- సర్వే చేస్తున్న ఇంజినీర్లు
- 200 గజాలతో 402 ప్లాట్లకు ప్రణాళిక
‘స్వగృహ’లో సిద్ధమవుతున్న ప్లాట్లు
Published Wed, Aug 24 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
తిమ్మాపూర్: మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ స్వగృహలో వ్యక్తిగత ప్లాట్ల ప్రక్రియ వేగవంతమవుతోంది. 2007లో రామకృష్ణకాలనీలో రాజీవ్ స్వగృహ కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం మొదట నిర్ణయించినా మధ్యలోనే ఆగిపోయింది. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా ఇళ్ల స్థానంలో ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్లకు కార్యరూపం దాలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని తిమ్మాపూర్ మండలం రామకృష ్ణకాలనీలో రాజీవ్ స్వగృహ స్థలంలో ప్లాట్లు సిద్ధమవుతున్నాయి. మూడు రోజులుగా ప్లాట్ల హద్దులు ఏర్పాటుకు సర్వే జరుగుతోంది. పలు చోట్ల హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు.
90ఎకరాలు, 402ప్లాట్లు
రాజీవ్ స్వగృహ పథకం కింద రామకృష్ణకాలనీలో అప్పటి ప్రభుత్వం 90ఎకరాలు సేకరించింది. అందులో 24 ఎకరాల భూమి కోర్టు పరిధిలో ఉంది. 2007లో రాజీవ్ స్వగృహ ఇళ్ల కోసం 7344 మంది రూ.5వేల చొప్పున డీడీలు చెల్లించారు. అయితే అందులో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు. కోర్టులో ఉన్న స్థలం, నిర్మాణాలు చేపట్టిన స్థలాలను వదిలి, మిగతా స్థలంలో 402 ప్లాట్లు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో ప్లాట్‌ను 200 గజాలుగా నిర్ణయించారు. గజానికి రూ.3వేల చొప్పున ప్లాట్‌కు రూ.6లక్షలు ధర నిర్ణయించారు. మూడు రోజులుగా ఇంజినీర్లు ప్లాట్ల ప్రక్రియ మొదలు పెట్టగా.. పలు ప్లాట్లు సిద్ధమయ్యాయి. ప్లాట్ల మధ్య 30ఫీట్లు, 40ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే 7344 మంది దరఖాస్తుదారులున్నా.. వారిలో 402 మందికే డ్రా ద్వారా ప్లాట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Advertisement