Wireless internet
-
‘ప్రాథమిక’ సేవగా బ్రాడ్ బ్యాండ్
-
‘ప్రాథమిక’ సేవగా బ్రాడ్ బ్యాండ్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్, టెలిఫోన్ మాదిరే ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ఒక ప్రాథమిక వినియోగ సేవగా (యుటిలిటీ) గుర్తించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు కోసం రైట్ ఆఫ్ వే చట్టం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హాకు లేఖ రాశారు. ఇప్పటికే తెలం గాణ ప్రభుత్వం చేసిన చట్టాన్ని, తాము చేపట్టిన ఇంటిం టికీ ఇంటర్నెట్ కార్యక్రమాన్ని ఈ లేఖలో వివరించారు. ఇంటర్నెట్ ప్రాధాన్యం, ప్రయోజనాలను లేఖలో ప్రస్తావించారు. ప్రజలు సమాచారం, ఇతర అవసరాల కోసం ఇంటర్నెట్పై ఆధారపడటం పెరిగిందని పేర్కొన్నారు. దిగువస్థాయి వర్గాలకు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీల వినియోగాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా సమాజంలోని అంతరాలను తగ్గించేందుకు ఇంటర్నెట్ సహకరిస్తుందని తెలిపారు. ప్రజల దైనందిన జీవితంలో ప్రభుత్వ సేవలు త్వరితంగా పొందడానికి ఇంటర్నెట్ ఒక ప్రధానమైన మాధ్యమంగా మారిందన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో అందరికీ ఇంటర్నెట్ను అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా మారిందన్నారు. ఈ మేరకు దీన్ని విద్యుత్, టెలిఫోన్, తాగునీరు వంటి ప్రాథమిక వినియోగ సేవల్లో ఒకటిగా గుర్తించాలన్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్కు డిమాండ్.. 3జీ, 4జీ సాంకేతిక పరిజ్ఞానంతో వైర్లెస్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినా హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్కు డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ డిమాండ్‌ను తీర్చడానికి హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం ఇంటింటికీ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ఏర్పాటు ఒక్కటే సరైన పరిష్కారమన్నారు. వీటి ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ తో పాటు టెలివిజన్ ప్రసారాలు, టెలిఫోన్ సేవలను అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభు త్వం చేపట్టిన భారత్ నెట్ అనే కార్యక్రమాన్ని అభినం దించిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద చేపట్టిన పలు కార్యక్రమాలను తన లేఖలో వివరించారు. నూతనంగా నిర్మించే ప్రతి భవన సముదా యానికి బ్రాడ్ బ్యాండ్ కేబుల్ డక్ట్ ఏర్పాటు చేయాలని ట్రాయ్ ఇచ్చిన సూచనను, ఈ మధ్య జరిగిన టెలికాం కమిషన్ సమావేశంలో ఆమోదం తెలిపిన విషయాన్ని మంత్రి తన లేఖలో ప్రస్తావించారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
డి-లింక్‌తో సర్కారు ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: వైర్లెస్ ఇంటర్నెట్ పరికరాల తయారీలో పేరొందిన డి-లింక్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తైవాన్ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో సంస్థ సీఈవో ఓసియో, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంవోయూపై శుక్రవారం సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తాజా ఎంవోయూ ద్వారా తెలంగాణలో డి-లింక్ సంస్థ రూ.350 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని చెప్పా రు. సుమారు వెయ్యికిపైగా ఉద్యోగావకాశాలు ప్రత్యక్షంగా, వేల సంఖ్యలో ఉపాధి అవకాశా లు పరోక్షంగా తెలంగాణ యువతకు దక్కనున్నట్లు తెలిపారు. ఎంవోయూ మేరకు డి-లింక్ సంస్థ తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో విస్తరించనుందని వెల్లడించారు. నెట్వర్కింగ్ శిక్షణా కేంద్ర ం పేరిట ఒక అకాడమీ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ, ఉద్యోగాల కల్పన చేపట్టనున్నట్లు వివరించారు. వైఫై సేవలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలతో వైర్లెస్ సేవలను అందించనుందని తెలిపారు. న్యూ కిన్సో కంపెనీకి స్వాగతం.. ఎక్విప్మెంట్ తయారీలో అగ్రగామిగా ఉన్న న్యూకిన్సో కంపెనీ సీఈవో సిమెన్ షెన్‌తో భేటీ అయిన మంత్రి కేటీఆర్ సంస్థ ప్రతినిధులను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. అనంతరం వోల్ట్రెక్ కంపెనీ ప్రెసిడెంట్ జేమ్స్ చెన్‌తో సమావేశమైన మంత్రి.. హైదరాబాద్‌లో వోల్ట్రెక్ కంపెనీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పం దించిన జేమ్స్.. తమ బృందాన్ని త్వరలో హైదరాబాద్‌కు పంపుతామని హామీ ఇచ్చారు. ఇండియా-తైవాన్ కోఆపరేషన్ ఫోరమ్ సమావేశానికి హాజరైన ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతి నిధులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగిం చారు. తెలంగాణలో పెట్టుబడుల పెట్టేందుకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానాలను వివరించారు. -
మైక్రోసాఫ్ట్ ‘వైట్‌ఫై’ వస్తోంది
టీవీ తరంగాల ద్వారా వైర్లెస్ ఇంటర్నెట్ ⇒ భారీగా తగ్గనున్న ఇంటర్నెట్ వ్యయం ⇒ మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘వైట్ ఫై’ రెడీ అవుతోంది. టీవీ తరంగాల ద్వారా వైర్లెస్ ఇంటర్నెట్ను అందించే ఈ టెక్నాలజీని భారత్‌లో పైలట్ కింద చేపట్టేందుకు టెలికం శాఖకు చెందిన వైర్లెస్ ప్లానింగ్, కోఆర్డినేషన్ వింగ్‌కు కంపెనీ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. అనుమతి రాగానే ఆంధ్రప్రదేశ్‌తోపాటు బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తామని మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఎడ్యు క్లౌడ్ సేవలను ప్రారంభించిన సందర్భంగా మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైట్ ఫై టెక్నాలజీతో అతి తక్కువ వ్యయానికే వైర్లెస్ ఇంటర్నెట్ పొందొచ్చు. రూ.10 లక్షల వ్యయం కాగల ఒక రౌటర్ 10 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తుంది. ఎన్ని ఉపకరణాలకైనా ఇంటర్నెట్ను అందించొచ్చు. టెక్నాలజీని మేం అభివృద్ధి చేశాం. భాగస్వామ్యానికి ఎవరైనా ముందుకు రావొచ్చు’ అని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ ఎడ్యు క్లౌడ్..: ఎడ్యు క్లౌడ్ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత డిజిటల్ బోధనను అందిస్తారు. పుస్తకాలకు బదులుగా ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ వంటి కంప్యూటర్ ఉపకరణం ద్వారా విద్యా బోధన సాగుతుంది. ఈ సేవలకై తొలిసారిగా శ్రీ చైతన్య స్కూల్స్ మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. 18 నెలల్లో 1,500 విద్యా సంస్థలకు సేవలను విస్తరించడం ద్వారా 10 లక్షల మంది బోధకులు, 60 లక్షల మంది విద్యార్థులకు డిజిటల్ బోధన అందించాలన్నది మైక్రోసాఫ్ట్ లక్ష్యం. ఎడ్యు క్లౌడ్‌తో బోధకులు, విద్యార్థుల ఉత్పాదకత పెరుగుతుందని భాస్కర్ ప్రామాణిక్ తెలిపారు. ఇక ప్రతిపాదిత క్లౌడ్ డేటా కేంద్రాలు పశ్చిమాన రెండు, దక్షిణాదిన ఒకటి డిసెంబరుకల్లా రానున్నాయని వివరించారు. విద్యార్థులు ఇక పుస్తకాలకు బదులుగా పాఠశాలకు కేవలం ట్యాబ్లెట్ పీసీతో వస్తారని శ్రీ చైతన్య స్కూల్స్ వ్యవస్థాపకులు బీఎస్ రావు అన్నారు. డిజిటల్ బోధనలో భాగంగా 3డీ యానిమేషన్, గ్రాఫిక్స్‌తో పిల్లలు సులువుగా పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం 80 కేంద్రాల్లో 3-5వ తరగతి విద్యార్థులు, బోధకులతో కలిపి 14,000 మందికి లెనోవో మిక్స్3 ట్యాబ్లెట్స్‌తో ఎడ్యు క్లౌడ్‌ను పరిచయం చేస్తున్నట్టు శ్రీ చైతన్య స్కూల్స్ డెరైక్టర్ శ్రీచరణ్ వీరమాచనేని వెల్లడించారు. దశలవారీగా మిగిలిన తరగతులకూ విస్తరిస్తామని చెప్పారు. -
ఇక కనీస డౌన్లోడ్ స్పీడ్ చెప్పాల్సిందే..
ఆగస్టు 23 నుంచి మొబైల్ కంపెనీలకు అమలు న్యూఢిల్లీ: మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి ఇకనుంచి టెలికం కంపెనీలు తమ యూజర్లకు(మొబైల్, డాంగిల్) కనీస డౌన్లోడ్ స్పీడ్‌ను తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. తాజాగా నియంత్రణ సంస్థ ట్రాయ్ వైర్లెస్ డేటా సర్వీసుల నిబంధనల నాణ్యతా ప్రమాణాల్లో చేసిన సవరణే దీనికి ప్రధాన కారణం. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల 23 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా వివిధ డేటా ప్లాన్ల వాడకం సమయంలో కనీసం 80 శాతానికి తక్కువకాకుండా ఈ చెప్పిన డౌన్లోడ్ వేగాన్ని టెల్కోలు తప్పకుండా అందించాల్సి ఉంటుంది. అయితే, కనీస డౌన్లోడ్ స్పీడ్ ఎంతుండాలనేది నిర్ధేశించలేదు. ఈ ఏడాది మే నాటికి దేశంలో మొబైల్ ఫోన్లు, డాంగిల్స్ ద్వారా సుమారు 5 కోట్ల మంది ప్రజలు వైర్లెస్ ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్లు అంచనా. టెల్కోలు ట్రాయ్‌కు తెలిపిన సమాచారం మేరకు అత్యంత వేగవంతమైన 3జీ సేవల్లో కనీస డౌన్లోడ్ స్పీడ్ సెకనుకు 399 కిలోబైట్ల(కేబీపీఎస్) నుంచి 2.48 మెగాబైట్లు(ఎంబీపీఎస్) వరకూ ఉంటోంది. 3జీ, సీడీఎంఏ, ఈవీడీఓ సేవల్లో కనీస డౌన్లోడ్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌గాను, జీఎస్ఎం, సీడీఎంఏ-2జీలకు 56 కేబీపీఎస్‌గా, సీడీఎంఏ హైస్పీడ్ డేటా సేవలకు 512 కేబీపీఎస్‌గా ఉండాలనేది ట్రాయ్ సూచన. బాడ్బ్యాండ్కు కనీస స్పీడ్ 512 కేబీపీఎస్‌గా ఉండాలని ట్రాయ్ నోటిఫై చేయడం తెలిసిందే. టెలికం కంపెనీలు తమ ప్రచారంలో ఇష్టానుసారం స్పీడ్‌ను ప్రకటిస్తూ.. యూజర్లకు మాత్రం ఆస్థాయిలో సేవలను కల్పించడంలేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ట్రాయ్ తాజా చర్యలకు ఉపక్రమించింది. -
మార్కెట్లోకి ఆడి ఏ8ఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారత మార్కెట్లోకి ఆధునీకరించిన ఏ8ఎల్ మోడల్‌ను సోమవారమిక్కడ విడుదల చేసింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో దీని ప్రారంభ ధర రూ.1.15 కోట్లు. కొనేవారి అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేసినట్టయితే (కస్టమైజేషన్) ధర రూ.2.8 కోట్ల వరకు చేరుతుంది. కారు వెలుపలివైపు 100, లోపలివైపు 23 రంగుల్లో కస్టమర్లు తమను నచ్చిన రంగును ఎంచుకోవచ్చు. లగ్జరీ కార్ల విభాగంలో తొలిసారిగా మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ను పొందుపరిచారు. ఎదురుగా వస్తున్న వాహనాన్నిబట్టి వెలుతురును దానంతట అదే సరిదిద్దుకోవడం ఈ లైట్ల ప్రత్యేకత. గంటకు 100 కిలోమీటర్ల వేగానికి 4.6 సెకన్లలో చేరుకోవచ్చు. డీజిల్‌లో రెండు, పెట్రోల్‌లో ఒక వేరియంట్‌ను ప్రవేశపెట్టారు. పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కోణంలో చూడగలిగే కెమెరాలు, వైర్లెస్ ఇంటర్నెట్, పార్క్ అసిస్ట్ కారు ఇతర విశేషాలు. చిన్న నగరాల్లోనే వృద్ధి.. ఆంధ్రప్రదేశ్‌లో 2013లో 474 ఆడి కార్లు అమ్ముడయ్యాయి. ఆరేళ్లలో 1,600 పైగా కార్లు విక్రయించినట్టు ఆడి హైదరాబాద్ ఎండీ రాజీవ్ ఎం సంఘ్వీ మీడియాకు తెలిపారు. వరంగల్, నిజామాబాద్, రాజమండ్రి, గుంటూరు, భీమవరం తదితర చిన్న నగరాల్లో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు విక్రయించిన కార్లలో 25 శాతం ఈ నగరాల నుంచే ఉంటాయని వివరించారు. వృద్ధి రేటు అధికంగా 30 శాతముందని పేర్కొన్నారు. హైదరాబాద్, వైజాగ్‌లో వృద్ధి రేటు 4 శాతానికే పరిమితమైందన్నారు. ‘హైటెక్ సిటీ సమీపంలో ఆడి టెర్మినల్‌ను వచ్చే ఏడాదికల్లా నిర్మిస్తాం. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.20 కోట్లతో అత్యాధునికంగా రానుంది. విజయవాడలోనూ ఔట్లెట్ ఏర్పాటు కానుంది’ అని చెప్పారు. కొత్త బ్రాండ్లలోకి.. ఆడితోపాటు మహీంద్రా, అశోక్ లేలాండ్, మారుతి సుజుకీ వంటి తొమ్మిది బ్రాండ్లకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ డీలర్‌గా వ్యవహరిస్తోంది. మరిన్ని బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని రాజీవ్ సంఘ్వీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కొత్త విభాగాల్లోనూ ప్రవేశిస్తామని వెల్లడించారు. 2012-13లో గ్రూప్ టర్నోవర్ రూ.3,300 కోట్లు. ఆర్థిక మందగమనానికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.2,800 కోట్లు నమోదైందని ఆయన చెప్పారు. -
ఇక వైర్లెస్ పవర్!
న్యూయార్క్: వైర్లెస్ ఫోన్.. వైర్లెస్ ఇంటర్నెట్.. ఇప్పుడు ఇదే కోవలోకి వైర్లెస్ పవర్(తీగలు లేకుండా విద్యుత్) అందుబాటులోకి రానుంది. ఈ దిశగా అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. తక్కువ సామర్థ్యం కలిగిన మాగ్నటిక్ ఫీల్డ్స్‌ను ఉపయోగించడం ద్వారా ట్రాన్స్‌మీటర్, రిసీవర్ల మధ్య కొద్ది దూరం ఎటువంటి తీగలూ లేకుండా విద్యుత్‌ను డ్యూక్ వర్సిటీ ప్రొఫెసర్లు విజయవంతంగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇందుకోసం ఓ సూపర్లెన్స్ను రూపొందించారు. ఈ సూపర్లెన్స్ మాగ్నటిక్ ఫీల్డ్‌లోని ఒక పవర్ కాయిల్ నుంచి మరో కాయిల్‌కు విద్యుత్‌ను బదిలీ చేస్తుందని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ ప్రచురించింది. ఎటువంటి తీగలూ లేకుండా సురక్షితంగా.. విజయవంతంగా విద్యుత్‌ను బదిలీ చేయడం ఇదే తొలిసారి అని వెల్లడించింది. ఈ సూపర్లెన్స్ చూసేందుకు కొన్ని డజన్ల రూబిక్ క్యూబ్‌లను వరుసగా పేర్చినట్టుగా ఉంటుంది. వీటి లోపలి, వెలుపలి గోడలు రాగి తీగతో చుట్టి మైక్రోచిప్‌కు అనుసంధానం చేస్తారు. సూపర్లెన్స్కు ఒకవైపు పరిశోధకులు చిన్న కాపర్ కాయిల్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారానే విద్యుత్ సరఫరా అవుతుంది. కాయిల్స్ సైజ్‌ను పెంచడం ద్వారా విద్యుత్‌ను బదిలీ చేసే దూరాన్ని పెంచవచ్చని వర్సిటీ ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ యరోస్లావ్ ఉర్జుమోవ్ వివరించారు.