మైక్రోసాఫ్ట్ ‘వైట్‌ఫై’ వస్తోంది | Microsoft India Launches Edu-Cloud With Aim to 'Make Learning Fun' | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్ ‘వైట్‌ఫై’ వస్తోంది

Published Wed, May 6 2015 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

మైక్రోసాఫ్ట్ ‘వైట్‌ఫై’ వస్తోంది

మైక్రోసాఫ్ట్ ‘వైట్‌ఫై’ వస్తోంది

టీవీ తరంగాల ద్వారా వైర్‌లెస్ ఇంటర్నెట్
భారీగా తగ్గనున్న ఇంటర్నెట్ వ్యయం
మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘వైట్ ఫై’ రెడీ అవుతోంది. టీవీ తరంగాల ద్వారా వైర్‌లెస్ ఇంటర్నెట్‌ను అందించే ఈ టెక్నాలజీని భారత్‌లో పైలట్ కింద చేపట్టేందుకు టెలికం శాఖకు చెందిన వైర్‌లెస్ ప్లానింగ్, కోఆర్డినేషన్ వింగ్‌కు కంపెనీ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది.

అనుమతి రాగానే ఆంధ్రప్రదేశ్‌తోపాటు బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తామని మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఎడ్యు క్లౌడ్ సేవలను ప్రారంభించిన సందర్భంగా మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైట్ ఫై టెక్నాలజీతో అతి తక్కువ వ్యయానికే వైర్‌లెస్ ఇంటర్నెట్ పొందొచ్చు. రూ.10 లక్షల వ్యయం కాగల ఒక రౌటర్ 10 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తుంది. ఎన్ని ఉపకరణాలకైనా ఇంటర్నెట్‌ను అందించొచ్చు. టెక్నాలజీని మేం అభివృద్ధి చేశాం. భాగస్వామ్యానికి ఎవరైనా ముందుకు రావొచ్చు’ అని వెల్లడించారు.
 
మైక్రోసాఫ్ట్ ఎడ్యు క్లౌడ్..: ఎడ్యు క్లౌడ్ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత డిజిటల్ బోధనను అందిస్తారు. పుస్తకాలకు బదులుగా ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ వంటి కంప్యూటర్ ఉపకరణం ద్వారా విద్యా బోధన సాగుతుంది. ఈ సేవలకై తొలిసారిగా శ్రీ చైతన్య స్కూల్స్ మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. 18 నెలల్లో 1,500 విద్యా సంస్థలకు సేవలను విస్తరించడం ద్వారా 10 లక్షల మంది బోధకులు, 60 లక్షల మంది విద్యార్థులకు డిజిటల్ బోధన అందించాలన్నది మైక్రోసాఫ్ట్ లక్ష్యం. ఎడ్యు క్లౌడ్‌తో బోధకులు, విద్యార్థుల ఉత్పాదకత పెరుగుతుందని భాస్కర్ ప్రామాణిక్ తెలిపారు. ఇక ప్రతిపాదిత క్లౌడ్ డేటా కేంద్రాలు పశ్చిమాన రెండు, దక్షిణాదిన ఒకటి డిసెంబరుకల్లా రానున్నాయని వివరించారు.
 
విద్యార్థులు ఇక పుస్తకాలకు బదులుగా పాఠశాలకు కేవలం ట్యాబ్లెట్ పీసీతో వస్తారని శ్రీ చైతన్య స్కూల్స్ వ్యవస్థాపకులు బీఎస్ రావు అన్నారు. డిజిటల్ బోధనలో భాగంగా 3డీ యానిమేషన్, గ్రాఫిక్స్‌తో పిల్లలు సులువుగా పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం 80 కేంద్రాల్లో 3-5వ తరగతి విద్యార్థులు, బోధకులతో కలిపి 14,000 మందికి లెనోవో మిక్స్3 ట్యాబ్లెట్స్‌తో ఎడ్యు క్లౌడ్‌ను పరిచయం చేస్తున్నట్టు శ్రీ చైతన్య స్కూల్స్ డెరైక్టర్ శ్రీచరణ్ వీరమాచనేని వెల్లడించారు. దశలవారీగా మిగిలిన తరగతులకూ విస్తరిస్తామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement