
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో పెరిగిపోయిన సబ్బుల ధరలు కొంత దిగొచ్చాయి. సామాన్యుడికి కొంత ఊరట దక్కింది. ముడి పదార్థాల ధరలు క్షీణించడంతో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీలు సబ్బుల ధరలను 15 శాతం వరకు తగ్గించాయి. సబ్బుల్లో ప్రధానంగా వినియోగించే పామాయిల్ ధరలు ఇటీవల గణనీయంగా తగ్గడం తెలిసిందే. లైఫ్‌బోయ్, లక్స్ సబ్బులను 5–11 శాతం మధ్య పశ్చిమాది ప్రాంతంలో తగ్గించినట్టు హెచ్‌యూఎల్ ప్రకటించింది. గోద్రేజ్ నంబర్ 1, సింథాల్ తదితర బ్రాండ్లపై సబ్బులను విక్రయించే గోద్రేజ్ కన్జ్యూమర్ 13–15 శాతం మధ్య ధరలను తగ్గించింది. ధరలు తగ్గించడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో అధిక విక్రయాలు నమోదు కావచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది.
తొలి కంపెనీ మాదే..: గోద్రేజ్
గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీఎఫ్‌వో సమీర్ షా మాట్లాడుతూ.. ‘‘కమోడిటీల ధరలు దిగిరావడంతో ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసిన మొదటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీ గోద్రేజ్ కన్జ్యూమరే. గోద్రేజ్ నంబర్ 1 బండిల్ ప్యాక్ (100 గ్రాముల ఐదు సబ్బులు) ధరను రూ.140 నుంచి రూ.120కు తగ్గించాం’’అని వివరించారు. హెచ్‌యూఎల్ అధికార ప్రతినిధి లైఫ్‌బోయ్, లక్స్ ధరల తగ్గింపును ధ్రువీకరించారు. అదే సమయంలో సర్ఫ్, రిన్, వీల్, డవ్ తదితర ఉత్పత్తుల ధరలపై స్పందించలేదు. ‘‘గడిచిన ఏడాది కాలంలో హెచ్‌యూఎల్ సబ్బుల గ్రాములను తగ్గించి, ధరలను పెంచడంతో విక్రయాలపై ప్రభావం పడింది. ఇప్పుడు ధరలు తగ్గించడం కలిసొస్తుంది’’అని ఎడెల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అబ్నీష్ రాయ్ పేర్కొన్నారు.