మార్కెట్లోకి ఆడి ఏ8ఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారత మార్కెట్లోకి ఆధునీకరించిన ఏ8ఎల్ మోడల్‌ను సోమవారమిక్కడ విడుదల చేసింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో దీని ప్రారంభ ధర రూ.1.15 కోట్లు. కొనేవారి అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేసినట్టయితే (కస్టమైజేషన్) ధర రూ.2.8 కోట్ల వరకు చేరుతుంది. కారు వెలుపలివైపు 100, లోపలివైపు 23 రంగుల్లో కస్టమర్లు తమను నచ్చిన రంగును ఎంచుకోవచ్చు. లగ్జరీ కార్ల విభాగంలో తొలిసారిగా మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ను పొందుపరిచారు. ఎదురుగా వస్తున్న వాహనాన్నిబట్టి వెలుతురును దానంతట అదే సరిదిద్దుకోవడం ఈ లైట్ల ప్రత్యేకత. గంటకు 100 కిలోమీటర్ల వేగానికి 4.6 సెకన్లలో చేరుకోవచ్చు. డీజిల్‌లో రెండు, పెట్రోల్‌లో ఒక వేరియంట్‌ను ప్రవేశపెట్టారు. పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కోణంలో చూడగలిగే కెమెరాలు, వైర్‌లెస్ ఇంటర్నెట్, పార్క్ అసిస్ట్ కారు ఇతర విశేషాలు.
చిన్న నగరాల్లోనే వృద్ధి..
ఆంధ్రప్రదేశ్‌లో 2013లో 474 ఆడి కార్లు అమ్ముడయ్యాయి. ఆరేళ్లలో 1,600 పైగా కార్లు విక్రయించినట్టు ఆడి హైదరాబాద్ ఎండీ రాజీవ్ ఎం సంఘ్వీ మీడియాకు తెలిపారు. వరంగల్, నిజామాబాద్, రాజమండ్రి, గుంటూరు, భీమవరం తదితర చిన్న నగరాల్లో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు విక్రయించిన కార్లలో 25 శాతం ఈ నగరాల నుంచే ఉంటాయని వివరించారు. వృద్ధి రేటు అధికంగా 30 శాతముందని పేర్కొన్నారు. హైదరాబాద్, వైజాగ్‌లో వృద్ధి రేటు 4 శాతానికే పరిమితమైందన్నారు. ‘హైటెక్ సిటీ సమీపంలో ఆడి టెర్మినల్‌ను వచ్చే ఏడాదికల్లా నిర్మిస్తాం. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.20 కోట్లతో అత్యాధునికంగా రానుంది. విజయవాడలోనూ ఔట్‌లెట్ ఏర్పాటు కానుంది’ అని చెప్పారు.
కొత్త బ్రాండ్లలోకి..
ఆడితోపాటు మహీంద్రా, అశోక్ లేలాండ్, మారుతి సుజుకీ వంటి తొమ్మిది బ్రాండ్లకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ డీలర్‌గా వ్యవహరిస్తోంది. మరిన్ని బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని రాజీవ్ సంఘ్వీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కొత్త విభాగాల్లోనూ ప్రవేశిస్తామని వెల్లడించారు. 2012-13లో గ్రూప్ టర్నోవర్ రూ.3,300 కోట్లు. ఆర్థిక మందగమనానికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.2,800 కోట్లు నమోదైందని ఆయన చెప్పారు.