dhoopa deepa naivedyam scheme
-
అత్యధిక ఆలయాలతో అగ్రగామిగా అనంతపురం జిల్లా
అనంతపురం కల్చరల్: హైందవ సంప్రదాయంలో ఆలయానికి, అందులో పనిచేసే అర్చకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు వైభవంగా సాగిన అర్చక పురోహిత వ్యవస్థ కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఆర్థిక వనరులు అందక కుదేలవుతూ వచ్చింది. దీంతో చాలా అర్చక కుటుంబాలు వృత్తిని వదిలేసి ప్రత్యమ్నాయ మార్గాల్లో స్థిరపడిపోయిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అర్చకులకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్) సమర్పించేందుకు వీలుగా కొత్తగా పథకాన్ని తీసుకువచ్చారు. దీంతో ఆలయాలకు కొత్త శోభ చేకూరింది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరోసారి ఆలయ వ్యవస్థ చతికిలబడింది. 2019 తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలతో ఆలయాలకు పునః వైభవం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఆలయాలను డీడీఎన్ఎస్ పథకం కిందకు తీసుకువస్తూ తాజాగా జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అత్యధిక ఆలయాలతో అనంతపురం జిల్లా అగ్రగామిగా నిలిచింది. జిల్లాలో ఉరవకొండ టాప్.. రాష్ట్ర వ్యాప్తంగా డీడీఎన్ఎస్ పథకం కింద ఇప్పటి వరకూ 2,747 ఆలయాలు ఉండేవి. జగన్ సర్కార్ తాజా నిర్ణయంతో 4,367 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో అనంత జిల్లాలో 218 ఆలయాలు ఈ పథకం కింద ఉండేవి. తాజాగా 71 ఆలయాలను ఈ పథకం పరిధిలోకి తీసుకురావడంతో వీటి సంఖ్య 289కు చేరుకుంది. ఇందులోనూ ఉరవకొండ నియోజకవర్గం 75 ఆలయాలతో అగ్రస్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో 69 ఆలయాలతో తాడిపత్రి నియోజకవర్గం ఉంది. ఆలయానికి రూ.5 వేలు.. ఈ పథకం ద్వారా ప్రతి ఆలయానికి ధూప, దీప, నైవేద్యం ఖర్చులకు రూ. 2వేలు, పూజారి గౌరవ వేతనం కింద మరో రూ.3వేలు చొప్పున నెలకు రూ.5వేలను ప్రభుత్వం అందజేస్తుంది. ఆలయ పూజారి బ్యాంక్ ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. 30 వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు లేదా రెండున్నర ఎకరాల లోపు మాగాణి భూమి, ఐదెకరాల లోపు మెట్ట భూమి ఉంటేనే డీడీఎన్ఎస్ పథకం వర్తిస్తుంది. సంతోషంగా ఉంది దశాబ్ధానికి పైగా ఆ భగవంతుణ్ని నమ్ముకుని పూజలు చేస్తున్నా. గత ప్రభుత్వ పెద్దలకు మా దుస్థితి విన్నవించుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. చిన్నపాటి ఆలయాలకు సైతం గుర్తింపునిస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది. – చంద్రస్వామి, రామాలయం అర్చకుడు, ముచ్చుకోట 289 ఆలయాలకు వర్తింపజేశారు డీడీఎన్ఎస్ పథకంలో గతంలో కేవలం 129 ఆలయాలు మాత్రమే ఉండేవి. చాలా మంది అర్చకులు విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మేము పంపిన ప్రతిపాదనల్లో 306 ఆలయాలు ఉండగా ఇందులో అన్ని విధాలుగా అర్హత ఉన్న 289 ఆలయాలకు పథకాన్ని వర్తింపజేశారు. – రామాంజనేయులు, ఏసీ, దేవదాయ ధర్మదాయశాఖ -
1,840 ఆలయాలకు ధూప దీప నైవేద్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1,840 దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ పథకం అమల్లో ఉన్న 1,805 దేవాలయాలతోపాటు మరో 3 వేల ఆలయాల్లో అమలు చేయాల్సి ఉందని, తొలిదశలో భాగంగా 1,840 దేవాలయాలకు వర్తింపజేస్తున్నట్లు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధూప, దీప, నైవేద్య పథకం కింద చేసే ఆర్థిక సాయం సద్వినియోగం చేసుకోకపోతే ఆ గుడికి ఎప్పుడైనా సాయా న్ని నిలిపేస్తామన్నారు. ధూప దీప నైవేద్య పథకాన్ని సెప్టెంబర్ నుంచే వర్తింపజేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాకే దేవాలయాలకు పునర్వైభవం వచ్చి ందని పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 66 బంజారా దేవాలయాల్లోని పూజారులు, బావోజీలు, సాధు సంతులకు చోటు కల్పించినట్లు వెల్లడించారు. విశ్వకర్మల, మార్కండేయ దేవాలయా ల్లోని అర్చకులకూ గౌరవ వేతనం ఇస్తున్నట్లు చెప్పా రు. కొత్తగా ఇచ్చిన 1,840 ఆలయాలకు ఏడాదికి రూ.14.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం 3,645 ఆలయాల అర్చకులకు ఏడాదికి రూ.27.5 కోట్లను గౌరవవేతనం ద్వారా చెల్లిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,700 కొత్త ఆలయాల నిర్మాణంతోపాటు జీర్ణోధరణకు సర్వ శ్రేయో నిధి నుంచి రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. -
‘ధూపదీప నైవేద్యాన్నీ’ వదల్లేదు
సాక్షి, హైదరాబాద్ : ఆలయాలకు వెలుగునివ్వాల్సిన ధూపదీప నైవేద్యం పథకాన్నీ దళారులు వదల్లేదు. ఆదాయం లేక, భక్తుల ఆదరణ అంతంతమాత్రంగానే ఉండి నిర్వహణ కూడా కష్టంగా మారిన ఆలయాల్లో నిత్య పూజలు నిర్వహించేందుకు దేవాదాయశాఖ సర్వ శ్రేయోనిధి నుంచి అందించే ధూపదీప నైవేద్యం నిధులు వచ్చేలా చూస్తామంటూ వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కో అర్చకుడి నుంచి రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు దండుకున్నారు. దీంతో అర్హతలతో ప్రమేయం లేకుండా దేవాలయాలు, అర్చకులు దీని పరిధిలోకి వచ్చినట్లు తెలిసింది. జాబితా ఇప్పటికే సిద్ధం కావడంతో ‘అర్హుల’ను గుర్తించి జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిధులు విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. కానీ అర్హతలతో సంబంధం లేకుండా డబ్బులిచ్చిన వారికి జాబితాలో చోటు దక్కిందన్న విషయం గుప్పుమనడంతో చివరి నిమిషంలో దాన్ని ఆపేశారు. దళారులు డబ్బు దండుకుని కొందరు అధికారుల సాయంతో జాబితాలోకి పేర్లు చేరేలా చేశారంటూ ముఖ్యమంత్రి, దేవాదాయశాఖమంత్రి కార్యాలయాలకు ఫిర్యాదులు అందాయి. దీంతో మంత్రి విచారణకు ఆదేశించారు. రెండు జిల్లాలకు ఓ సీనియర్ అధికారి చొప్పున ప్రస్తుతం విచారణ జరుగుతోంది. జాబితాలోకి ఎక్కిన ఒక్కో దేవాలయంవారీగా వారు వివరాలు సేకరిస్తున్నారు. వేలాది ఆలయాలకు నిరాదరణ రాష్ట్రంలో ఏమాత్రం ఆదాయం లేని, నిరాదరణకు గురవుతున్న దేవాలయాలు వేలల్లో ఉన్నాయి. దీంతో చాలాకాలంగా వాటికి సాయం చేయాలంటూ దేవాదాయశాఖకు వినతులు వస్తున్నాయి. ఇటీవలి వరకు ధూపదీప నైవేద్య పథకానికి కేవలం రూ. రెండున్నర వేలే అందేవి. దీంతో ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ. 6 వేలకు పెంచింది. అలాగే ఆలయాల సంఖ్యను 1,805 నుంచి కనీసం రెట్టింపు చేయాలని నిర్ణయించి చర్యలకు ఆదేశించింది. తొలుత అదనంగా 3 వేల ఆలయాలకు దీన్ని వర్తింపజేసేందుకు దేవాదాయశాఖ నోటిఫికేషన్ జారీ చేయగా భారీగా దరఖాస్తులు అందాయి. అర్హతలను బట్టి ఆలయాల సంఖ్యను 3 వేలకే పరిమితం చేయాల్సి రావడంతో రంగంలోకి దిగిన దళారులు వసూళ్లకు తెరలేపారు. అర్హతలు లేకున్నా జాబితాలోకి.. ఆదాయం లేని ఆలయాల్లో నిత్య కైంకర్యాలు చేస్తున్న అర్చకులనే ఈ పథకం కోసం గుర్తించాల్సి ఉండగా ఆ అర్హతలతో ప్రమేయం లేకుండా డబ్బులిచ్చిన వారి వివరాలు జాబితాలోకి చేర్చారు. ఇందుకు దేవాదాయశాఖ అధికారులు కొందరు సహకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణ నివేదిక ఆధారంగానే ఆలయాలకు నిధులు విడుదల చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్ నిర్ణయించారు. ఫలితంగా జాబితా ప్రకటనలో కొంత ఆలస్యం కానుంది. వేతన సవరణ సమయంలో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డ దళారులపై చర్యలు తీసుకోకపోవడంతో ఈసారీ ఈ విచారణ తూతూమంత్రంగా జరుగుతుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా దృష్టి సారిస్తే తప్ప చర్యలుండవని స్వయంగా ఆ శాఖలోని కొందరు అధికారులే పేర్కొంటుండటం గమనార్హం. -
ధూపదీప నైవేద్యాలకు కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: ఆదాయం లేని దేవాలయాలపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపింది. ధూపదీప నైవేద్యాల పథకం కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.2,500ను రూ.6 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వు రేపోమాపో వెలువడనుంది. వరంగల్‌లో ఐదు నెలల క్రితం జరిగిన ఓ బహిరంగ సమావేశంలోనే సీఎం కేసీఆర్ దీనికి సానుకూలత వ్యక్తం చేసినా.. ఉత్తర్వు మాత్రం వెలువడలేదు. తమకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని అర్చకులు, దేవాలయ ఉద్యోగులు సమ్మెకు దిగిన నేపథ్యంలో దీనికి కూడా మోక్షం లభించింది. సమ్మె విరమణ కోసం శుక్రవారం రాత్రి అర్చక సంఘం, ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చర్చలు జరిపిన సందర్భంలో ధూపదీప నైవేద్యాల మొత్తం పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఖజానా నుంచి వేతనాలు చెల్లించే విషయంలో కమిటీని వేసి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రధాన హామీలకు సంబంధించి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం సీఎం కేసీఆర్‌ను కలసి వివరించారు. స్వయంగా తాను ఇచ్చిన హామీ కావటంతో ధూపదీప నైవేద్యాల మొత్తం పెంచే అంశాన్ని వెంటనే అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఖజానా వేతనాలపై కమిటీ ఏర్పాటు చేసి నెలరోజుల్లో నివేదిక అందజేసేలా ఆదేశించాలని పేర్కొన్నారు. డిమాండ్లు నెరవేరుస్తాం: ఇంద్రకరణ్ అర్చకుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అర్చకులకు, దేవాదాయశాఖ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్న డిమాండ్ అధ్యయనానికి కమిటీ వేస్తున్నామని, రెండు నెలల్లో దాన్ని కొలిక్కి తెస్తామన్నారు. ధార్మిక పరిషత్ ఏర్పాటుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఐదు జిల్లాలో చేస్తున్న పనులు 75 శాతం పూర్తయ్యాయని, జూలై తొలివారం నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. అర్చకుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించినందుకు సీఎం కేసీఆర్‌కు అర్చక సమాఖ్య గౌరవాధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, భాస్కరభట్ల రామశర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఖజానా వేతనాలపై కమిటీ అర్చకులు, దేవాలయ ఉద్యోగులకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించే అంశాన్ని అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాయిప్రసాద్, రెవెన్యూ(దేవాదాయ) ఉప కార్యదర్శి వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ రామకృష్ణారావు ఇందులో సభ్యులుగా ఉన్నారు. జూన్ చివరి నాటికి కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.