సాక్షి, హైదరాబాద్: అవన్నీ దాదాపు పదేళ్లకు పైగా వృథాగా పడిఉన్న నివాస భవనాలు. కొనేవారు లేరన్న సాకుతో ఇప్పటివరకు అమ్మకుండా వదిలేశారు. తాజాగా అమ్మకానికి పెడితే అవే ఇప్పుడు హాట్‌కేకులుగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇళ్లను (ఫ్లాట్లు) కొనేందుకు జనం పోటీ పడుతున్నారు.
నగరంలోని బండ్లగూడ, పోచారంలలో ఉన్న స్వగృహ ఇళ్లను ఉన్నవి ఉన్నట్టుగా విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, దానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రెండు ప్రాజెక్టుల్లో కలిపి 3,716 ఇళ్లను విక్రయానికి ఉంచగా, శుక్రవారం మధ్యా హ్నం నాటికి 18,400 దరఖాస్తులు అందా యి. ఇంకా 18 రోజుల గడువు ఉండటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్ కంటే తక్కువ ధరకే ఇళ్లు అమ్మకా నికి ఉంచటంతో డిమాండ్ బాగా పెరిగింది.
బండ్లగూడలో ఒక్కో ఇంటికి 7 దరఖాస్తులు
అటు ఎల్‌బీనగర్.. ఇటు ఉప్పల్.. మెట్రో రైలుతో అనుసంధానమైన ప్రాంతం.. వెరసి బండ్లగూడలోని స్వగృహ ఇళ్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇక్కడ 2,246 ఇళ్లను విక్రయానికి ఉంచగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు 15,600 దరఖాస్తులు అందాయి. ఇక్కడ 2, 3 బీహెచ్‌కే, సాధారణ, డీలక్స్ మోడల్ ఇళ్లు కలిపి తొలుత 1,501 ఫ్లాట్లను విక్రయానికి ఉంచాలని భావించారు.
ఆ తర్వాత 745 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా చేర్చి నోటిఫికేషన్ జారీ చేశారు. దీని వెనుక భాగాన బాగా పేరున్న ఓ ప్రైవేటు వెంచర్, ఓ పక్కన వందల సంఖ్యలో చెట్లున్న ప్రభుత్వ ఖాళీ స్థలం ఉండగా.. ప్రధాన రహదారికి అతి చేరువగా ఉండటంతో ఇక్కడ ఫ్లాట్ కొనేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇప్పటివరకు ఒక ఇంటికి ఏడు చొప్పున దరఖాస్తులు వచ్చాయి.
పోచారంలో రెట్టింపు
బండ్లగూడతో పోలిస్తే నగరానికి కాస్త దూరంగా ఉన్న పోచారంలో ఉన్న ఇళ్లకు పోటీ కొంత తక్కువగా ఉంది. ఇక్కడ శుక్రవారం మధ్యాహ్నం వరకు 1,470 ఇళ్లకు గాను 2,800 దరఖాస్తులు అందాయి. అంటే ఇళ్ల సంఖ్యకు దాదాపు రెట్టింపు దరఖాస్తులు వచ్చాయన్నమాట. అయితే బండ్లగూడలో పోటీ ఎక్కువగా ఉండి, లాటరీలో ఇల్లు మంజూరు కాని పక్షంలో, కనీసం పోచారంలోనైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు.
ఇందుకోసం దరఖాస్తులో రెండో చాయిస్‌గా పోచారం ప్రాజెక్టును కూడా సూచిస్తున్నారు. ఇలావుండగా కొందరు బిల్డర్లు కూడా భారీగా ఇళ్లను బుక్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరకు ఈ ఇళ్లను దక్కించుకుని వాటిని ముస్తాబు చేసి ఎక్కువ ధరలకు అమ్ముకునే ఉద్దేశంతో దరఖాస్తు చేస్తున్నారని సమాచారం.
వృద్ధుల బ్లాక్‌కూ నోటిఫికేషన్
బండ్లగూడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా వంద ఇళ్లతో ఓ బ్లాక్‌ను అప్పట్లోనే నిర్మించారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడితే, నగరంలో ఉండే వృద్ధులైన తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో వీటిని నిర్మించారు. నడిచేటప్పుడు పట్టుకోవటానికి వీలుగా గోడలకు హోల్డింగ్ బార్స్, టాయిలెట్లలో జారి పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు, వైద్యుల కోసం ఏర్పాటు, ఓ సమావేశ మందిరం, సొంతంగా వండుకునే ఓపికలేని వారికోసం కామన్ కిచెన్ లాంటి వసతులు ఇందులో ఉన్నాయి.
కాగా వీటిని కూడా విక్రయించేందుకు 3 రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మూడు రోజుల్లో వీటికి 25 దరఖాస్తులు రావటం విశేషం. మిగతా ఇళ్ల ధరలకే వీటినీ విక్రయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment