సాక్షి, హైదరాబాద్ : ఆలయాలకు వెలుగునివ్వాల్సిన ధూపదీప నైవేద్యం పథకాన్నీ దళారులు వదల్లేదు. ఆదాయం లేక, భక్తుల ఆదరణ అంతంతమాత్రంగానే ఉండి నిర్వహణ కూడా కష్టంగా మారిన ఆలయాల్లో నిత్య పూజలు నిర్వహించేందుకు దేవాదాయశాఖ సర్వ శ్రేయోనిధి నుంచి అందించే ధూపదీప నైవేద్యం నిధులు వచ్చేలా చూస్తామంటూ వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కో అర్చకుడి నుంచి రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు దండుకున్నారు. దీంతో అర్హతలతో ప్రమేయం లేకుండా దేవాలయాలు, అర్చకులు దీని పరిధిలోకి వచ్చినట్లు తెలిసింది. జాబితా ఇప్పటికే సిద్ధం కావడంతో ‘అర్హుల’ను గుర్తించి జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిధులు విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. కానీ అర్హతలతో సంబంధం లేకుండా డబ్బులిచ్చిన వారికి జాబితాలో చోటు దక్కిందన్న విషయం గుప్పుమనడంతో చివరి నిమిషంలో దాన్ని ఆపేశారు. దళారులు డబ్బు దండుకుని కొందరు అధికారుల సాయంతో జాబితాలోకి పేర్లు చేరేలా చేశారంటూ ముఖ్యమంత్రి, దేవాదాయశాఖమంత్రి కార్యాలయాలకు ఫిర్యాదులు అందాయి. దీంతో మంత్రి విచారణకు ఆదేశించారు. రెండు జిల్లాలకు ఓ సీనియర్ అధికారి చొప్పున ప్రస్తుతం విచారణ జరుగుతోంది. జాబితాలోకి ఎక్కిన ఒక్కో దేవాలయంవారీగా వారు వివరాలు సేకరిస్తున్నారు.
వేలాది ఆలయాలకు నిరాదరణ
రాష్ట్రంలో ఏమాత్రం ఆదాయం లేని, నిరాదరణకు గురవుతున్న దేవాలయాలు వేలల్లో ఉన్నాయి. దీంతో చాలాకాలంగా వాటికి సాయం చేయాలంటూ దేవాదాయశాఖకు వినతులు వస్తున్నాయి. ఇటీవలి వరకు ధూపదీప నైవేద్య పథకానికి కేవలం రూ. రెండున్నర వేలే అందేవి. దీంతో ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ. 6 వేలకు పెంచింది. అలాగే ఆలయాల సంఖ్యను 1,805 నుంచి కనీసం రెట్టింపు చేయాలని నిర్ణయించి చర్యలకు ఆదేశించింది. తొలుత అదనంగా 3 వేల ఆలయాలకు దీన్ని వర్తింపజేసేందుకు దేవాదాయశాఖ నోటిఫికేషన్ జారీ చేయగా భారీగా దరఖాస్తులు అందాయి. అర్హతలను బట్టి ఆలయాల సంఖ్యను 3 వేలకే పరిమితం చేయాల్సి రావడంతో రంగంలోకి దిగిన దళారులు వసూళ్లకు తెరలేపారు.
అర్హతలు లేకున్నా జాబితాలోకి..
ఆదాయం లేని ఆలయాల్లో నిత్య కైంకర్యాలు చేస్తున్న అర్చకులనే ఈ పథకం కోసం గుర్తించాల్సి ఉండగా ఆ అర్హతలతో ప్రమేయం లేకుండా డబ్బులిచ్చిన వారి వివరాలు జాబితాలోకి చేర్చారు. ఇందుకు దేవాదాయశాఖ అధికారులు కొందరు సహకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణ నివేదిక ఆధారంగానే ఆలయాలకు నిధులు విడుదల చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్ నిర్ణయించారు. ఫలితంగా జాబితా ప్రకటనలో కొంత ఆలస్యం కానుంది. వేతన సవరణ సమయంలో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డ దళారులపై చర్యలు తీసుకోకపోవడంతో ఈసారీ ఈ విచారణ తూతూమంత్రంగా జరుగుతుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా దృష్టి సారిస్తే తప్ప చర్యలుండవని స్వయంగా ఆ శాఖలోని కొందరు అధికారులే పేర్కొంటుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment