సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన సమయంలో రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణానికి ఎస్కలేషన్లు, నిర్మాణ సంస్థలకు చెల్లింపులు వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై సీఐడీ జరుపుతున్న దర్యాప్తులోనే రాజీవ్ స్వగృహకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయం వెలుగులోకి వచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే రెండు నిర్మాణ సంస్థలకు ఎస్కలేషన్లు ఇవ్వడం, కేవలం రెండు సంస్థలకే బకాయిలేమీ లేకుండా చెల్లింపులు చేయడంపై దర్యాప్తు అధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎస్కలేషన్లు, చెల్లింపులపై ఉమ్మడి రాష్ట్రంలోని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్నప్పటికీ.. నాడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాత్రపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా అధికారులు వెల్లడించారు. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసిన నాటి మంత్రి నేడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు నివేదికను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.
‘ఎస్కలేషన్’ వెనుక ఏం జరిగింది?
రాజీవ్ స్వగృహ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మధ్యతరగతి ప్రజలకు ప్రధాన పట్టణాల్లో అందుబాటు ధరలో సొంతిళ్లను నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వం సంకల్పించింది. వీటికోసం ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు, వివిధ బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలు ఖర్చు చేసినా ఇళ్లు పూర్తికాలేదు. దాదాపు పదేళ్లుగా నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో అటు కొనుగోలుదారులకు ఇళ్లు అందించలేకపోయింది. రుణాలు చెల్లించలేక కార్పొరేషన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు, వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల వ్యవహారంలో ఆర్థిక అవకతవకలు ఉన్నట్టుగా ప్రభుత్వానికి అప్పటి అధికారులు నివేదించినట్టుగా విశ్వసనీయ సమాచారం. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పంచాయతీరాజ్‌శాఖ అధీనంలో జరిగే నిర్మాణ పనుల్లో అమలయ్యే ఎస్కలేషన్ విధానం రాజీవ్ స్వగృహ ప్రాజెక్టుకు వర్తించదని అధికారులు చెప్పినా.. లెక్క చేయకుండా నాటి మంత్రుల కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.
సీఎం పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడానికి ముందుగానే ఎస్కలేషన్‌ను వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం రెండు కంపెనీలకే ఎస్కలేషన్ వర్తింపచేయడంతో సహా బకాయిలన్నీ చెల్లించారు. జరిగిన పనులకే కాకుండా పాత పనులకూ ఎస్కలేషన్‌ను వర్తింపచేశారు. ఇదే సమయంలో రాజీవ్ స్వగృహ సంక్షోభాన్ని అధిగమించడానికి నివేదిక ఇవ్వాలంటూ నాటి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. అప్పటి ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, గృహ నిర్మాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల మంత్రి తోట నర్సింహం ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు, తీసుకున్న నిర్ణయాల్లో ఉత్తమ్ పాత్రపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించిన ఫైలును అధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నట్టుగా టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కేవలం రెండు కంపెనీలకే ఎస్కలేషన్ అమలు చేసి సుమారు రూ.158 కోట్లు ఎక్కువగా చెల్లించినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం.
చెల్లింపులు ఎవరికి?
నాడు వివిధ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులను 10 కంపెనీలు చేపట్టాయి. వీటిలో 2013లో కేవలం రెండు కంపెనీలకే ఎస్కలేషన్‌తో పూర్తి బకాయిలను చెల్లించినట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మెసర్స్ డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ కేసీపీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు మాత్రమే పూర్తిగా చెల్లింపులు జరిగాయి. ఈ రెండు కంపెనీలకు 360.66 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఎస్కలేషన్‌ను వర్తింపజేసి 519.45 కోట్లు చెల్లింపులు జరిగినట్టుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ లావాదేవీలపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment