ఇంఫాల్‌లో కర్ఫ్యూ
మణిపూర్ రాజధానిలో విధ్వంసకాండ
ఇంఫాల్: హింస, విధ్వంసాలతో అట్టుడుకుతున్న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి నిరవధిక కర్ఫ్యూ విధించింది. వదంతులను అరికట్టేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. గురువారం తీవ్రవాదుల దాడుల్లో ముగ్గురు పోలీసుల మృతి, శుక్రవారం నాటి మూడు బాంబు పేలుళ్లతోపాటు, చర్చిపై దాడి జరిగిందన్న వదంతులు ఇంఫాల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
ఇంఫాల్‌లో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ యునైటెడ్ నాగా కౌన్సిల్ చేపట్టిన ఆర్థిక దిగ్బంధాన్ని, తీవ్రవాదుల దాడులను నిరసిస్తూ ప్రజలు ఆదివారం ఆందోళనకు దిగారు. కార్లు, బస్సులు సహా 22 వాహనాలను ధ్వంసం చేసి, కొన్నింటికి నిప్పు పెట్టారు. పోలీసులు, పారామిలటరీ సిబ్బంది బాష్పవాయు గోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.