ఫ్లాట్‌ ఖరీదు  రూ.111 కోట్లు | Mumbai: Expensive Real Estate Market The Cost Of The Flat Rs 111 Crore | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌ ఖరీదు  రూ.111 కోట్లు

Published Sat, Jul 24 2021 12:15 AM | Last Updated on Sat, Jul 24 2021 1:09 AM

Mumbai: Expensive Real Estate Market The Cost Of The Flat Rs 111 Crore - Sakshi

కరోనా మహమ్మారి లగ్జరీ గృహాలను తాకలేదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, లగ్జరీ ప్రాపర్టీ ధరల క్షీణత, కొన్ని నగరాలలో స్టాంప్‌డ్యూటీ, సర్కిల్‌ ధరల తగ్గింపులు వంటివి డిమాండ్‌ వృద్ధికి కారణాలుగా చెప్పొచ్చు. ఈ ఏడాది జనవరి–జూన్‌ (హెచ్‌1) మధ్య కాలంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డ్‌ స్థాయిలో లగ్జరీ ప్రాపర్టీలు రూ.4 వేల కోట్లకు పైగా లావాదేవీలను నమోదు చేశాయని స్క్వేర్‌ యార్డ్స్‌ రిపోర్ట్‌ తెలిపింది. ఈ ఏడాది హెచ్‌1లో హైదరాబాద్‌లో ప్రీమియం గృహాల విక్రయాలు 158 శాతం వృద్ధిని నమోదు చేశాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా పేర్కొంది.

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అత్యంత ఆకర్షణీయమైన, ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ముంబై ఒకటని మరోసారి రుజువైంది. ఈ ఏడాది హెచ్‌1లో ముంబైలో రూ.15 కోట్లకు పైగా ధర ఉండే లగ్జరీ గృహాల లావాదేవీలపై స్క్వేర్‌ యార్డ్స్‌ నివేదికను విడుదల చేసింది. హెచ్‌1లోని మొత్తం గృహ విక్రయాలలో రూ.15 కోట్లకు పైగా ధర  ఉండే గృహాలు 45 శాతం, రూ.30–40 కోట్ల ధర ఉండేవి 10 శాతం, రూ.50 కోట్లపైగానే ధర ఉండే గృహాలవి 7 శాతం లావాదేవీలు జరిగాయి.

60 శాతం లగ్జరీ గృహాల లావాదేవీలు సౌత్‌ ముంబైలోని లోయర్‌ పరేల్‌లోని నివాస ప్రాజెక్ట్‌లలోనే కేంద్రీకృతమయ్యాయి. ప్రభుత్వం స్టాంప్‌డ్యూటీని 2 శాతం తగ్గించడం, అధిక విలువ గల గృహాల ధరలలో 15–30 శాతం క్షీణించడం వంటివి లగ్జరీ ప్రాపర్టీల డిమాండ్‌కు ప్రధాన కారణమని స్క్వేర్‌ యార్డ్స్‌ బిజినెస్‌ హెడ్‌ ఆనంద్‌ మూర్తి తెలిపారు. 58 శాతం లావాదేవీలు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో జరగగా.. 14 శాతం తుది దశకు చేరుకున్న నిర్మాణాలలో, 28 శాతం నిర్మాణంలో ఉన్న వాటిల్లో జరిగాయి. 

స్టాంప్‌డ్యూటీ తగ్గింపుతోనే జోరు.. 
ఈ ఏడాది మార్చి 31 వరకు 2 శాతం స్టాంప్‌డ్యూటీ మినహాయింపు అందు బాటులో ఉండటంతో జనవరి–మార్చి (క్యూ1) వరకు రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. ఆ తర్వాత త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. క్యూ1తో పోలిస్తే క్యూ2లో రిజిస్ట్రేషన్లు 73 శాతం తగ్గాయి. క్యూ1లోని మొత్తం రిజిస్ట్రేషన్ల లావాదేవీలలో లగ్జరీ గృహాల వాటా 79 శాతంగా ఉంది. వీటి విలువ రూ.3 వేల కోట్ల పైమాటే. ఇక క్యూ2 నాటికి వీటి వాటా 21 శాతానికి క్షీణించింది. విలువ రూ.900 కోట్లుగా ఉంది. రూ.50–100 కోట్ల ధర ఉన్న లగ్జరీ గృహాల వాటా క్యూ1లో 4 శాతంగా ఉండగా.. క్యూ2 నాటికి 1 శాతం క్షీణించి 3 శాతానికి చేరింది. క్యూ1లో రూ.100 కోట్లకు పైగా విలువ ఉన్న గృహాల వాటా 6 శాతంగా ఉండగా.. క్యూ2 నాటికి 2 శాతానికి చేరింది. 

