ఎట్టకేలకు కాసింత స్వేచ్ఛ! | Sakshi Editorial Story On Mobile Internet Services In Manipur In Telugu - Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు కాసింత స్వేచ్ఛ!

Published Tue, Sep 26 2023 12:18 AM | Last Updated on Tue, Sep 26 2023 9:03 AM

Sakshi Editorial On Mobile Internet services Manipur

ఒకటి కాదు... రెండు కాదు... 143 రోజుల తర్వాత మోక్షం లభించింది. కల్లోలిత మణిపుర్‌లోని బీరేన్‌సింగ్‌ సర్కార్‌ ఎట్టకేలకు శనివారం నుంచి మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించింది. అపరిమిత ఆలస్యం తరువాౖత అయితేనేం, పాలకులు ఇన్నాళ్ళకు ఒక అడుగు ముందుకు వేసినట్ట యింది. రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పేందుకు తీసుకున్న చర్యగా ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణ నిర్ణయం హర్షించదగ్గ విషయం.

మే 3న రెండు ప్రధాన వర్గాల మధ్య ఘర్షణలు మొదలైనప్పుడే నెట్‌ సేవలపై రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించింది. ఆ తరువాత జూన్‌ 25న బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అనేక షరతులతో పాక్షికంగా పునరుద్ధరించినా, మొబైల్‌లో నెట్‌పై ఇప్పటి దాకా నిషేధం కొనసాగింది. నూటికి 95 మంది మొబైల్‌తోనే నెట్‌ సేవలందుకొనే మన దేశంలో ఇప్పుడీ ఎత్తివేత నిర్ణయం మణిపుర్‌లో అందరికీ సాంత్వన. కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థకూ, జీవనోపాధికీ పెద్ద ఊపిరి.

‘‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైనందు వల్ల’’ ఇప్పుడు మొబైల్‌ నెట్‌ సేవల పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నామన్నది సర్కారు వారి మాట. మణిపుర్‌లో పరిస్థితిపై ప్రభుత్వ కథనంలో నిజానిజాలు ఎంత అన్నది చర్చనీయాంశమే. అయితే, నిర్ణయం ఎందుకు తీసుకున్న ప్పటికీ... జనజీవితాన్ని ప్రభావితం చేస్తూ, అసత్యాల వ్యాప్తికి కారణమవుతున్న నిషేధాన్ని ఎత్తి వేయడం కచ్చితంగా సమంజసం.

అందులో మరో మాట లేదు. మణిపుర్‌లో పర్యటించిన ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా బృందం సైతం ఇంటర్నెట్‌ సేవల నిషేధం చెడు చేసిందని పేర్కొన్న సంగతి మర్చిపోలేం. ఇంటర్నెట్‌ లేక, నిజనిర్ధారణకు వీలు లేక మీడియా చివరకు ప్రభుత్వపు గూటి చిలకగా మారి, ఆ గూటి పలుకులే పలికే దుఃస్థితి తలెత్తిందని విమర్శలు వచ్చాయి. సత్యనిష్ఠ గల మీడియా లేకపోవడంతో, అదే సందుగా పుకార్లు షికార్లు చేశాయి. విద్వేషవ్యాప్తితో అగ్నికి ఆజ్యం పోశాయి. అలాంటి ఓ పుకారే చివరకు ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన హేయమైన ఘటనకు దారి తీసిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

ఇప్పటికే మణిపుర్‌ ఘర్షణల్లో 175 మందికి పైగా బలి కాగా, 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. జీవితాలు చెల్లాచెదరయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు కాల యాపన చేశాయి. ఫేక్‌ న్యూస్‌ ఆపుతామంటూ పెట్టిన నెట్‌ నిషేధం అసలు న్యూస్‌ ఏమిటో ప్రపంచానికి అందకుండా చేసింది. అసలు సమస్య ఎక్కడుందో ముందే కనిపెట్టి, బలగాలు త్వరితగతిన చర్యలు చేపట్టే అవకాశాన్ని చేజార్చుకుంది.

ఇవాళ ప్రజలు పూర్తిగా రెండు శిబిరాలుగా చీలిపోయే పరిస్థితిని కొనితెచ్చింది. గతంలో కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత దాదాపు రెండేళ్ళ పాటు ఇంట ర్నెట్‌పై నిషేధం నడిచింది. ఆ తర్వాత మళ్ళీ ఇలా దాదాపు 5 నెలల దీర్ఘకాలం నెట్‌ సేవలపై కట్టడి కొనసాగింది మణిపుర్‌లోనే! గత అయిదేళ్ళలో ప్రపంచంలో మరే దేశమూ చేయనన్నిసార్లు భారత్‌ నెట్‌పై కట్టడి పెట్టింది. ఒక్క 2022లోనే 84 సార్లు నెట్‌ షట్‌డౌన్లు సాగాయి. ఏ కొద్ది నిరసన తలెత్తినా అణచివేసేందుకు నెట్‌ నిలిపివేత కొత్త రాజకీయ నియంత్రణ సాధనంగా మారడం విషాదం.

రష్యా, సూడాన్, ఇరాన్, మయన్మార్, ఇథియోపియా సహా నిరంకుశ పాలన సాగే అనేక దేశాల్లో కన్నా మన ప్రజాస్వామ్య భారతంలోనే ఇంటర్నెట్‌ సేవల్ని తరచూ ఆపేయడం విడ్డూరం. నిజానికి, ఇంటర్నెట్‌ సేవలను నిరవధికంగా సస్పెండ్‌ చేయడం చట్టవిరుద్ధమని ‘అనురాధా భాసిన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ (2020) కేసులో సుప్రీమ్‌ కోర్ట్‌ స్పష్టం చేసింది. వాక్‌ స్వాతంత్య్రం,ఇంటర్నెట్‌ను ఉపయోగించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే స్వేచ్ఛ అనేవి ప్రాథమిక హక్కులనీ, నెట్‌పై నిషేధం వాటికి భంగం కలిగించడమేననీ కోర్ట్‌ అప్పుడే తేల్చింది.

అత్యవసరమై నిషేధం పెట్టినా దాన్ని పొడిగిస్తూ పోరాదనీ చెప్పింది. ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోవట్లేదు. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం మానేసి, దానికి ప్రత్యామ్నాయం నెట్‌పై నిషేధమే అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. ఇది పరిష్కారం కాదని సుప్రీమ్‌ తప్పుబట్టింది. కానీ, ఇప్పటి దాకా మణిపుర్‌ సర్కార్‌ చేసింది అదే. తాజాగా ఈ మార్చిలో పంజాబ్‌లో వేర్పాటువాద నేత పరారీ, జూలైలో హర్యానాలో మతఘర్షణల సమయంలో ఇతర ప్రభుత్వాలూ ఆ పనే చేశాయి. 

మణిపుర్‌లో మైతేయ్‌లకూ, కుకీలకూ మధ్య పేరుకున్న విద్వేషాన్ని పోగొట్టాలంటే పాలకులు చేయాల్సిన పని వేరు. ముందు సమన్యాయం పాటించాలి. అందరితోనూ సుహృద్భావ పూర్వక చర్చలు జరపాలి. తీవ్రవాద వర్గాన్ని ఏకాకిని చేయాలి. సమాజంలో సహనం, శాంతి, పరస్పర విశ్వాసం నెలకొనేలా ఒక్కొక్క అడుగూ వేయాలి. కానీ, ఒక వర్గానికే కొమ్ము కాస్తూ, సొంత సహచరుల నమ్మకమే కోల్పోయిన పాలకుడికి అది కష్టమే! 

ఇప్పటికీ మణిపుర్‌ సాధారణ స్థితికి రాలేదని వార్త. కానీ, అందుకు నెట్‌పై విరుచుకుపడడం సరికాదు. ఆ వివేకం ఇన్నాళ్ళకు మన పాలకులలో మేలుకొన్నట్టుంది. ‘డిజిటల్‌ ఇండియా’ స్వప్నంతో, నెలకు వెయ్యి కోట్ల సంఖ్యలో డిజిటల్‌ చెల్లింపులతో రొమ్ము విరుచుకుంటున్న దేశం తరచూ నెట్‌ ఆపేస్తే, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అది చెల్లదు.

నెట్‌ నిషేధంతో మణిపుర్‌ 60 లక్షల డాలర్లు, దేశవ్యాప్తంగా 400 కోట్ల డాలర్లు నష్టం వచ్చిందని అంచనా. బ్రిటీషు కాలపు టెలిగ్రాఫ్‌ చట్టం–1885ను అడ్డం పెట్టుకొని కోర్టులకు చిక్కకుండా యథేచ్ఛగా నెట్‌పై నిషేధం పెట్టడం పాలకులకు శోభనివ్వదు. మణిపూర్‌ ఉదంతంతోనైనా మన ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకొని, తీరు మార్చుకుంటే మనుషులకూ, మానవ హక్కులకూ మేలు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement