడటం కుదరదంటూ నిషేధాజ్ఞలు జారీచేసింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ముందస్తు చర్యగా ఆంక్షలు అమల్లోకి తెచ్చామని అదనపు డీజీపీ(లా అండ్ ఆర్డర్) నవ్‌దీప్ సింగ్ చెప్పారు. రైతు ఆందోళన సందర్భంగా తప్పుడు వార్తలు, పుకార్లను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయకుండా ఆపేందుకు కర్నాల్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఎంఎస్, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సేవలను స్తంభింపజేస్తారు. పొరుగున ఉన్న కురుక్షేత్ర, కైథాల్, జింద్, పానిపట్ జిల్లాల్లోనూ ఈ సేవలనుæ నిలిపేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలనూ రప్పించారు. గత నెల 28న కర్నాల్‌లో బీజేపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు బయల్దేరిన రైతులు.. జాతీయరహదారి వెంట ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తున్నారంటూ వారిపై పోలీసులు లాఠీచార్జికి దిగారు. ఈ ఘటనలో 10 మందికిపైగా రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక రైతు మరణించారు. లాఠీచార్జి కారణంగా ఆయన మరణించారని రైతు సంఘాలు చెబుతుండగా, గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. లాఠీ చార్జిని నిరసిస్తూ మినీ–సెక్రటేరియట్‌ను ముట్టడి స్తామని సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటించడం తెల్సిందే. ముందుగా కర్నాల్‌లో భారీస్థాయిలో పంచాయత్‌ను నిర్వహిస్తామని, తర్వాత మినీ– సెక్రటేరియట్ వద్ద ఆందోళన కొనసాగిస్తామని హరియాణా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నామ్ చెప్పారు. -
ఏడాది కాలంలో 47 శాతం పెరిగిన ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్
భారతదేశంలోని మొబైల్, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగాలను జూన్ లో ఓక్లా పరీక్షించి విడుదల చేసిన స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ లో గతంలో కంటే మెరుగైన స్థానాన్ని సాధించుకుంది. దేశంలో మేలో సగటు మొబైల్ డౌన్లోడ్ వేగం 15.34 ఎంబీపీఎస్ నుంచి 17.84 ఎంబీపీఎస్(16.3 శాతం పెరిగి)కు చేరుకుంది. మొబైల్ ఇంటర్నెట్ తో పాటు, దేశంలో సగటు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగం 4.53 శాతం పెరిగి 55.65 ఎంబీపీఎస్ నుంచి 58.17 ఎంబీపీఎస్ కు పెరిగింది. జూన్ లో మొబైల్, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగాల పరంగా రెండూ గ్లోబల్ ఇండెక్స్ లో మంచి స్థానాన్ని పొందాయి. స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ జూన్ డేటా ప్రకారం.. మొబైల్ ఫిక్సిడ్ బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ వేగాలు వరుసగా ఆరు స్థానాలు పెరిగి 122 వ స్థానానికి, మూడు పాయింట్లు పెరిగి 70కి చేరుకుంది. గత రెండు నెలలుగా మొత్తంగా మొబైల్ డౌన్లోడ్ వేగంలో స్థిరమైన మెరుగుదలను చూపించినట్లు ఓక్లా తెలిపింది. జూన్ లో మొబైల్ ఇంటర్నెట్ వేగం ఓక్లా విడుదల చేసిన స్పీడ్ టెస్ట్ డేటా ప్రకారం.. దేశంలో గత ఏడాది జూన్ 2020లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 12.16 ఎంబీపీఎస్ ఉంటే ఈ ఏడాది 17.84 ఎంబీపీఎస్ గా ఉంది. అంటే ఏడాది కాలంలో 46.71 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. దేశంలో సగటు మొబైల్ అప్ లోడ్ వేగం కూడా గత ఏడాది ఇదే నెలలో 4.35 ఎంబీపీఎస్ ఉంటే జూన్ 2021లో 18.85 శాతం పెరిగి 5.17 ఎంబీపీఎస్ కు చేరుకుంది. మొబైల్ నెట్ వర్క్ లపై దేశంలో సగటు లేటెన్సీ రేటు మే లో 50 మిల్లీసెకన్ల నుంచి జూన్ లో 48 మిల్లీ సెకన్లకు పడిపోయింది. సగటు జిట్టర్ రేటు కూడా మేలో 48 మిల్లీ సెకన్ల నుండి జూన్ లో 43 మిల్లీ సెకన్లకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఓక్లా నిర్వహించిన స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) సగటు మొబైల్ డౌన్లోడ్ వేగం 193.51 ఎంబీపీఎస్ తో తన ఆధిక్యాన్ని కొనసాగించింది. తర్వాత దక్షిణ కొరియా 180.48 ఎంబీపీఎస్ వద్ద ఉంది. జూన్ లో ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ వేగం ఇక ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ విషయానికి వస్తే ఓక్లా స్పీడ్ టెస్ట్ డేటా ప్రకారం.. భారతదేశంలో సగటు డౌన్లోడ్ వేగం జూన్ 2021లో 58.17 ఎంబీపీఎస్ గా ఉంటే, జూన్ 2020లో 38.19 ఎంబీపీఎస్ గా ఉంది. అంటే ఏడాది కాలంలో 52.32 శాతం పెరుగుదలను నమోదు సూచిస్తుంది. మరోవైపు దేశంలో సగటు ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ అప్ లోడ్ వేగం 2021 జూన్ లో 54.43 ఎంబీపీఎస్ కు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే నెలలో 34.22 ఎంబీపీఎస్ నుంచి 59.06 శాతం పెరిగింది. దేశంలో ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ సగటు లేటెన్సీ రేటు జూన్ లో ఒక మిల్లీ సెకను నుంచి 17 మిల్లీసెకన్లకు పెరిగింది. జూన్ లో సగటు బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ వేగం పరంగా 260.74 ఎంబీపీఎస్ తో మొనాకో అగ్రదేశంగా అవతరించింది. -
జైపూర్‌లో ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు
జైపూర్ : జైపూర్‌లోని శాస్రి నగర్లో సోమవారం ఓ వ్యక్తి ఏడేళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో అక్కడ పరిస్థితులు ఉధృతంగా మారాయి. అయితే నగరంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం వరకు పొడిగించినట్లు డివిజనల్ కమిషనర్ కేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవకుండా, శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించామని పేర్కొన్నారు. రామ్‌గంజ్, గాల్టా గేట్, మనక్ చౌక్, సుభాష్ చౌక్, బ్రహంపూర్, నహర్గర్, కొత్వాలి, సంజయ్ సర్కిల్, శాస్రి నగర్, భట్టా బస్తీ, లాల్ కోతి, ఆదర్శ్ నగర్, సదర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 10గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, అత్యాచారానికి గురైన ఏడేళ్ల బాలికకు జైపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నట్లు తెలిపారు. -
ఇంఫాల్‌లో కర్ఫ్యూ
మణిపూర్ రాజధానిలో విధ్వంసకాండ ఇంఫాల్: హింస, విధ్వంసాలతో అట్టుడుకుతున్న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి నిరవధిక కర్ఫ్యూ విధించింది. వదంతులను అరికట్టేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. గురువారం తీవ్రవాదుల దాడుల్లో ముగ్గురు పోలీసుల మృతి, శుక్రవారం నాటి మూడు బాంబు పేలుళ్లతోపాటు, చర్చిపై దాడి జరిగిందన్న వదంతులు ఇంఫాల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇంఫాల్‌లో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ యునైటెడ్ నాగా కౌన్సిల్ చేపట్టిన ఆర్థిక దిగ్బంధాన్ని, తీవ్రవాదుల దాడులను నిరసిస్తూ ప్రజలు ఆదివారం ఆందోళనకు దిగారు. కార్లు, బస్సులు సహా 22 వాహనాలను ధ్వంసం చేసి, కొన్నింటికి నిప్పు పెట్టారు. పోలీసులు, పారామిలటరీ సిబ్బంది బాష్పవాయు గోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. -
మొబైల్ ఇంటర్నెట్ నిలివేత పొడిగింపు
సూరత్: గుజరాత్ లోని సూరత్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధం మరో 24 గంటలు పొడిగించారు. గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న హార్దిక్ ను సూరత్ లో అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూరత్ లో 'ఏక్తా ర్యాలీ' నిర్వహించ తలపెట్టిన హార్దిక్ ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు 35 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వదంతులను నిలువరించడానికి ముందుజాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. -
ఇక కనీస డౌన్లోడ్ స్పీడ్ చెప్పాల్సిందే..
ఆగస్టు 23 నుంచి మొబైల్ కంపెనీలకు అమలు న్యూఢిల్లీ: మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి ఇకనుంచి టెలికం కంపెనీలు తమ యూజర్లకు(మొబైల్, డాంగిల్) కనీస డౌన్లోడ్ స్పీడ్‌ను తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. తాజాగా నియంత్రణ సంస్థ ట్రాయ్ వైర్లెస్ డేటా సర్వీసుల నిబంధనల నాణ్యతా ప్రమాణాల్లో చేసిన సవరణే దీనికి ప్రధాన కారణం. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల 23 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా వివిధ డేటా ప్లాన్ల వాడకం సమయంలో కనీసం 80 శాతానికి తక్కువకాకుండా ఈ చెప్పిన డౌన్లోడ్ వేగాన్ని టెల్కోలు తప్పకుండా అందించాల్సి ఉంటుంది. అయితే, కనీస డౌన్లోడ్ స్పీడ్ ఎంతుండాలనేది నిర్ధేశించలేదు. ఈ ఏడాది మే నాటికి దేశంలో మొబైల్ ఫోన్లు, డాంగిల్స్ ద్వారా సుమారు 5 కోట్ల మంది ప్రజలు వైర్లెస్ ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్లు అంచనా. టెల్కోలు ట్రాయ్‌కు తెలిపిన సమాచారం మేరకు అత్యంత వేగవంతమైన 3జీ సేవల్లో కనీస డౌన్లోడ్ స్పీడ్ సెకనుకు 399 కిలోబైట్ల(కేబీపీఎస్) నుంచి 2.48 మెగాబైట్లు(ఎంబీపీఎస్) వరకూ ఉంటోంది. 3జీ, సీడీఎంఏ, ఈవీడీఓ సేవల్లో కనీస డౌన్లోడ్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌గాను, జీఎస్ఎం, సీడీఎంఏ-2జీలకు 56 కేబీపీఎస్‌గా, సీడీఎంఏ హైస్పీడ్ డేటా సేవలకు 512 కేబీపీఎస్‌గా ఉండాలనేది ట్రాయ్ సూచన. బాడ్బ్యాండ్కు కనీస స్పీడ్ 512 కేబీపీఎస్‌గా ఉండాలని ట్రాయ్ నోటిఫై చేయడం తెలిసిందే. టెలికం కంపెనీలు తమ ప్రచారంలో ఇష్టానుసారం స్పీడ్‌ను ప్రకటిస్తూ.. యూజర్లకు మాత్రం ఆస్థాయిలో సేవలను కల్పించడంలేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ట్రాయ్ తాజా చర్యలకు ఉపక్రమించింది. -
ఐడియా లాభం 57 శాతం అప్
న్యూఢల్లీ: ఐడియా సెల్యులార్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2013-14, క్యూ1)లో రూ.728 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.463 కోట్లతో పోలిస్తే.. లాభం 57 శాతం ఎగబాకింది. ప్రధానంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసుల ఆసరాతో మొబిలిటీ వ్యాపారానికి డిమాండ్ పుంజుకోవడం, నెట్వర్క్ విస్తరణ, విభిన్న స్పెక్ట్రం పోర్ట్‌ఫోలియో, తమకున్న బ్రాండ్ ఇమేజ్లే లాభాల జోరుకు దోహదం చేశాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం క్యూ1లో 16 శాతం వృద్ధితో రూ.7,485 కోట్లకు పెరిగింది. గతేడాఇ ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.6,471 కోట్లు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 1 శాతం మేర లాభంతో రూ.139.75 వద్ద స్థిరపడింది.