ఎవరు కొన్నారంటే?
నలభై, అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అపార్ట్‌మెంట్లలో 34 శాతం లావాదేవీలు జరిగాయి. 43 శాతం ట్రాన్సాక్షన్స్‌ 4–6 వేల చ.అ. మధ్య విస్తీర్ణ గృహాలవే ఉన్నాయి. 67 శాతం గృహాలు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్లు కొనుగోలు చేయగా.. 40 శాతం లావాదేవీలు రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చెందిన వాళ్లే జరిపారు. బాంద్రాలోని మౌంట్‌మేరీ అపార్ట్‌మెంట్‌లో రూ.111 కోట్లతో 59,184 చ.అ.లలో అపార్ట్‌మెంట్‌ను అవధర్నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కొనుగోలు చేసింది. మలబార్‌ హిల్స్‌లోని సీసేన్‌లో రూ.103 కోట్లతో 7,833 చ.అ. ఫ్లాట్‌ను అబిస్‌ రియల్కాన్‌ కొన్నది.

లోయర్‌ పరేల్‌లోని రహేజా ఆర్టీసియాలో సుప్రీంకోర్ట్‌ న్యాయవాది నటాషా ఎస్‌ దాల్మియా 4,074 చ.అ. రెండు అపార్ట్‌మెంట్లను ఒక్కోటి రూ.34 కోట్లతో కొనుగోలు చేసింది. ఓశివారాలోని ది అట్లాంటిస్‌ ప్రాజెక్ట్‌లో అమితాబ్‌ బచ్చన్‌  5,704 చ.అ. ఫ్లాట్‌ను రూ.31 కోట్లతో కొనుగోలు చేశారు. ఇదే ప్రాజెక్ట్‌లో సన్నీలియోన్‌ 4,365 చ.అ. ఫ్లాట్‌ను రూ.16 కోట్లతో కొనుగోలు చేసింది. వీరితో పాటు సినీ నిర్మాతలు, దర్శకులు ఎల్‌ రాయ్, విపుల్‌ అమృతల్‌ షా, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపఖ్‌ పరేక్‌ భార్య స్మిత డీ పరేఖ్, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎండీ అండ్‌ సీఈఓ ధీరజ్‌ రెల్లీ, మహారాష్ట్ర మంత్రి అశోక్‌ ఎస్‌ చవాన్, గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఎండీ రజత్‌ సూద్‌ వంటి వాళ్లు జాబితాలో ఉన్నారు. రహేజా ఆర్టీసియా ప్రాజెక్ట్‌లో 18, ఇండియాబుల్స్‌ బ్లూలో 17, ఓంకార్‌ 1973, రహేజా వివేరా ప్రాజెక్ట్‌లలో చెరో 10 లావాదేవీలు జరిగాయి.

హైదరాబాద్‌లోనూ ప్రీమియం జోరు
కరోనా మహమ్మారి తర్వాతి నుంచి హైదరాబాద్‌లోనూ లగ్జరీ గృహాల విక్రయాలు, లాంచింగ్స్‌ జోరుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది హెచ్‌1లో 11,974 గృహాలు అమ్ముడుపోగా... రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న గృహాలు 44 శాతం, రూ.1–2 కోట్లకు పైన ధర ఉన్న యూనిట్లు 35 శాతం విక్రయమయ్యాయి. కొత్త గృహాల ప్రారంభాలను గమనిస్తే.. గతేడాది హెచ్‌2లోని మొత్తం లాంచింగ్స్‌లో లగ్జరీ గృహాల వాటా 18 శాతంగా ఉంది. అంటే మొత్తం 4,422 గృహాలు ప్రారంభం కాగా.. ఇందులో 1,544 యూనిట్లు రూ.1–2 కోట్ల మధ్య ధర ఉన్న లగ్జరీ అపార్ట్‌మెంట్లే. ఇక ఈ ఏడాది హెచ్‌2లో చూస్తే.. మొత్తం 16,712 గృహాలు లాంచింగ్‌ కాగా 28 శాతం వృది రేటుతో 4,444 యూనిట్లు లగ్జరీ ఇళ్లే ఉన్నాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది.

గండిపేట, కోకాపేట, మోకిల, శంకర్‌పల్లి, కొంపల్లి, బాచుపల్లి వంటి ప్రాంతాలలో ప్రీమియం అపార్ట్‌మెంట్లు, విల్లాలు, శివారు ప్రాంతాలలో వీకెండ్‌ హోమ్స్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 6 వేల చ.అ.ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా అంతస్తుకు ఒకటే అపార్ట్‌మెంట్‌ ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా కారణంగా ఆతిథ్య రంగంలోని కంపెనీలు విస్తరణ లేకపోవటంతో వాటి యజమానులు, క్యాపిటల్‌ గెయిన్‌ లాభాలను ఆర్జించే ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈ తరహా గృహాలను కొనుగోలు చేస్తున్నారని గిరిధారి కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ఇతర పొదుపు సాధనాల కంటే ఎక్కువ రాబడి, భద్రత, పన్ను ప్రోత్సాహకాలు ఉండటంతో రియల్టీలో పెట్టుబడులు పెరిగాయి. అవసరమైనప్పుడు ఎక్కువ ధరకు విక్రయించుకునే వీలుండటంతో దీని వైపే మొగ్గుచూపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement