ఐడియా సెల్యులార్
బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్
ప్రస్తుత ధర: రూ. 160
టార్గెట్ ధర: రూ.190
ఎందుకంటే: వేగంగా వృద్ధి చెందుతున్న భారత టెలికం కంపెనీ ఇది. మార్కెట్ వాటా 17 శాతంగా ఉంది. 2010-14 కాలానికి టెలికం పరిశ్రమ రాబడి 6 శాతంగా ఉండగా, ఈ కంపెనీ రాబడి 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. ఇదే కాలానికి కంపెనీ మార్కెట్ వాటా 12 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. 12కు పైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రమైన పోటీ ఉన్న టెలికం పరిశ్రమలో నాలుగేళ్లలోనే మార్కెట్ వాటాను, రాబడులను చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచుకోవడం కంపెనీ పనితీరును ప్రతిబింబిస్తోంది. కంపెనీ బ్రాండ్ బిల్డింగ్ సామర్థ్యానికి, పటిష్టమైన నిర్వహణ తీరుకు ఇదే నిదర్శనం.
2014 ఆర్థిక సంవత్సరంలో నాలుగో క్వార్టర్‌లో 2.4గా ఉన్న రుణ, ఇబిటా నిష్పత్తి 2014-15 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ కల్లా 1.32కు తగ్గింది. పుష్కలంగా ఉన్న నగదు నిల్వలు, ఈక్విటీ పెరగడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కంపెనీలు టారిఫ్‌లను పెంచుతున్నాయి. రెండేళ్లలో ఈ టారిఫ్‌లు 7% వరకూ పెరుగుతాయని అంచనా. భారత్‌లో వాయిస్, డేటా మార్కెట్ మరింతగా వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఫలితంగా పటిష్టమైన ఆర్థిక స్థితి ఉన్న ఈ కంపెనీకి మంచి ప్రయోజనాలు అందనున్నాయి. అందుకని ప్రస్తుతమున్న ధర స్థాయి నుంచి ఈ కంపెనీ షేర్ 15-18 శాతం రేంజ్‌లో పెరగవచ్చని అంచనా వేస్తున్నాం.
గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ. 970
టార్గెట్ ధర: రూ.1,100
ఎందుకంటే: వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీ వ్యాపారం క్రమక్రమంగా పుంజుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో బిజినెస్ రికవరీ అధికంగా ఉంది. ఆఫ్రికా, నైజీరియా, దక్షిణాఫ్రికాల్లో వ్యాపారం మందగమనంగా ఉన్నా ఇండోనేసియాలో జోరుగా ఉంది. ముడిపదార్థాల ధరలు తగ్గుతుండటంతో ఉత్పత్తి వ్యయాలు తగ్గుతున్నాయి.
వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో ఆయా దేశాల కరెన్సీ మారక విలువల కారణంగా ప్రస్తుతం ఈ షేర్ డిస్కౌంట్‌కే ట్రేడవుతోంది. ముడిచమురు ధరలు తగ్గుతుండడంతో ముడి పదార్థాల ధరలు తగ్గి ఉత్పత్తి వ్యయాలు తగ్గనున్నాయి. ఉత్పత్తి వ్యయాలు 50 శాతం వరకూ తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. దీంట్లో కొంత భాగాన్ని వినియోగదారులకు డిస్కౌంట్/ఉచిత వస్తువుల రూపంలో అందించాలని యోచిస్తోంది. ఫలితంగా అమ్మకాలు మరింతగా పుంజుకుంటాయి.
కుదుటపడుతున్న ఆర్థిక ఫలితాల కారణంగా మరోవైపు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. డెంగ్యూ జ్వరంపై ఆందోళనల కారణంగా కంపెనీ హోమ్ ఇన్‌సెక్టిసైడ్స్ వ్యాపారం జోరుగా ఉంది. కంపెనీ అందిస్తున్న దోమలకు సంబంధించిన ఫాస్ట్‌కార్డ్ ఉత్పత్తి ఏడాది కాలంలోనే వంద కోట్ల రూపాయల అమ్మకాలు సాధించింది. సబ్బుల వ్యాపారం కూడా పుంజుకుంది.
స్టాక్స్ వ్యూ
Published Mon, Jan 5 2015 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM
Advertisement