రైలులో వాటర్ బాటిల్, టిఫిన్, మీల్స్, టీ, కాపీ.. వంటివి ఏదైనా కొనుగోలు చేస్తే కొన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేస్తుంటారు. ఇటీవల అలా అసలు ధర కంటే అధికంగా వసూలు చేసిన ఓ క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది.
పూజా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు వాటర్ బాటిల్ కొనాలని నిర్ణయించుకున్నాడు. క్యాటరింగ్ సర్వీస్ ద్వారా వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అందుకు సేల్స్‌మ్యాన్ రూ.20 డిమాండ్ చేశాడు. కానీ దాని ఎంఆర్‌పీ రూ.15 ఉంది. ఆ ప్రయాణికుడు రూ.5 తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు సేల్స్‌మ్యాన్ ఒప్పుకోలేదు. దాంతో ఆ ప్రయాణికుడు ఈ వ్యవహారం అంతా వీడియో తీసి ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేశాడు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించాడు. కొద్దిసేపటికి క్యాటరింగ్ సర్వీస్ నుంచి ఒక ప్రతినిధి వచ్చి ప్రయాణికుడి నుంచి అధికంగా వసూలు చేసిన రూ.5 తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. అయితే కోచ్‌లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సైతం తిరిగి చెల్లించాలని అభ్యర్థించాడు. అధిక ధరలు వసూలు చేస్తుండడంపై రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించింది. సదరు క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.ఒక లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.
139 पर आई ओवरचार्जिंग की शिकायत, रेलवे ने लिया फटाफट एक्शन, कैटरिंग कंपनी पर लगा एक लाख का जुर्माना।
यात्रियों को ओवर चार्जिंग की राशि की गई रिटर्न! pic.twitter.com/8ZaomlEWml— Ministry of Railways (@RailMinIndia) November 23, 2024
అధిక ఛార్జీలు, అనైతిక పద్ధతులకు వ్యతిరేకంగా భారతీయ రైల్వే కఠినమైన జీరో టాలరెన్స్ విధానానికి కట్టుబడి ఉందని తెలిపింది. ధరల నిబంధనలను అందరు విక్రేతలు కచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు తీపికబురు
భారతీయ రైల్వేకు ఫిర్యాదు చేయడానికి మార్గాలు
కాల్ 139: ఇది ఇంటిగ్రేటెడ్ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్.
ఆన్‌లైన్: భారతీయ రైల్వే వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు గురించి పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. సంఘటన తేదీ, పాల్గొన్న సిబ్బంది, ప్రాంతం వంటి వివరాలతో కూడిన ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.
రైల్‌మదద్: రైల్‌మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ నంబర్, ఓటీపీ, ప్రయాణ సమాచారం, రైలు నంబర్, పీఎన్‌ఆర్ నంబర్ వంటి వివరాలను అందించి కంప్లైంట్ చేయవచ్చు.
ఎస్‌ఎంఎస్: ఫిర్యాదును ఫైల్ చేయడానికి 91-9717680982కి ఎస్‌ఎంఎస్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment