వచ్చే ఆరేళ్లలో మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో ‘కవచ్’ టెక్నాలజీని అమలు చేసేందుకు ప్రతిష్టాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రతను పెంచడానికి, స్టేషన్ సామర్థ్యాలను విస్తరించడానికి, సురక్షితమైన రైల్వే వ్యవస్థను నిర్ధారించడానికి తోడ్పడుతుందని చెప్పారు. రైల్వే రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని (పీపీపీ) ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అయితే మౌలిక సదుపాయాల యాజమాన్యం మాత్రం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
రెండు రైళ్లు ఒకే ట్రాక్‌మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీకొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా కవచ్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. రైల్వే భద్రత కోసం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థనే కవచ్‌గా పిలుస్తారు. పదేళ్ల పరీక్షలు, ట్రయల్స్ అనంతరం దాన్ని వినియోగించేందుకు రైల్వే బోర్డు గతంలో అనుమతించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2024 నాటికి దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే అంతటా 1,548 కిలోమీటర్లకు పైగా కవచ్‌ను విస్తరించారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా వంటి అధిక ప్రాధాన్యత గల మార్గాల్లో అదనంగా 3,000 కిలోమీటర్లను కవర్ చేయాలని గతంలో ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇదీ చదవండి: యూఎస్ సుంకాలపై నిర్మలా సీతారామన్ స్పందన
ప్రయాణికుల భద్రత, స్టేషన్ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైల్వేకు రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి చెప్పారు. అందులో భద్రతకు రూ.1.16 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల వినియోగంలో భాగంగా కవచ్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 10,000 లోకోమోటివ్‌ల ఏర్పాటు, ప్రతి స్టేషన్, బ్లాక్ సెక్షన్ వద్ద కవచ్ వ్యవస్థలను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. చాలాచోట్ల వ్యవస్థలో లోపం వల్ల రైల్వే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు తాత్కాలిక ఉపశమనం కింద ఆర్థిక, వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ఇది శాశ్వత పరిష్కారం కాదనేది వాస్తవం. ప్రమాదాల మూలాలను గమనించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment