పసిడి రుణాలే కీలకం | More Demand for Gold: CEO Rajiv Yadav | Sakshi
Sakshi News home page

పసిడి రుణాలే కీలకం

Published Wed, Jan 8 2025 1:11 AM | Last Updated on Wed, Jan 8 2025 7:56 AM

More Demand for Gold: CEO Rajiv Yadav

సుంకాల తగ్గింపుతో బంగారానికి మరింత డిమాండ్‌ 

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, 20 నిమిషాల్లోనే రుణాలు 

ఏయూ ఎస్‌ఎఫ్‌బీ డిప్యూటీ సీఈవో రాజీవ్‌ యాదవ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పసిడి రుణాలకు డిమాండ్‌ పెరుగుతోందని ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఏయూ ఎస్‌ఎఫ్‌బీ) డిప్యూటీ సీఈవో రాజీవ్‌ యాదవ్‌ తెలిపారు. రాబోయే 3–5 ఏళ్లలో తమ బ్యాంకు వృద్ధి వ్యూహాల్లో గోల్డ్‌ లోన్లు కీలక పాత్ర పోషించగలవని సాక్షి బిజినెస్‌ బ్యూరోకు వివరించారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఇరవై నిమిషాల్లోపే రుణాల మంజూరుతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెడుతున్నట్లు ఆయన చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. 

ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ పసిడికి డిమాండ్‌ పటిష్టంగానే ఉంది. ఐబీఈఎఫ్‌ అధ్యయనం ప్రకారం, పసిడిపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెపె్టంబర్‌ మధ్య కాలంలో గోల్డ్‌కు డిమాండ్‌ 18 శాతం పెరిగింది. ఆర్థిక అనిశి్చతులతో పాటు ఫైనాన్సింగ్‌ ఆప్షన్‌గా బంగారం రుణాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా గోల్డ్‌ లోన్లకు డిమాండ్‌ పెరుగుతోంది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రకారం భారత్‌లో కుటుంబాల వద్ద 25,000 టన్నుల పైగా బంగారం ఉన్నట్లు అంచనా.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సత్వరం, తక్కువ వడ్డీ రేటుపై రుణాలు తీసుకోవాలనుకునే వ్యక్తులు, వ్యాపారవర్గాలకు బంగారం రుణాలు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారాయి. మేము తక్కువ డాక్యుమెంటేషన్, సరళతరమైన ప్రక్రియతో కస్టమర్లకు సేవలు అందిస్తున్నాం. 12.99 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేటు, 20 నిమిషాల్లోపే వేగవంతంగా రుణ వితరణ, వ్యక్తిగత పరిస్థితులను బట్టి సరళతరమైన రీపేమెంట్‌ ఆప్షన్లు మొదలైన మార్గాల్లో మేము కస్టమర్లకు సరీ్వసులు అందిస్తున్నాం. విశ్వసనీయత, పారదర్శకత, సౌకర్యానికి పెద్ద పీట వేస్తున్నాం. 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భిన్నమైన ధోరణులు.. 
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గోల్డ్‌ లోన్‌ ధోరణులు భిన్నంగా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయ ఖర్చులు, చిన్న వ్యాపారాలు, అత్యవసర పరిస్థితుల కోసం బంగారం రుణాలు తీసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ రుణ సాధనాల లభ్యత పరిమితంగా ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల కోసం గ్రామీణ ప్రాంతాల కస్టమర్లు బంగారం రుణాలపై ఆధారపడుతుంటారు. ఇక పట్టణ ప్రాంతాల విషయానికొస్తే.. గోల్డ్‌ లోన్లను నిర్వహణ మూలధన అవసరాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తల వెంచర్లు, లైఫ్‌ స్టయిల్‌ ఖర్చులు మొదలైన వాటికోసం తీసుకుంటున్నారు.

పట్టణ ప్రాంతాల కస్టమర్లు సౌకర్యం, వేగానికి ప్రాధాన్యమిస్తూ సత్వరమైన, టెక్‌ ఆధారిత సొల్యూషన్స్‌ను కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే మేమూ సరీ్వసులు అందిస్తున్నాం. పసిడి ధరలు ఆల్‌–టైమ్‌ గరిష్ట స్థాయిల్లో ఉన్న నేపథ్యంలో ఇటు బ్యాంకు అటు కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా ఏయూ ఎస్‌ఎఫ్‌బీ పటిష్టమైన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలు పాటిస్తుంది. మెరుగైన లోన్‌–టు–వేల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తులను పాటిస్తుంది. ఎప్పటికప్పుడు పసిడి ధరల ధోరణులు, మార్కెట్‌ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ, పాలసీలను అలాగే పథకాలను తదనుగుణంగా మార్చుకుంటూ ఉంటోంది. 

వృద్ధి ప్రణాళికలు .. 
మా పసిడి రుణాల పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సుమారు రూ. 1,986 కోట్లుగా ఉంది. క్యూ1లో ఇది రూ. 1,791 కోట్లు. వచ్చే 3–5 ఏళ్లలో బ్యాంకు వృద్ధి వ్యూహాల్లో గోల్డ్‌ లోన్లు కీలక పాత్ర పోషించనున్నాయి. మా రిటైల్, ఎంఎస్‌ఎంఈ పోర్ట్‌ఫోలియోలను విస్తరించడంలో పసిడి రుణాలు గణనీయంగా తోడ్పడే అవకాశముంది. టెక్నాలజీని వినియోగించుకుంటూ, బ్రాంచ్‌ నెట్‌వర్క్‌ను విస్తరించి, స్థానిక మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఆఫర్లను అందించడం ద్వారా మా గోల్డ్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియోను మరింతగా పెంచుకునే ప్రణాళికలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement