జియో సమ్మర్ ఎఫెక్ట్: టెలికాం స్టాక్స్ ఢమాల్
జియో సమ్మర్ ఎఫెక్ట్: టెలికాం స్టాక్స్ ఢమాల్
Published Mon, Apr 3 2017 10:40 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
ఉచిత ఆఫర్లకు స్వస్తి చెప్పి, ఇక టారిఫ్ లు అమలు చేయబోతుందనుకున్న రిలయన్స్ జియో ఇచ్చిన సమ్మర్ సర్ప్రైజ్ ఎఫెక్ట్ టెలికాం దిగ్గజాలను తాకింది. జియో ప్రైమ్ ఆఫర్ గడువును మరో 15 పొడిగింపుతో పాటు, ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వారికి రూ.303 రీఛార్జ్ తో మరో మూడు నెలల పాటు కాంప్లిమెంటరీ సర్వీసుల కింద ఉచితంగా సేవలందించనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించడంతో ఇతర టెలికాం కంపెనీల ఇన్వెస్టర్లలో ఆందోళన ప్రారంభమైంది. దీంతో టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలో 3 శాతానికి పైగా పడిపోయాయి. సంచలనకరమైన జియో డేటా ఆఫర్లతో, ఉచిత కాల్స్ పై తమ బిజినెస్ అవుట్ లుక్ ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
ఇదే సమయంలో జియోలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు మంచి లాభాలు చేకూరుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో జియో షేర్లు 52 వారాల గరిష్టంలో 4.5 శాతం పైకి ఎగిసి రూ.1,380.50 వద్ద నమోదవుతోంది. ప్రైమ్ మెంబర్ షిప్ లో ఇప్పటికే 7 కోట్ల మంది కస్టమర్లను ఛేదించామని కంపెనీ ప్రకటించేసింది. ఈ ప్రకటన రిలయన్స్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ గా.. ఇతర టెలికాం కంపెనీల ఇన్వెస్టర్లకు ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 3.60 శాతం పైగా లాభాల్లో ట్రేడవుతుండగా.. ఐడియా సెల్యులార్ షేరు ధర 0.82 శాతం, ఎయిర్ టెల్ షేరు ధర 2.87 శాతం, వొడాఫోన్ 0.33 శాతం, భారతీ ఇన్ఫ్రాటెల్ 1.47శాతం నష్టాల్లో రన్ అవుతున్నాయి.
Advertisement