swagruha
-
హాట్ కేకులవుతున్న స్వగృహ ఫ్లాట్లు
సాక్షి, హైదరాబాద్: అవన్నీ దాదాపు పదేళ్లకు పైగా వృథాగా పడిఉన్న నివాస భవనాలు. కొనేవారు లేరన్న సాకుతో ఇప్పటివరకు అమ్మకుండా వదిలేశారు. తాజాగా అమ్మకానికి పెడితే అవే ఇప్పుడు హాట్‌కేకులుగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇళ్లను (ఫ్లాట్లు) కొనేందుకు జనం పోటీ పడుతున్నారు. నగరంలోని బండ్లగూడ, పోచారంలలో ఉన్న స్వగృహ ఇళ్లను ఉన్నవి ఉన్నట్టుగా విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, దానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రెండు ప్రాజెక్టుల్లో కలిపి 3,716 ఇళ్లను విక్రయానికి ఉంచగా, శుక్రవారం మధ్యా హ్నం నాటికి 18,400 దరఖాస్తులు అందా యి. ఇంకా 18 రోజుల గడువు ఉండటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్ కంటే తక్కువ ధరకే ఇళ్లు అమ్మకా నికి ఉంచటంతో డిమాండ్ బాగా పెరిగింది. బండ్లగూడలో ఒక్కో ఇంటికి 7 దరఖాస్తులు అటు ఎల్బీనగర్.. ఇటు ఉప్పల్.. మెట్రో రైలుతో అనుసంధానమైన ప్రాంతం.. వెరసి బండ్లగూడలోని స్వగృహ ఇళ్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇక్కడ 2,246 ఇళ్లను విక్రయానికి ఉంచగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు 15,600 దరఖాస్తులు అందాయి. ఇక్కడ 2, 3 బీహెచ్‌కే, సాధారణ, డీలక్స్ మోడల్ ఇళ్లు కలిపి తొలుత 1,501 ఫ్లాట్లను విక్రయానికి ఉంచాలని భావించారు. ఆ తర్వాత 745 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా చేర్చి నోటిఫికేషన్ జారీ చేశారు. దీని వెనుక భాగాన బాగా పేరున్న ఓ ప్రైవేటు వెంచర్, ఓ పక్కన వందల సంఖ్యలో చెట్లున్న ప్రభుత్వ ఖాళీ స్థలం ఉండగా.. ప్రధాన రహదారికి అతి చేరువగా ఉండటంతో ఇక్కడ ఫ్లాట్ కొనేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇప్పటివరకు ఒక ఇంటికి ఏడు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. పోచారంలో రెట్టింపు బండ్లగూడతో పోలిస్తే నగరానికి కాస్త దూరంగా ఉన్న పోచారంలో ఉన్న ఇళ్లకు పోటీ కొంత తక్కువగా ఉంది. ఇక్కడ శుక్రవారం మధ్యాహ్నం వరకు 1,470 ఇళ్లకు గాను 2,800 దరఖాస్తులు అందాయి. అంటే ఇళ్ల సంఖ్యకు దాదాపు రెట్టింపు దరఖాస్తులు వచ్చాయన్నమాట. అయితే బండ్లగూడలో పోటీ ఎక్కువగా ఉండి, లాటరీలో ఇల్లు మంజూరు కాని పక్షంలో, కనీసం పోచారంలోనైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఇందుకోసం దరఖాస్తులో రెండో చాయిస్‌గా పోచారం ప్రాజెక్టును కూడా సూచిస్తున్నారు. ఇలావుండగా కొందరు బిల్డర్లు కూడా భారీగా ఇళ్లను బుక్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరకు ఈ ఇళ్లను దక్కించుకుని వాటిని ముస్తాబు చేసి ఎక్కువ ధరలకు అమ్ముకునే ఉద్దేశంతో దరఖాస్తు చేస్తున్నారని సమాచారం. వృద్ధుల బ్లాక్‌కూ నోటిఫికేషన్ బండ్లగూడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా వంద ఇళ్లతో ఓ బ్లాక్‌ను అప్పట్లోనే నిర్మించారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడితే, నగరంలో ఉండే వృద్ధులైన తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో వీటిని నిర్మించారు. నడిచేటప్పుడు పట్టుకోవటానికి వీలుగా గోడలకు హోల్డింగ్ బార్స్, టాయిలెట్లలో జారి పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు, వైద్యుల కోసం ఏర్పాటు, ఓ సమావేశ మందిరం, సొంతంగా వండుకునే ఓపికలేని వారికోసం కామన్ కిచెన్ లాంటి వసతులు ఇందులో ఉన్నాయి. కాగా వీటిని కూడా విక్రయించేందుకు 3 రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మూడు రోజుల్లో వీటికి 25 దరఖాస్తులు రావటం విశేషం. మిగతా ఇళ్ల ధరలకే వీటినీ విక్రయిస్తారు. -
‘స్వగృహ’పై సర్కారు నజర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన సమయంలో రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణానికి ఎస్కలేషన్లు, నిర్మాణ సంస్థలకు చెల్లింపులు వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై సీఐడీ జరుపుతున్న దర్యాప్తులోనే రాజీవ్ స్వగృహకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయం వెలుగులోకి వచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే రెండు నిర్మాణ సంస్థలకు ఎస్కలేషన్లు ఇవ్వడం, కేవలం రెండు సంస్థలకే బకాయిలేమీ లేకుండా చెల్లింపులు చేయడంపై దర్యాప్తు అధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎస్కలేషన్లు, చెల్లింపులపై ఉమ్మడి రాష్ట్రంలోని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్నప్పటికీ.. నాడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాత్రపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా అధికారులు వెల్లడించారు. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసిన నాటి మంత్రి నేడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు నివేదికను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ‘ఎస్కలేషన్’ వెనుక ఏం జరిగింది? రాజీవ్ స్వగృహ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మధ్యతరగతి ప్రజలకు ప్రధాన పట్టణాల్లో అందుబాటు ధరలో సొంతిళ్లను నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వం సంకల్పించింది. వీటికోసం ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు, వివిధ బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలు ఖర్చు చేసినా ఇళ్లు పూర్తికాలేదు. దాదాపు పదేళ్లుగా నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో అటు కొనుగోలుదారులకు ఇళ్లు అందించలేకపోయింది. రుణాలు చెల్లించలేక కార్పొరేషన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు, వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల వ్యవహారంలో ఆర్థిక అవకతవకలు ఉన్నట్టుగా ప్రభుత్వానికి అప్పటి అధికారులు నివేదించినట్టుగా విశ్వసనీయ సమాచారం. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పంచాయతీరాజ్‌శాఖ అధీనంలో జరిగే నిర్మాణ పనుల్లో అమలయ్యే ఎస్కలేషన్ విధానం రాజీవ్ స్వగృహ ప్రాజెక్టుకు వర్తించదని అధికారులు చెప్పినా.. లెక్క చేయకుండా నాటి మంత్రుల కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. సీఎం పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడానికి ముందుగానే ఎస్కలేషన్‌ను వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం రెండు కంపెనీలకే ఎస్కలేషన్ వర్తింపచేయడంతో సహా బకాయిలన్నీ చెల్లించారు. జరిగిన పనులకే కాకుండా పాత పనులకూ ఎస్కలేషన్‌ను వర్తింపచేశారు. ఇదే సమయంలో రాజీవ్ స్వగృహ సంక్షోభాన్ని అధిగమించడానికి నివేదిక ఇవ్వాలంటూ నాటి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. అప్పటి ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, గృహ నిర్మాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల మంత్రి తోట నర్సింహం ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు, తీసుకున్న నిర్ణయాల్లో ఉత్తమ్ పాత్రపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించిన ఫైలును అధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కేవలం రెండు కంపెనీలకే ఎస్కలేషన్ అమలు చేసి సుమారు రూ.158 కోట్లు ఎక్కువగా చెల్లించినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం. చెల్లింపులు ఎవరికి? నాడు వివిధ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులను 10 కంపెనీలు చేపట్టాయి. వీటిలో 2013లో కేవలం రెండు కంపెనీలకే ఎస్కలేషన్‌తో పూర్తి బకాయిలను చెల్లించినట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మెసర్స్ డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ కేసీపీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు మాత్రమే పూర్తిగా చెల్లింపులు జరిగాయి. ఈ రెండు కంపెనీలకు 360.66 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఎస్కలేషన్‌ను వర్తింపజేసి 519.45 కోట్లు చెల్లింపులు జరిగినట్టుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ లావాదేవీలపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. -
‘స్వగృహ’లో సిద్ధమవుతున్న ప్లాట్లు
సర్వే చేస్తున్న ఇంజినీర్లు 200 గజాలతో 402 ప్లాట్లకు ప్రణాళిక తిమ్మాపూర్: మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ స్వగృహలో వ్యక్తిగత ప్లాట్ల ప్రక్రియ వేగవంతమవుతోంది. 2007లో రామకృష్ణకాలనీలో రాజీవ్ స్వగృహ కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం మొదట నిర్ణయించినా మధ్యలోనే ఆగిపోయింది. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా ఇళ్ల స్థానంలో ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్లకు కార్యరూపం దాలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని తిమ్మాపూర్ మండలం రామకృష ్ణకాలనీలో రాజీవ్ స్వగృహ స్థలంలో ప్లాట్లు సిద్ధమవుతున్నాయి. మూడు రోజులుగా ప్లాట్ల హద్దులు ఏర్పాటుకు సర్వే జరుగుతోంది. పలు చోట్ల హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. 90ఎకరాలు, 402ప్లాట్లు రాజీవ్ స్వగృహ పథకం కింద రామకృష్ణకాలనీలో అప్పటి ప్రభుత్వం 90ఎకరాలు సేకరించింది. అందులో 24 ఎకరాల భూమి కోర్టు పరిధిలో ఉంది. 2007లో రాజీవ్ స్వగృహ ఇళ్ల కోసం 7344 మంది రూ.5వేల చొప్పున డీడీలు చెల్లించారు. అయితే అందులో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు. కోర్టులో ఉన్న స్థలం, నిర్మాణాలు చేపట్టిన స్థలాలను వదిలి, మిగతా స్థలంలో 402 ప్లాట్లు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో ప్లాట్‌ను 200 గజాలుగా నిర్ణయించారు. గజానికి రూ.3వేల చొప్పున ప్లాట్‌కు రూ.6లక్షలు ధర నిర్ణయించారు. మూడు రోజులుగా ఇంజినీర్లు ప్లాట్ల ప్రక్రియ మొదలు పెట్టగా.. పలు ప్లాట్లు సిద్ధమయ్యాయి. ప్లాట్ల మధ్య 30ఫీట్లు, 40ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే 7344 మంది దరఖాస్తుదారులున్నా.. వారిలో 402 మందికే డ్రా ద్వారా ప్లాట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.