ఇక కనీస డౌన్‌లోడ్ స్పీడ్ చెప్పాల్సిందే..
ఆగస్టు 23 నుంచి మొబైల్ కంపెనీలకు అమలు
న్యూఢిల్లీ: మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి ఇకనుంచి టెలికం కంపెనీలు తమ యూజర్లకు(మొబైల్, డాంగిల్) కనీస డౌన్‌లోడ్ స్పీడ్‌ను తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. తాజాగా నియంత్రణ సంస్థ ట్రాయ్ వైర్‌లెస్ డేటా సర్వీసుల నిబంధనల నాణ్యతా ప్రమాణాల్లో చేసిన సవరణే దీనికి ప్రధాన కారణం. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల 23 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా వివిధ డేటా ప్లాన్ల వాడకం సమయంలో కనీసం 80 శాతానికి తక్కువకాకుండా ఈ చెప్పిన డౌన్‌లోడ్ వేగాన్ని టెల్కోలు తప్పకుండా అందించాల్సి ఉంటుంది. అయితే, కనీస డౌన్‌లోడ్ స్పీడ్ ఎంతుండాలనేది నిర్ధేశించలేదు.
ఈ ఏడాది మే నాటికి దేశంలో మొబైల్ ఫోన్‌లు, డాంగిల్స్ ద్వారా సుమారు 5 కోట్ల మంది ప్రజలు వైర్‌లెస్ ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్లు అంచనా. టెల్కోలు ట్రాయ్‌కు తెలిపిన సమాచారం మేరకు అత్యంత వేగవంతమైన 3జీ సేవల్లో కనీస డౌన్‌లోడ్ స్పీడ్ సెకనుకు 399 కిలోబైట్ల(కేబీపీఎస్) నుంచి 2.48 మెగాబైట్లు(ఎంబీపీఎస్) వరకూ ఉంటోంది. 3జీ, సీడీఎంఏ, ఈవీడీఓ సేవల్లో కనీస డౌన్‌లోడ్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌గాను, జీఎస్‌ఎం, సీడీఎంఏ-2జీలకు 56 కేబీపీఎస్‌గా, సీడీఎంఏ హైస్పీడ్ డేటా సేవలకు 512 కేబీపీఎస్‌గా ఉండాలనేది ట్రాయ్ సూచన. బాడ్‌బ్యాండ్‌కు కనీస స్పీడ్ 512 కేబీపీఎస్‌గా ఉండాలని ట్రాయ్ నోటిఫై చేయడం తెలిసిందే. టెలికం కంపెనీలు తమ ప్రచారంలో ఇష్టానుసారం స్పీడ్‌ను ప్రకటిస్తూ.. యూజర్లకు మాత్రం ఆస్థాయిలో సేవలను కల్పించడంలేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ట్రాయ్ తాజా చర్యలకు ఉపక్రమించింది.