సాక్షి, హైదరాబాద్: విద్యుత్, టెలిఫోన్ మాదిరే ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ఒక ప్రాథమిక వినియోగ సేవగా (యుటిలిటీ) గుర్తించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు కోసం రైట్ ఆఫ్ వే చట్టం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హాకు లేఖ రాశారు. ఇప్పటికే తెలం గాణ ప్రభుత్వం చేసిన చట్టాన్ని, తాము చేపట్టిన ఇంటిం టికీ ఇంటర్నెట్ కార్యక్రమాన్ని ఈ లేఖలో వివరించారు. ఇంటర్నెట్ ప్రాధాన్యం, ప్రయోజనాలను లేఖలో ప్రస్తావించారు.
ప్రజలు సమాచారం, ఇతర అవసరాల కోసం ఇంటర్నెట్‌పై ఆధారపడటం పెరిగిందని పేర్కొన్నారు. దిగువస్థాయి వర్గాలకు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీల వినియోగాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా సమాజంలోని అంతరాలను తగ్గించేందుకు ఇంటర్నెట్ సహకరిస్తుందని తెలిపారు. ప్రజల దైనందిన జీవితంలో ప్రభుత్వ సేవలు త్వరితంగా పొందడానికి ఇంటర్నెట్ ఒక ప్రధానమైన మాధ్యమంగా మారిందన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో అందరికీ ఇంటర్నెట్‌ను అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా మారిందన్నారు. ఈ మేరకు దీన్ని విద్యుత్, టెలిఫోన్, తాగునీరు వంటి ప్రాథమిక వినియోగ సేవల్లో ఒకటిగా గుర్తించాలన్నారు.
హైస్పీడ్ ఇంటర్నెట్‌కు డిమాండ్..
3జీ, 4జీ సాంకేతిక పరిజ్ఞానంతో వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినా హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్‌కు డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ డిమాండ్‌ను తీర్చడానికి హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం ఇంటింటికీ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ఏర్పాటు ఒక్కటే సరైన పరిష్కారమన్నారు. వీటి ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ తో పాటు టెలివిజన్ ప్రసారాలు, టెలిఫోన్ సేవలను అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభు త్వం చేపట్టిన భారత్ నెట్ అనే కార్యక్రమాన్ని అభినం దించిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద చేపట్టిన పలు కార్యక్రమాలను తన లేఖలో వివరించారు.
నూతనంగా నిర్మించే ప్రతి భవన సముదా యానికి బ్రాడ్ బ్యాండ్ కేబుల్ డక్ట్ ఏర్పాటు చేయాలని ట్రాయ్ ఇచ్చిన సూచనను, ఈ మధ్య జరిగిన టెలికాం కమిషన్ సమావేశంలో ఆమోదం తెలిపిన విషయాన్ని మంత్రి తన లేఖలో ప్రస్తావించారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment