జియోపై దిగ్గజాల కౌంటర్ అటాక్
జియోపై దిగ్గజాల కౌంటర్ అటాక్
Published Wed, Feb 22 2017 8:54 AM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM
డేటా రేట్ల కోత దిశగా అడుగులు
కోల్ కత్తా : దాదాపు దశాబ్దం తర్వాత టెలికాం పరిశ్రమలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో దిగ్గజాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. తాజాగా జియో టారిఫ్ ప్లాన్స్ అమల్లోకి వస్తాయని ప్రకటించినప్పటికీ, ప్రైమ్ మెంబర్ షిప్ పేరుతో మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో టెల్కోలు తమ హై ఎండ్ కస్టమర్లను అలానే అట్టిపెట్టుకోవడానికి, జియోకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్లు వెంటనే డేటా రేట్ల కోతకు పిలుపు ఇవ్వబోతున్నాయని ఇండస్ట్రి విశ్లేషకులు చెబుతున్నారు. రూ.99 ప్రైమ్ మెంబర్ షిప్ ఫీజుతో పాటు, నెలకు మరో రూ.303లు చెల్లిస్తే హ్యాపీ న్యూఇయర్ కింద ప్రస్తుతం లభిస్తున్న ఉచిత డేటా, ఉచిత కాలింగ్ వంటి అన్ని ప్రయోజనాలను ఏడాదిపాటు పొందవచ్చని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం ప్రకటించారు.
ఈ తాజా ప్రకటనతో ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా టాప్-ఎండ్ కస్టమర్లు, ఇప్పటికే జియోను రెండో సిమ్ గా వాడుతున్న వారిని అంబానీ టార్గెట్ చేసినట్టు తెలిసింది. దీంతో తమ టాప్-ఎండ్ కస్టమర్లను కాపాడుకోవడంలో టెల్కోలు సిద్ధమయ్యాయి. ఈ టాప్-ఎండ్ కస్టమర్లే టెల్కోలకు 60 శాతం రెవెన్యూలకు పైగా అందిస్తున్నాయని ఓ సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ చెప్పారు.
ప్రస్తుతం టెల్కోలు అందిస్తున్న డేటా ఛార్జీలు
ఎయిర్ టెల్ : రూ.345కు అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 1జీబీ 4జీ డేటా
రూ.1495కు 90రోజుల పాటు 30జీబీ డేటా
వొడాఫోన్ : రూ.349కు అపరిమిత కాలింగ్, 50ఎంబీ 3జీ కస్టమర్లకు, 4జీ కస్టమర్లకు 1జీబీ 4జీ డేటా
రూ.1500కు 30రోజుల పాటు 35 జీబీ డేటా
ఐడియా : రూ.348కు అపరిమిత కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటా
4జీ హ్యాండ్ సెట్లలోకి అప్ గ్రేడ్ అయ్యే వారికి 4జీబీ 4జీ/3జీ డేటా
బీఎస్ఎన్ఎల్ : రూ.339కు అపరిమిత కాలింగ్, 28రోజుల పాటు 1జీబీ డేటా
వీటన్నింటికీ ఝలకిస్తూ జియో రూ.303కే నెలకు అపరిమిత కాలింగ్ ను, రోజుకు 1జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రస్తుత కస్టమర్లకే అందనుంది. 2018 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు రిలయన్స్ అధినేత ప్రకటించారు. దీంతో దిగ్గజాలు సైతం పైన పేర్కొన్న డేటా రేట్లను మరింత తగ్గించేందుకు యోచిస్తున్నాయి.
Advertisement